
సాధారణ కొనుగోలుదారులను ఆకర్షించే లక్ష్యంతో రూపుదిద్దుకుంటున్న అట్టో 2 నూతన మోడల్ మిడ్-సైజ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విభాగంలో గట్టి పోటీనిచ్చేందుకు సిద్ధమైంది. అద్భుతమైన ఫీచర్లు, ఆకర్షణీయమైన అంచనా ధరలతో వస్తున్న ఈ ట్రెండింగ్ ఎలక్ట్రిక్ వెహికల్ పూర్తి వివరాలను తెలుసుకుందాం!
చైనా ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ బీవైడీ భారత మార్కెట్లో మరింత సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ప్రీమియం ఎలక్ట్రిక్ కార్లతో గుర్తింపు పొందిన ఈ కంపెనీ, ఇప్పుడు తక్కువ ధరలో కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని తీసుకురావాలని భావిస్తోంది. బీవైడీ అట్టో 2 పేరుతో రానున్న ఈ మోడల్ భారత్‌లో కంపెనీకి అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ వెహికల్‌గా నిలిచే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం భారత మార్కెట్లో బీవైడీ నుంచి అట్టో 3, సీల్, ఈ6, సీలియన్ 7 లాంటి మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఇవన్నీ ఎక్కువగా ప్రీమియం సెగ్మెంట్స్‌లో ఉండటంతో సాధారణ కొనుగోలుదారులు ఖరీదైనవిగా భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో అట్టో 2ను తక్కువ ధరలో తీసుకురావడం ద్వారా మరింత మంది కస్టమర్లను ఆకర్షించాలని కంపెనీ భావిస్తోంది. రాబోయే బీవైడీ అట్టో 2, దేశంలో మంచి ఆదరణ పొందిన మిడ్ సైజ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విభాగంలో పోటీ పడనుంది. ఈ కారు మార్కెట్లోకి వచ్చిన తర్వాత హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, టాటా సియెర్రా ఈవీ, మహీంద్రా బీఈ 6 వంటి మోడళ్లకు పోటీ ఇవ్వనుందని అంచనా వేస్తున్నారు. అట్టో 2 పొడవు సుమారు 4.3 మీటర్లు ఉంటుంది. ఇది అట్టో 3 కంటే కొద్దిగా చిన్నదే అయినప్పటికీ, ఎస్‌యూవీ తరహా డిజైన్‌తో విశాలమైన క్యాబిన్‌ను అందించేలా రూపొందించారు. కుటుంబ అవసరాలకు అనువుగా ఉండే ఇంటీరియర్ లేఅవుట్ కూడా ఇందులో ఉండనుందని సమాచారం.
బీవైడీ అట్టో 2 రూ. 20 లక్షల ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని అంచనా. ఇదే నిజమైతే, కంపెనీ ప్రస్తుతం విక్రయిస్తున్న అట్టో 3 కంటే ఇది చాలా తక్కువ ధరలో లభిచ్చే మోడల్ అవుతుంది. ప్రీమియం అనుభూతితో పాటు సరసమైన ధర కోరుకునే కొనుగోలుదారులకు ఇది మంచి ఎంపికగా మారే అవకాశం ఉంది. అయితే, దేశంలో ఈ ఎస్‌యూవీని పూర్తిగా తయారు చేయకుండా, దిగుమతి చేసుకున్న కిట్లను ఇక్కడ అసెంబుల్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
అంతర్జాతీయ మార్కెట్లో బీవైడీ అట్టో 2ను పలు బ్యాటరీ, మోటార్ ఎంపికలతో విక్రయిస్తోంది. ఇందులో 94 హెచ్‌పీ, 174 హెచ్‌పీ, 201 హెచ్‌పీ సామర్థ్యం గల ఎలక్ట్రిక్ మోటార్ ఆప్షన్లు ఉన్నాయి. అలాగే 32 కేడబ్ల్యూహెచ్, 45.12 కేడబ్ల్యూహెచ్, 51.1 కేడబ్ల్యూహెచ్, 64.8 కేడబ్ల్యూహెచ్ ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీ ప్యాక్‌లను కూడా అందిస్తోంది. టాప్ వేరియంట్ ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే 430 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉందని కంపెనీ చెబుతోంది. అయితే భారత మార్కెట్లో ఏ బ్యాటరీ వేరియంట్లు అందుబాటులోకి వస్తాయన్న విషయంపై త్వరలోనే అధికారిక స్పష్టత రానుంది.