Phone Lock: ప్యాటర్న్ vs పిన్ లాక్.. మీ ఫోన్‌కు ఏది మంచిది..? ఈ నిజాలు తెలిస్తే..

మీ ఫోన్‌కు కూడా ఇలాంటి ప్యాటర్న్ లాక్ పెట్టారా? అయితే వెంటనే మార్చుకోండి.. ఒక్కసారి మీ చేతి వేళ్ల కదలికలను చూస్తే చాలు.. ఎవరైనా మీ ఫోన్‌ను క్షణాల్లో ఓపెన్ చేసేయొచ్చని సైబర్ భద్రతా పరిశోధనల్లో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. పిన్, పాస్‌వర్డ్‌లతో పోలిస్తే ప్యాటర్న్ లాక్‌లను ఛేదించడం దొంగలకు వెన్నతో పెట్టిన విద్యలా మారిపోయింది. ఫోన్ సేఫ్‌గా ఉండాలంటే ఎలాంటి లాక్ వాడాలి? అనేది తెలుసుకుందాం..

Phone Lock: ప్యాటర్న్ vs పిన్ లాక్.. మీ ఫోన్‌కు ఏది మంచిది..? ఈ నిజాలు తెలిస్తే..
Android Pattern Lock Vs 6 Digit Pin

Updated on: Oct 16, 2026 | 8:06 PM

కొత్త స్మార్ట్‌ఫోన్ చేతికి రాగానే మనం చేసే మొదటి పని.. స్క్రీన్ లాక్ సెట్ చేసుకోవడం. పిన్, పాస్‌వర్డ్ లేదా ప్యాటర్న్ లాక్.. వీటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకుంటాం. అయితే గుర్తుపెట్టుకోవడానికి సులువుగా ఉంటుందనే బద్ధకంతో చాలామంది అత్యంత సాధారణమైన పాస్‌వర్డ్‌లు లేదా సింపుల్ ప్యాటర్న్‌లను లాక్‌గా పెడుతుంటారు. ఈ చిన్న బద్ధకమే మీ వ్యక్తిగత సమాచారానికి, బ్యాంకింగ్ వివరాలకు పెను ముప్పుగా మారుతోందని భద్రతా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా పాస్‌వర్డ్ కంటే ప్యాటర్న్ లాక్ చాలా ప్రమాదకరమని, మీ వెనుక నిలబడిన వ్యక్తి మీరు లాక్ వేసేటప్పుడు కేవలం ఒక్కసారి చూసినా సులభంగా డీకోడ్ చేయగలరని తాజా పరిశోధనలో తేలింది.

పాస్‌వర్డ్స్‌తో మనం చేసే పెద్ద తప్పులు

స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు 4 లేదా 6 అంకెల న్యూమరిక్ పిన్ లేదా ఆల్ఫాన్యూమరిక్ పాస్‌వర్డ్స్ సెట్ చేసుకునే సదుపాయం కల్పిస్తాయి. కానీ మెజారిటీ యూజర్లు గుర్తుపెట్టుకోవడం తేలికని.. 1234, 123456, 0000, password లాంటి నంబర్లను ఎంచుకుంటారు. లేదా తమ పేర్లు, పుట్టిన తేదీలు, పిల్లల బర్త్‌డేలు, పెళ్లి రోజులను పిన్‌గా పెడతారు. మీ ఫోన్ దొంగిలించిన వ్యక్తి లేదా సైబర్ నేరగాడు సోషల్ మీడియా ద్వారా మీ వివరాలు తెలుసుకుని ఇలాంటి పాస్‌వర్డ్‌లను క్షణాల్లో గెస్ చేయగలడు. అందుకే సంఖ్యలు, అక్షరాలు, స్పెషల్ క్యారెక్టర్ల కలయికతో స్ట్రాంగ్ పాస్‌వర్డ్ లేదా బలమైన పిన్ మాత్రమే పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ప్యాటర్న్ లాక్: కంటి చూపుతోనే పట్టేయొచ్చు..

