యాపిల్‌ ఫోన్​ యూజర్లకు షాక్..! స్టోర్‌‌ నుంచి ఆ యాప్‌ నుంచి తొలగింపు

iOS App Store.. ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌కు యాపిల్ గట్టి షాక్ ఇస్తూ తన ఐఓఎస్ యాప్ స్టోర్ నుంచి ఈ యాప్‌ను అకస్మాత్తుగా తొలగించింది. దీంతో పలు దేశాల్లో ఐఫోన్ వినియోగదారులకు సెర్చ్ రిజల్ట్స్‌లో ఈ సేవలు కనిపించకుండా పోయాయి. టెక్ ప్రపంచంలో తీవ్ర చర్చనీయాంశమైన ఈ పరిణామం గురించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.

యాపిల్‌ ఫోన్​ యూజర్లకు షాక్..! స్టోర్‌‌ నుంచి ఆ యాప్‌ నుంచి తొలగింపు
Apple Removes Telegram From Ios App Store

Updated on: Aug 06, 2026 | 7:20 AM

అనుచిత కంటెంట్ వ్యాప్తి, చట్టవిరుద్ధ కార్యకలాపాల నేపథ్యంలో ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ మరోసారి తీవ్ర వివాదాల్లో చిక్కుకుంది. ఇప్పటికే డౌన్‌లోడ్ చేసుకున్న యూజర్లకు సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ యాప్ స్టోర్ నుంచి తొలగించడం వెనుక అసలు కారణాలు ఏమిటో తెలుసుకుందాం!

ప్రభుత్వ నిఘా

ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌కు యాపిల్ గట్టి షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తన ఐఓఎస్ యాప్ స్టోర్ నుంచి అకస్మాత్తుగా ఈ యాప్‌ను తొలగించింది. దీంతో పలు దేశాల్లో ఐఫోన్, ఐప్యాడ్ వినియోగదారులకు సెర్చ్ రిజల్ట్స్‌లో ఈ యాప్ కనిపించడం లేదు. అయితే దీనిపై యాపిల్ గానీ, టెలిగ్రామ్ సంస్థ గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. కానీ ఇప్పటికే ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న ఐఫోన్, ఐప్యాడ్ యూజర్లు మాత్రం ఎప్పటిలాగే టెలిగ్రామ్ సేవలు అందుబాటులో ఉండటం గమనార్హం.

టెలిగ్రామ్ యాప్ యాపిల్ ప్లాట్‌ఫారమ్ నుంచి తొలగించబడడం ఇదే మొదటిసారి కాదు. 2018లో అనుచిత కంటెంట్ వ్యాప్తి చెందుతోందన్న కారణంతో యాపిల్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా టెలిగ్రామ్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. ఆ తర్వాత టెలిగ్రామ్ అధినేత యాప్‌లో తగిన భద్రతా చర్యలు చేపట్టడంతో మళ్లీ పునరుద్ధరించారు. ఆ తర్వాత 2023లో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు సంబంధించిన దర్యాప్తులో సమాచారం ఇవ్వలేదనే నెపంతో బ్రెజిల్ ప్రభుత్వం కూడా ఈ యాప్‌పై తాత్కాలిక నిషేధం విధించింది. అటు 2024లో చైనా ఇంటర్నెట్ రెగ్యులేటర్ ఆదేశాల మేరకు యాపిల్ తన చైనా యాప్ స్టోర్ నుండి వాట్సాప్, సిగ్నల్‌లతో పాటు టెలిగ్రామ్‌ను పూర్తిగా తొలగించింది.

సైబర్ నేరాల ఆరోపణలు

మరోవైపు భారత ప్రభుత్వం సైతం గత కొద్ది కాలంగా టెలిగ్రామ్ సేవలపై నిఘా పెట్టింది. ముఖ్యంగా పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంలో ఈ యాప్ వేదికగా నిలిచిందనే ఆరోపణలు సంచలనం సృష్టించాయి. దీనిపై టెలిగ్రామ్ తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసినప్పటికీ భారత ప్రభుత్వం ఈ యాప్‌పై కఠిన వైఖరిని అవలంబిస్తోంది. ఢిల్లీ హైకోర్టు విచారణ సందర్భంలో ప్రభుత్వం వాదిస్తూ టెలిగ్రామ్ సైబర్ నేరగాళ్లకు ఒక కొత్త డార్క్ వెబ్ లాగా మారిపోయిందని ఆరోపించింది. ఐఫోన్ యూజర్లకు పలు దేశాల్లో టెలిగ్రామ్ అందుబాటులో లేకుండా పోవడంపై పలు అనుమానాలు తావిస్తున్నాయి. ఇది సాంకేతిక లోపమా, నిబంధనల ఉల్లంఘనా, లేక ప్రభుత్వాల ఒత్తిడి వల్ల తీసుకున్న నిర్ణయమా అనే అంశంపై యాపిల్‌తో పాటు టెలిగ్రామ్ నుంచి స్పష్టత లేదు.

ఆ రెండు సంస్థలు అధికారికంగా స్పందిస్తే తప్ప ఈ సస్పెన్స్ వీడేలా కనిపించడం లేదని టెక్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రైవసీ మరియు భద్రతా నిబంధనల విషయంలో టెక్ దిగ్గజాలు అనుసరిస్తున్న కఠినమైన విధానాలు యాప్‌ల నిర్వహణను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు కలిగి ఉన్న ఈ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ భవిష్యత్తు ఎలా ఉండబోతుందనేది రాబోయే రోజుల్లో తేలనుంది. టెలిగ్రామ్ యాజమాన్యం ఈ సమస్యను ఎలా పరిష్కరించుకుంటుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Loading...
Unable to load recommendations.
Follow Us