భారత ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్‌లోకి విన్‌ఫాస్ట్! మూడు కొత్త మోడళ్లతో ఎంట్రీ

వియత్నాంకు చెందిన విన్‌ఫాస్ట్, తమిళనాడులో కార్యకలాపాలు ప్రారంభించి, భారత ఈవీ మార్కెట్‌పై దృష్టి సారించింది. ఈవో, ఫెలిజ్, వైపర్ అనే మూడు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. తూత్తుకుడిలో అసెంబ్లీ కార్యకలాపాలు నిర్వహిస్తూ, వియత్నాం నుండి విడిభాగాలను దిగుమతి చేసుకుంటోంది.

భారత ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్‌లోకి విన్‌ఫాస్ట్! మూడు కొత్త మోడళ్లతో ఎంట్రీ
Vinfast Electric Scooters

Updated on: Apr 04, 2026 | 5:11 PM

తమిళనాడులో కార్యకలాపాలు ప్రారంభించిన వియత్నాం ఆధారిత ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ భారత మార్కెట్‌పై దృష్టి సారించింది. ఇప్పటికే విన్‌ఫాస్ట్ VF6, విన్‌ఫాస్ట్ VF7 ఎలక్ట్రిక్ SUVలతో వార్తల్లో నిలిచిన ఈ సంస్థ, ఇప్పుడు భారతీయ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఇవో, ఫెలిజ్, వైపర్ పేర్లతో రాబోయే ఈ స్కూటర్లు దేశీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్‌లో గట్టి పోటీని సృష్టించే అవకాశం ఉంది. ప్రస్తుతం కంపెనీ తమిళనాడులోని తూత్తుకుడిలో తన అసెంబ్లీ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అయితే ఈ వాహనాల విడిభాగాలను ప్రధానంగా వియత్నాం నుంచి దిగుమతి చేసుకుని, భారత్‌లో అసెంబుల్ చేయనుంది. మార్కెట్ డిమాండ్ పెరిగే కొద్దీ తూత్తుకుడిలో ఉత్పత్తి విస్తరణకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

సాంకేతిక వివరాల పరంగా చూస్తే ఈ మూడు స్కూటర్లు కూడా లిథియం అయాన్ బ్యాటరీలతో వస్తాయి. ఇవో మోడల్‌లో 2.4 కిలోవాట్-గంటల సామర్థ్యం గల రెండు బ్యాటరీలు, 2.25 కిలోవాట్ల హబ్ మోటార్ ఉండి, గరిష్టంగా గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఫెలిజ్ మోడల్‌లో 3 kWh బ్యాటరీ, 2.8 kW మోటార్ ఉండగా, వైపర్ మోడల్‌లో 4.8 kWh బ్యాటరీతో పాటు 3 kW మోటార్ అమర్చబడి ఉంటుంది. పనితీరు, శక్తి పరంగా ఈ మూడు మోడళ్లు వేర్వేరు వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపకల్పన చేయబడ్డాయి.

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, కొత్త కంపెనీలు మార్కెట్లోకి ప్రవేశించడం పోటీని మరింత పెంచుతోంది. ఇప్పటికే దేశీయంగా అనేక సంస్థలు ఈ విభాగంలో స్థిరపడగా, విన్‌ఫాస్ట్ ఎంట్రీతో మార్కెట్‌లో ధరలు, ఫీచర్లు, టెక్నాలజీ పరంగా మరింత పోటీ పెరిగే అవకాశముంది. మొత్తంగా భారత మార్కెట్‌కు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించిన ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లతో విన్‌ఫాస్ట్ తన స్థానం బలోపేతం చేసుకోవాలని చూస్తోంది. EV రంగంలో విస్తరణకు ఇది మరో కీలక అడుగుగా భావిస్తున్నారు.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us