నంబర్లు గుర్తుపెట్టుకోవడం కష్టమని భావించే వారి కోసం ఆండ్రాయిడ్ 9 చుక్కలతో కూడిన ప్యాటర్న్ లాక్ ఫీచర్‌ను తెచ్చింది. కానీ ఇక్కడే అసలు ప్రమాదం దాగి ఉంది. దాదాపు 44 శాతం మంది స్క్రీన్ పైభాగంలో ఎడమవైపు మూలన ఉండే చుక్క నుంచే ప్యాటర్న్ ప్రారంభిస్తారు. మొత్తం 77 శాతం మంది ఏదో ఒక మూల నుంచే మొదలుపెడతారు. మెజారిటీ యూజర్లు కేవలం 4 లేదా 5 చుక్కలను మాత్రమే కలుపుతారు. 10 శాతానికి పైగా ప్రజలు తమ పేరులోని మొదటి అక్షరం రూపంలో ఉండే ప్యాటర్న్‌లను వాడుతున్నారు. ఇలాంటి ప్యాటర్న్‌లను దొంగలు ఇట్టే ఊహించేస్తారు.

పరిశోధనలో వెల్లడైన విస్తుపోయే నిజాలు

యాన్యువల్ కంప్యూటర్ సెక్యూరిటీ అప్లికేషన్ కాన్ఫరెన్స్‌లో సమర్పించిన ఒక పరిశోధనా పత్రం ప్యాటర్న్ లాక్ డొల్లతనాన్ని బట్టబయలు చేసింది. సైంటిస్టులు ఒక ఆన్‌లైన్ ప్రయోగం నిర్వహించారు. వేర్వేరు వ్యక్తులు తమ ఫోన్లలో 6 డిజిట్ పిన్, 6 డాట్ ప్యాటర్న్ లాక్ వేస్తున్నప్పుడు వివిధ కోణాల నుంచి వీడియో తీశారు. ఈ వీడియోలను నియంత్రిత పద్ధతిలో 1,173 మందికి చూపించి.. వాటిని డీకోడ్ చేయాలని కోరారు. ఈ ప్రయోగంలో వచ్చిన ఫలితాలు భయం గొలిపేలా ఉన్నాయి. ప్యాటర్న్ లాక్ తీయడం అత్యంత సులువు. కేవలం ఒక్కసారి చూసిన వెంటనే 64.2 శాతం మంది ఆండ్రాయిడ్ ప్యాటర్న్ లాక్‌ను విజయవంతంగా అన్‌లాక్ చేసేశారు. అదే ఒకటి కంటే ఎక్కువసార్లు చూసే అవకాశం వస్తే, అన్‌లాక్ చేసిన వారి శాతం ఏకంగా 79.9 శాతానికి చేరింది.

6 అంకెల పిన్ చాలావరకు సురక్షితం

6 డిజిట్ పిన్ ఎంటర్ చేయడాన్ని ఒక్కసారి చూసినప్పుడు కేవలం 10.8 శాతం మంది మాత్రమే సరిగ్గా గెస్ చేయగలిగారు. పదేపదే చూసినా కూడా ఆ సంఖ్య 26.5 శాతానికి మించలేదు.

మీ ఫోన్ సేఫ్‌గా ఉండాలంటే ఏం చేయాలి?

బస్సుల్లో, మెట్రోల్లో లేదా పబ్లిక్ ప్రదేశాల్లో మీరు ప్యాటర్న్ గీస్తున్నప్పుడు పక్కనున్న వారు ఒక్క సెకను గమనించినా మీ ఫోన్ అన్‌లాక్ చేయడం వారికి చాలా తేలిక. అందుకే..

  • సాధ్యమైనంత వరకు ప్యాటర్న్ లాక్‌ను వాడటం మానేయండి.
  • కనీసం 6 అంకెల బలమైన పిన్ లేదా ఆల్ఫాన్యూమరిక్ పాస్‌వర్డ్‌ను ఎంచుకోండి.
  • బయోమెట్రిక్ ఫీచర్లు అయిన ఫింగర్‌ప్రింట్ లేదా ఫేస్ అన్‌లాక్‌ను ప్రాథమిక రక్షణగా వాడుకోండి.
  • ఒకవేళ ప్యాటర్న్ లాక్ తప్పనిసరి అయితే.. సెట్టింగ్స్‌లోకి వెళ్లి Make pattern visible ఆప్షన్‌ను ఆఫ్ చేయండి. దీనివల్ల మీరు గీసే గీతలు స్క్రీన్‌పై కనిపించవు.
Loading...
Unable to load recommendations.
Follow Us