
ప్రస్తుత డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ మన దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైన భాగమైపోయింది. ఆఫీస్ వర్క్, ఆన్‌లైన్ క్లాసులు, వినోదం, స్మార్ట్ టీవీ, సీసీటీవీ కెమెరాలు.. ఇలా ఒకటేమిటి దాదాపు ఇంట్లోని ప్రతి పరికరం వై ఫై తోనే ముడిపడి ఉంది. దీనివల్ల ఇళ్లలో వై ఫై రూటర్లు నిరంతరాయంగా నడుస్తూనే ఉంటాయి. అయితే చాలా మందికి ఒక సందేహం వస్తుంటుంది. రాత్రి పడుకునేటప్పుడు వై ఫై రూటర్‌ను ఆఫ్ చేయాలా? లేక 24 గంటలూ ఆన్‌లోనే ఉంచాలా? అలా ఆన్‌లో ఉంచితే కరెంట్ బిల్లు భారీగా వస్తుందా? రూటర్ పాడైపోతుందా? దీనిపై టెక్ నిపుణులు కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. చాలా మంది రూటర్ వేడెక్కిపోతుందేమో లేదా పాడైపోతుందేమో అని భయపడుతుంటారు. కానీ వాస్తవం ఏంటంటే.. మార్కెట్లోకి వచ్చే చాలా వై ఫై రూటర్లను పగలు, రాత్రి తేడా లేకుండా 24/7 పనిచేసేలానే తయారీదారులు డిజైన్ చేస్తారు. వీటిని 24 గంటలూ ఆన్‌లో ఉంచడం వల్ల పరికరానికి సాధారణంగా ఎలాంటి సాంకేతిక సమస్యలు రావు.
రాత్రి ఆఫ్ చేసి, ఉదయం ఆన్ చేయడం వల్ల రూటర్ లైఫ్ పెరుగుతుందని అనుకుంటే పొరపాటే. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రూటర్‌ను తరచుగా ఆన్, ఆఫ్ చేయడం వల్ల దాని లోపల ఉండే సున్నితమైన ఎలక్ట్రానిక్ భాగాలపై, మదర్‌బోర్డ్‌పై అధిక ఒత్తిడి పడుతుంది. ప్రతిసారీ కరెంట్ సప్లై ఆగి మళ్లీ రావడం వల్ల కాలక్రమేణా హార్డ్‌వేర్ పనితీరు దెబ్బతిని, రూటర్ జీవితకాలం తగ్గిపోయే ప్రమాదం ఉంది.
విద్యుత్‌ను ఆదా చేయాలనే ఉద్దేశంతో చాలా మంది రాత్రి పూట వైఫై ఆఫ్ చేస్తుంటారు. కానీ నిజానికి ఒక సాధారణ Wi-Fi రూటర్ కేవలం 5 నుండి 20 వాట్ల విద్యుత్‌ను మాత్రమే వినియోగిస్తుంది. అంటే ఇదొక చిన్న ఎల్‌ఈడీ బల్బు లాంటిది. ఒకవేళ దీనిని నెల మొత్తం 24 గంటలూ ఆన్‌లో ఉంచినా కూడా, మీ కరెంట్ బిల్లులో మహా అయితే కొన్ని రూపాయల తేడా మాత్రమే ఉంటుంది. కాబట్టి కరెంట్ బిల్లు భయం అస్సలు అవసరం లేదు.
ఆటోమేటిక్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్: వై ఫై రూటర్ కంపెనీలు తమ సెక్యూరిటీ, ఫర్మ్‌వేర్ అప్‌డేట్లను ఎక్కువగా అర్ధరాత్రి సమయాల్లోనే విడుదల చేస్తాయి. రూటర్ ఆన్‌లో ఉంటే ఇవి బ్యాక్‌గ్రౌండ్‌లో అప్‌డేట్ అయి నెట్‌వర్క్ సేఫ్‌గా ఉంటుంది. ఆఫ్ చేస్తే అప్‌డేట్స్ ఆగిపోయి ఇంటర్నెట్ స్లో అయ్యే అవకాశం ఉంది.
స్మార్ట్ హోమ్ పరికరాలు: ఇంట్లో ఉండే సీసీటీవీ కెమెరాలు, స్మార్ట్ రిఫ్రిజిరేటర్లు, స్మార్ట్ లాక్స్ వంటివి రాత్రి పూట కూడా ఇంటర్నెట్‌తో కనెక్ట్ అయి పనిచేయాలంటే రూటర్ ఆన్‌లో ఉండటం తప్పనిసరి.
వై ఫైని ఎప్పుడూ ఆన్‌లో ఉంచడం మంచిదే అయినప్పటికీ.. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆఫ్ చేయడం తెలివైన నిర్ణయం..
మీరు కొన్ని రోజుల పాటు ఊరు వెళ్తున్నప్పుడు లేదా సుదీర్ఘ సెలవుల్లో ఉన్నప్పుడు రూటర్ ఆఫ్ చేయాలి.
వర్షాకాలంలో విపరీతంగా పిడుగులు పడుతున్నప్పుడు, పవర్ వోల్టేజ్ హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉన్నప్పుడు రూటర్ ప్లగ్ తీసేయడం వల్ల పరికరం కాలిపోకుండా రక్షణ లభిస్తుంది.
మీ ఇంటర్నెట్ స్పీడ్ సరిగ్గా ఉండాలన్నా, రూటర్ హ్యాంగ్ అవ్వకుండా ఉండాలన్నా.. ప్రతిరోజూ ఆఫ్ చేయనవసరం లేదు. కానీ వారానికి లేదా పది రోజులకు ఒకసారి కేవలం 1 లేదా 2 నిమిషాల పాటు రూటర్‌ను ఆఫ్ చేసి మళ్లీ ఆన్ చేయండి. దీనివల్ల రూటర్ క్యాచీ మెమరీ క్లియర్ అయి ఇంటర్నెట్ స్పీడ్ అద్భుతంగా పెరుగుతుంది.