iPhone: మీ ఐఫోన్‌ బాగా వేడెక్కుతోందా? అయితే వెంటనే ఇలా చేయండి!

వేసవిలో ఐఫోన్‌లు వేడెక్కడం సాధారణ సమస్యగా మారింది. అధిక ఉష్ణోగ్రతలు, భారీ యాప్‌లు, వైర్‌లెస్ ఛార్జింగ్ దీనికి ప్రధాన కారణాలు. స్క్రీన్ మసకబారడం, ఛార్జింగ్ ఆగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఫోన్‌ను చల్లటి ప్రదేశంలో ఉంచడం, కవర్ తొలగించడం, కేబుల్ ఛార్జింగ్ ఉపయోగించడం వంటి జాగ్రత్తలు పాటించాలి.

iPhone: మీ ఐఫోన్‌ బాగా వేడెక్కుతోందా? అయితే వెంటనే ఇలా చేయండి!
Iphone 17e

Updated on: May 02, 2026 | 9:57 PM

దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరుతున్న వేళ, మనుషులతో పాటు స్మార్ట్‌ఫోన్‌లు కూడా తీవ్ర వేడిని తట్టుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా యాపిల్‌ ఐఫోన్‌ వినియోగదారులు ఇటీవల ఓ కొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు. ఫోన్లు అసాధారణంగా వేడెక్కిపోవడంతో కాల్స్ చేయడం, మెసేజ్‌లు పంపడం కూడా కష్టంగా మారుతోందని అనేక మంది సోషల్ మీడియాలో ఫిర్యాదు చేస్తున్నారు. నిపుణుల ప్రకారం ఐఫోన్‌లు సాధారణంగా 0°C నుంచి 35°C మధ్య ఉష్ణోగ్రతలో సమర్థంగా పనిచేసేలా రూపొందించబడ్డాయి. కానీ బయట ఉష్ణోగ్రతలు ఆ పరిమితిని దాటినప్పుడు, ఫోన్ తనను తాను రక్షించుకునేందుకు పనితీరును తగ్గించడం ప్రారంభిస్తుంది. దీన్నే “థర్మల్ ప్రొటెక్షన్ మోడ్”గా పిలుస్తారు.

ఐఫోన్ అతిగా వేడెక్కినప్పుడు కొన్ని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తాయి. స్క్రీన్ అకస్మాత్తుగా మసకబారడం, ఛార్జింగ్ ఆగిపోవడం, “ఛార్జింగ్‌ ఆన్‌ హోల్డ్‌” హెచ్చరిక రావడం, యాప్‌లు నెమ్మదిగా ఓపెన్ కావడం, కెమెరా ఫ్లాష్ పనిచేయకపోవడం వంటి సమస్యలు కనిపిస్తాయి. తీవ్రమైన పరిస్థితుల్లో స్క్రీన్‌పై థర్మామీటర్ గుర్తు కూడా కనిపించవచ్చు. వేడి వాతావరణమే దీనికి ప్రధాన కారణం. నేరుగా సూర్యరశ్మిలో ఫోన్ ఉపయోగించడం, ఛార్జింగ్ సమయంలో గేమింగ్ లేదా వీడియోలు చూడడం, వైర్‌లెస్ ఛార్జింగ్ వాడటం, భారీ గేమ్స్, బ్యాక్‌గ్రౌండ్ యాప్‌లు ఎక్కువగా నడపడం వల్ల ఫోన్‌పై ఒత్తిడి పెరిగి వేడెక్కుతుంది. GPS, బ్లూటూత్‌ నిరంతరం ఆన్‌లో ఉండటం కూడా బ్యాటరీపై ప్రభావం చూపుతుంది.

అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. ఫోన్‌ను చల్లటి ప్రదేశంలో ఉంచడం, మందపాటి బ్యాక్ కవర్లు తొలగించడం, వైర్‌లెస్ ఛార్జింగ్‌కు బదులుగా సాధారణ కేబుల్ ఛార్జింగ్ ఉపయోగించడం, అవసరం లేని యాప్‌లను మూసివేయడం, “లో పవర్‌ మూడ్‌” ఆన్ చేయడం ఉపయోగకరంగా ఉంటాయి. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే వేడెక్కిన ఐఫోన్‌ను ఫ్రిజ్‌లో పెట్టడం లేదా దానిపై నీళ్లు పోయడం వంటి పనులు చేయకూడదు. ఆకస్మిక చల్లదనం ఫోన్ లోపలి భాగాలను శాశ్వతంగా దెబ్బతీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us