Smartphone: వామ్మో.. ఇక కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలంటే కిడ్నీలు అమ్ముకోవాల్సిందే..

కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ బ్యాడ్ న్యూస్ మీ కోసమే. వచ్చే ఏడాదికి స్మార్ట్‌ఫోన్ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని ప్రముఖ మొబైల్ బ్రాండ్ 'నథింగ్' సీఈఓ కార్ల్ పీ సంచలన కామెంట్లు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకం పెరిగిపోవడంతో, గ్లోబల్ మార్కెట్‌లో మెమొరీ చిప్స్, సెమీకండక్టర్ల కొరత ఏర్పడింది. దీనివల్ల రాబోయే రోజుల్లో కొత్త ఫోన్ కొనాలంటే జేబుకు చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది. స్మార్ట్‌ఫోన్ తయారీకి అయ్యే ఖర్చు రోజురోజుకూ పెరిగిపోతుండడం కూడా స్మార్ట్‌ఫోన్‌ తయారీపై ప్రభావం చూపిస్తోంది.

Smartphone: వామ్మో.. ఇక కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలంటే కిడ్నీలు అమ్ముకోవాల్సిందే..
Smart Phones

Updated on: Jun 12, 2026 | 11:02 PM

గతంలో మొబైల్ కంపెనీల మధ్య పోటీ వల్ల తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లు కలిగిన ఫోన్లు మార్కెట్‌లోకి వచ్చేవి. కానీ ఇకపై ఆ రోజులు ఉండకపోవచ్చని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారీ డిస్కౌంట్లు ఇచ్చే పండుగ సీజన్ సేల్స్‌లో కూడా ఇకపై ఆఫర్లు తగ్గే ఛాన్స్‌ ఉంది. కంపెనీలు తమ లాభాలను కాపాడుకోవడానికి ఫోన్ల ధరలను 30 శాతానికి పైగా పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. స్మార్ట్‌ ఫోన్ కొనాలని ప్లాన్ చేసే వాళ్లు ఎక్కువ రోజులు వేచి చూస్తే మరింత ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఫోన్ల రేట్లు పెరగడానికి కారణం..

సోషల్ మీడియాలో కార్ల్ పీ షేర్ చేసుకున్న పలు వివరాల ప్రకారం.. ప్రస్తుతం మార్కెట్‌లో మెమొరీ చిప్‌ల ధరలు ఊహించని విధంగా 300 శాతం వరకు పెరిగాయి. గతంలో 20 డాలర్ల లోపు లభించే ప్రీమియం మెమొరీ కాంపోనెంట్స్ ధర, ఇప్పుడు 100 డాలర్లకు పెరిగింది.

దీంతో డిస్‌ప్లే, ప్రాసెసర్ కంటే మెమొరీ చిప్‌ల కోసమే కంపెనీలు ఎక్కువ ఖర్చు చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద టెక్ కంపెనీలు AI డేటా సెంటర్ల కోసం ఈ మెమొరీ వనరులను భారీగా కొనుగోలు చేస్తుండటమే ఈ సంక్షోభానికి కారణం. దీనివల్ల సాధారణ మొబైల్ కంపెనీలకు చిప్స్ దొరకడం కష్టంగా మారింది.

ఫీచర్లు తగ్గుతాయా..

ప్రస్తుత పరిస్థితుల్లో మొబైల్ తయారీ సంస్థల ముందు రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయి. ఒకటి, ఫోన్ ధరలను విపరీతంగా పెంచడం. రెండు, ర్యామ్, స్టోరేజ్ వంటి హార్డ్‌వేర్ ఫీచర్లను తగ్గించి పాత ధరలకే స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు చేయడం. ఈ ప్రభావం ‘నథింగ్’ కంపెనీపై కూడా పడనుంది. వారి రాబోయే కొత్త మోడల్స్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.

ఇప్పటికే భారత మార్కెట్‌లో కొన్ని ప్రీమియం ఫోన్ల ధరలు వాటి పాత మోడల్స్ కంటే రూ.7,000 వరకు పెరిగాయి. ఈ ధరల పెరుగుదల కొనసాగే ప్రమాదం ఉందని తెలుస్తోంది. అందుకే కొత్త ఫోన్ కొనేవారు ఇప్పుడే సరైన నిర్ణయం తీసుకోవడం మంచిది. హార్డ్‌వేర్ పరంగా మార్పులు చేయడం కష్టం కాబట్టి, ఇకపై కంపెనీలు సాఫ్ట్‌వేర్, డిజైన్‌పైనే ఎక్కువ శ్రద్ధ పెట్టనున్నాయి.

Follow Us