WhatsApp: వాట్సాప్‌ యూజర్లకు అలర్ట్‌..! అదిరిపోయే కొత్త ఫీచర్‌ వచ్చేస్తోంది..!

వాట్సాప్ కొత్త 'ఆఫ్టర్ రీడింగ్' ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోంది. దీని ద్వారా మీరు పంపిన మెసేజ్‌లు గ్రహీత చదవగానే ఆటోమేటిక్‌గా డిలీట్ అవుతాయి. ఇది ప్రైవసీని పెంచుతుంది, సున్నితమైన సమాచారం పంచుకోవడానికి సురక్షితమైన మార్గాన్ని అందిస్తుంది. సాధారణ డిసప్పియరింగ్ మెసేజ్‌ల కంటే ఇది మరింత అధునాతనమైనది.

WhatsApp: వాట్సాప్‌ యూజర్లకు అలర్ట్‌..! అదిరిపోయే కొత్త ఫీచర్‌ వచ్చేస్తోంది..!
Whatsapp 3

Updated on: Mar 24, 2026 | 9:45 PM

ఇన్‌స్టంట్ మెసేజింగ్ రంగంలో ప్రైవసీకి మరింత ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో వాట్సాప్‌ యూజర్లకు భద్రతను మెరుగుపరచే కొత్త ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోంది. ఆఫ్టర్ రీడింగ్ అనే ఈ ఫీచర్ ద్వారా ఒక మెసేజ్‌ను గ్రహీత చదివిన వెంటనే అది స్వయంచాలకంగా తొలగిపోతుంది. టెక్ అప్‌డేట్లను ట్రాక్ చేసే WABetaInfo నివేదిక ప్రకారం ప్రస్తుతం ఈ ఫీచర్ పరిమిత స్థాయిలో పరీక్ష దశలో ఉంది. ఈ కొత్త ఫీచర్ సాధారణ డిసప్పియరింగ్ మెసేజెస్‌తో పోలిస్తే మరింత అధునాతనంగా ఉంటుంది. ఇప్పటివరకు వాట్సాప్‌లో ఉన్న ఫీచర్ ద్వారా సందేశాలు ఒక నిర్దిష్ట కాలవ్యవధి తర్వాత ఉదాహరణకు 1 గంట, 24 గంటలు లేదా ఒక నెల తొలగించబడతాయి. అయితే ఆఫ్టర్ రీడింగ్ ఫీచర్‌లో ఎలాంటి టైమర్ అవసరం లేదు. గ్రహీత మెసేజ్‌ను ఓపెన్ చేసిన వెంటనే అది అదృశ్యమవుతుంది.

ఈ ఫీచర్‌ను ఉపయోగించడానికి వినియోగదారు మెసేజ్ పంపే ముందు ఆఫ్టర్‌ రీడింగ్‌ ఎంపికను ఎంచుకోవాలి. ఆ తర్వాత పంపిన సందేశం గ్రహీత చూసిన వెంటనే ఆటోమేటిక్‌గా డిలీట్ అవుతుంది. ముఖ్యంగా సున్నితమైన లేదా గోప్యమైన సమాచారాన్ని పంచుకునే సందర్భాల్లో ఈ ఫీచర్ ఉపయోగకరంగా ఉండనుంది. చాట్‌లో ఎలాంటి ఆనవాళ్లు మిగలకుండా ఉండటం దీని ప్రధాన లక్షణంగా భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.26.12.2లో గుర్తించబడింది. అంటే ప్రపంచవ్యాప్తంగా విడుదలకు ముందు పరిమిత సంఖ్యలో వినియోగదారులతో పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ పరీక్షలు విజయవంతమైతే త్వరలోనే ఇది ఆండ్రాయిడ్, iOS వినియోగదారులందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

అయితే ఈ ఫీచర్ గోప్యతను మెరుగుపరచినప్పటికీ, స్క్రీన్‌షాట్‌లను పూర్తిగా నిరోధించగలదా అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. అయినప్పటికీ, డేటా భద్రతపై పెరుగుతున్న ఆందోళనల మధ్య, ఈ కొత్త ఫీచర్ వినియోగదారులకు మరింత నియంత్రణను అందించే కీలక మార్పుగా నిలిచే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

 

Follow Us