ప్రపంచవ్యాప్తంగా ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం బాగా పెరిగింది. అయితే చాలా మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు ఐఫోన్ వాడడం ఓ కలగా పెట్టుకుంటారు. ఐఫోన్స్‌లో సెక్యూరిటీ ఫీచర్స్‌తో పాటు కెమెరా, ఇతర ఫీచర్స్ వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. అయితే ఇటీవల ఐ ఫోన్ 16ను యాపిల్ కంపెనీ రిలీజ్ చేసింది. కొత్త ఐఫోన్ ఇప్పుడు అధికారికంగా భారతదేశంలో విక్రయిస్తున్నారు. అయితే ఐ ఫోన్ 16ను కొనుగోలు చేయాలంటే భారతదేశంలో సగటున 47.6 రోజులు పని చేయాల్సి ఉంటుందని ఓ నివేదిక ఇటీవల వైరల్ అవుతుంది. అయితే ఐ ఫోన్ 16 సొంతం ఏయే దేశాల్లో ప్రజలు ఎన్ని రోజులు పని చేయాలో? ఓ సారి తెలుసుకుందాం.
ఇటీవల వెల్లడైన నివేదిక ప్రకారం స్విట్జర్లాండ్‌లోని ఒక వ్యక్తి ఐఫోన్ 16ని కొనుగోలు చేయడానికి 4 రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. అయితే అమెరికన్‌కి 5.1 రోజులు అవసరం కాగా ఆస్ట్రేలియన్లు, సింగపూర్ వాసులు 5.7 రోజులు అవసరం అవుతుందని వెల్లడైంది. ఈ నేపథ్యంలో భారతదేశంలో మాత్రం కొత్త ఐ ఫోన్ 16ను కొనుగోలు చేయడానికి 47.6 రోజులు పని చేయాల్సి ఉంటుంది . భారతదేశంలో ఐ ఫోన్ 16 ధర రూ.79,900, ఐఫోన్ 16 ప్లస్ రూ.89,900, ఐ ఫోన్ 16 ప్రో రూ. 119,900, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ రూ.1,44,900 నుంచి ప్రారంభమవుతుంది.
కొత్త ఐఫోన్‌లు యాపిల్ బీకేసీ (ముంబై), యాపిల్ సాకెట్ (న్యూ ఢిల్లీ)తో సహా భారతదేశంలోని యాపిల్ రిటైల్, ఆన్‌లైన్ స్టోర్‌లలో మరియు అధీకృత విక్రేతల ద్వారా అందుబాటులో ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా వచ్చే నెలలో ఐఫోన్ 16 సిరీస్ పరికరాల్లో ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌కు సంబంధించిన యుఎస్ ఇంగ్లీష్ వెర్షన్‌ను కంపెనీ విడుదల చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఫీచర్ ద్వారా యాపిల్ ఇంటెలిజెన్స్ వినియోగదారులు టెక్స్ట్‌ను తిరిగి రాయడానికి, సరిదిద్దడానికి వీలు ఉంటుంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి