OpenAI షాకింగ్‌ నిర్ణయం.. ఆ యాప్‌ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటన!

OpenAI తన వీడియో జనరేషన్ ప్లాట్‌ఫామ్ ‘సోరా’ను నిలిపివేసింది. ఎంటర్‌ప్రైజ్ సేవలపై దృష్టి సారించడం, అధిక కంప్యూటేషనల్ వనరుల వినియోగం, పోటీ తీవ్రత ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలు. సోరా విస్తృత ప్రాచుర్యం పొందినా, అధిక ఖర్చులు భరించడం కష్టంగా మారింది.

OpenAI షాకింగ్‌ నిర్ణయం.. ఆ యాప్‌ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటన!
Openai Sora

Updated on: Mar 26, 2026 | 8:00 AM

ఆర్టిఫిషీయల్‌ ఇంటెలిజెన్స్‌ రంగంలో కీలకమైన నిర్ణయంగా OpenAI తన వీడియో జనరేషన్ ప్లాట్‌ఫామ్ ‘సోరా’ (Sora)ను నిలిపివేయాలని ప్రకటించింది. ఈ నిర్ణయంతో సంస్థ తన ఉత్పత్తుల్లో వీడియో జనరేషన్‌కు ఇకపై మద్దతు ఇవ్వబోదని స్పష్టం చేసింది. ఎంటర్‌ప్రైజ్ సేవలపై దృష్టి పెట్టే వ్యూహంలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. సోరా అధికారిక ప్రకటనలో ఈ యాప్‌ను నిలిపివేయడం వినియోగదారులకు నిరాశ కలిగించవచ్చని పేర్కొంది. త్వరలోనే యాప్, API నిలిపివేతకు సంబంధించిన పూర్తి కాలక్రమాన్ని వెల్లడిస్తామని సంస్థ తెలిపింది. ఇదే సమయంలో ChatGPTలో కూడా వీడియో జనరేషన్ ఫీచర్లను నిలిపివేయనున్నట్లు సమాచారం.

ఈ నిర్ణయం వెనుక వ్యూహాత్మక కారణాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. సోరా వంటి టెక్స్ట్-టు-వీడియో మోడల్స్ భారీ స్థాయిలో కంప్యూటేషనల్ వనరులను వినియోగిస్తాయి. ముఖ్యంగా GPUలపై అధిక ఒత్తిడి పడటం వల్ల, ఆ వనరులను మరింత లాభదాయకమైన ఎంటర్‌ప్రైజ్ ఉత్పత్తులకు మళ్లించాలని కంపెనీ భావించినట్లు తెలుస్తోంది. సోరా వినియోగం పెరిగిన సమయంలో GPU వనరులపై తీవ్ర ఒత్తిడి ఏర్పడినట్లు సంస్థ అధికారులు గతంలో వెల్లడించారు. ఇదే సమయంలో ఆంత్రోపిక్ వంటి పోటీ సంస్థల నుంచి పెరుగుతున్న ఒత్తిడి కూడా ఈ నిర్ణయంపై ప్రభావం చూపినట్లు సమాచారం. పెద్ద ఎంటర్‌ప్రైజ్ కస్టమర్లను ఆకర్షించేందుకు OpenAI ఇప్పుడు మరింత దూకుడుగా ముందుకు సాగుతోంది. సంస్థ ఈ ఏడాది భారీ నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉన్న నేపథ్యంలో పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు కొత్త వ్యూహాలు అవలంబిస్తోంది.

ఇక వినోద రంగ దిగ్గజం ది వాల్ట్ డిస్నీ కంపెనీతో జరిగిన చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. అయితే ఇరువురి మధ్య పెట్టుబడి ఒప్పందం పూర్తి కాలేదని సమాచారం. ఈ పరిణామం డిస్నీని ఆశ్చర్యానికి గురి చేసినట్లు పేర్కొంటున్నారు. సోరా 2024లో పరిచయం కాగా 2025లో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. తక్కువ సమయంలోనే ఇది భారీ ప్రాచుర్యం పొందింది. ఫీచర్ ఫిల్మ్ స్థాయి వీడియోలను రూపొందించే సామర్థ్యంతో వినియోగదారులను ఆకట్టుకుంది. అయితే అధిక ఖర్చులు, వనరుల వినియోగం కారణంగా దీన్ని కొనసాగించడం కష్టంగా మారింది. భవిష్యత్తులో ChatGPT, కోడెక్స్, ఇతర AI సేవలను ఒకే ప్లాట్‌ఫారమ్‌గా విలీనం చేసే సూపర్ యాప్ అభివృద్ధిపై OpenAI దృష్టి పెట్టింది.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us