
సాధారణ బడ్జెట్ ఫోన్‌లలో కనిపించే ఫీచర్లకు భిన్నంగా Infinix Smart 20 HDలో Ultra Link అనే ప్రత్యేక సాంకేతికతను అందించారు. మొబైల్ నెట్‌వర్క్ లేదా ఇంటర్నెట్ అందుబాటులో లేని సమయంలో కూడా సమీపంలోని అనుకూల పరికరాలకు కాల్స్, మెసేజ్‌లు పంపుకునే అవకాశం ఉంటుందని Infinix చెబుతోంది. దీంతో రోజువారీ వినియోగంతో పాటు ప్రయాణాల్లోనూ ఈ ఫోన్ ఉపయోగపడే అవకాశం ఉంది.
భారత్‌లో Infinix Smart 20 HDను 3GB RAM, 64GB స్టోరేజ్‌తో ఒకే వేరియంట్‌లో తీసుకొచ్చారు. అన్ని ఆఫర్లను కలుపుకుని దీని ధర రూ.10,999గా కంపెనీ ప్రకటించింది. అయితే Flipkartలో ఇదే వేరియంట్ రూ.18,499 ధరతో కనిపిస్తోంది. ఎంపిక చేసిన రిటైల్ దుకాణాల్లోనూ ఈ ఫోన్ లభిస్తుంది. ఆరు నెలల నో-కాస్ట్ EMI సదుపాయం కూడా ఉంది. Sun Like Orange, Silver Dancer, Night Pulse రంగుల్లో దీనిని కొనుగోలు చేయవచ్చు.
ఫోన్‌లో 6.67 అంగుళాల HD+ పంచ్-హోల్ డిస్‌ప్లే ఉంది. ఇది 720×1600 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. 700 nits HBM బ్రైట్‌నెస్ ఉండటంతో వీడియోలు చూడటం, సామాజిక మాధ్యమాలు ఉపయోగించడం వంటి పనుల్లో స్క్రీన్ అనుభవం మెరుగ్గా ఉండనుంది. పనితీరు కోసం Unisoc T7250 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 3GB RAMతో పాటు 64GB స్టోరేజ్ ఉంది. అవసరాన్ని బట్టి వర్చువల్ RAMను 6GB వరకు పెంచుకోవచ్చు. మైక్రోSD కార్డ్ కోసం ప్రత్యేక స్లాట్ కూడా ఇచ్చారు. Android 15 ఆధారిత XOS 15.1పై ఫోన్ పనిచేస్తుంది.
వెనుక భాగంలో 8MP ఆటోఫోకస్ కెమెరా ఉంది. Super Night, Dual Video, Vlog, Documents, Pro, Panorama, Time-Lapse వంటి కెమెరా మోడ్‌లు ఇందులో ఉన్నాయి. 30fps వద్ద 2K రిజల్యూషన్ వరకు వీడియో రికార్డింగ్ చేయవచ్చు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8MP కెమెరాను అందించారు.
ఆడియో కోసం డ్యూయల్ స్పీకర్లు ఉన్నాయి. Ultra Volume Mode ద్వారా సాధారణ స్థాయి కంటే 300 శాతం వరకు ఎక్కువ శబ్దాన్ని అందించవచ్చని Infinix చెబుతోంది. DTS ఆడియో సపోర్ట్‌తో పాటు కాల్స్‌లో స్పష్టమైన వాయిస్ కోసం Pure Voice టెక్నాలజీ, Smart NC, Standard NC వంటి నాయిస్ క్యాన్సిలేషన్ సదుపాయాలు ఉన్నాయి. ఫోన్‌లో 5,000mAh బ్యాటరీ ఉంది. ఇది 15W వరకు ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. బాక్స్‌లో 10W ఛార్జర్‌ను అందిస్తున్నారు. 165.62×77.01×8.25mm కొలతలు, 189 గ్రాముల బరువుతో ఈ ఫోన్ వస్తుంది. దుమ్ము, నీటి చినుకుల నుంచి రక్షణ కోసం IP64 రేటింగ్ ఉంది.
ఇక ఈ ఫోన్‌లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ఫీచర్ Ultra Link. Bluetooth ఆధారిత కనెక్టివిటీతో మొబైల్ నెట్‌వర్క్ లేదా ఇంటర్నెట్ లేకపోయినా సమీపంలోని అనుకూల పరికరాలతో కమ్యూనికేట్ చేయవచ్చు. 200 మీటర్ల పరిధిలో ఆఫ్‌లైన్ కాల్స్, మెసేజ్‌లు, వాయిస్ నోట్స్, ఫొటోలు షేర్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.