Reliance Industries With IOA: ప్రపంచ క్రీడల్లో భారతీయ అథ్లెట్ల ప్రాతినిథ్యం మరింత పెంచేందుకు, ఒలింపిక్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) తో చేతులు కలిపింది. ఒలింపిక్ గేమ్స్‌తో పాటు కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్ లాంటి ప్రధాన క్రీడా ఈవెంట్లలో భారతీయ అథ్లెట్లకు అన్ని విధాలా సహాయసహకారాలు అందించడమే ఈ దీర్ఘకాలిక ఒప్పందం ముఖ్య ఉద్దేశ్యం. ఇందులో భాగంగా 2024లో ప్యారిస్ వేదికగా జరిగే ఒలింపిక్ గేమ్స్ కోసం ప్రత్యేకంగా ఒలింపిక్ హాస్పిటాలిటీ హౌస్‌ను ఏర్పాటుచేయనున్నారు. దేశవ్యాప్తంగా మారుమూల గ్రామాల్లో ఉన్న భారతీయ అథ్లెట్లను వెతికి పట్టుకోవడం, ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించి వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించడమే తమ లక్ష్యమని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పేర్కొంది.
నిబద్ధతతో కృషి చేస్తాం: నీతా
ఈ సందర్భంగా ఇండియన్ ఒలింపిక్ కమిటీ (IOC) సభ్యురాలు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్ నీతా అంబానీ మాట్లాడుతూ.. ‘ప్రపంచ క్రీడా వేదికపై భారత్ ప్రాతినిథ్యం పెంచడమే మా ఏకైక లక్ష్యం. ఇందుకోసమే IOAతో జతకట్టాం. క్రీడాకారులకు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు అందించడంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న యువ క్రీడాకారులకు అన్ని విధాలా మద్దతు, సాధికారత కల్పించడానికి రిలయన్స్ ఫౌండేషన్ నిబద్ధతతో కృషి చేస్తుంది’ అని చెప్పుకొచ్చారు. అదేవిధంగా IOA సెక్రటరీ జనరల్, రాజీవ్ మెహతా మాట్లాడుతూ ‘ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌తో జతకట్టినందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అలాగే నీతా అంబానీకి ధన్యవాదాలు. భారతీయ క్రీడలకు మద్దతు ఇవ్వడంతో పాటు తరువాతి తరం పిల్లలను ఒలింపిక్ గేమ్స్‌పై దృష్టి సారించేలా ప్రోత్సహించడమే ఈ భాగస్వామ్యం ముఖ్య లక్ష్యం. ఇందులో భాగంగా పారిస్ 2024 ఒలింపిక్స్ కోసం ఒలింపిక్ హాస్పిటాలిటీ హౌస్ ను ఏర్పాటుచేయడం ఒక పెద్ద ముందడుగు’ అని చెప్పుకొచ్చారు.
The Indian Olympic Association is delighted to onboard Reliance Foundation as Principal Partners in a long term partnership furthering the Olympic Movement in India to strengthen our position as a global sporting powerhouse .#WeAreTeamIndia #IOA #RIL #IndiaHouse #Olympics #CWG pic.twitter.com/Npbp5R0dvb
— Team India (@WeAreTeamIndia) July 27, 2022
ఒలింపిక్ హాస్పిటాలిటీ హౌస్ అంటే..
ప్రతిష్ఠాత్మక ఒలింపిక్ క్రీడల్లో సత్తాచాటడమే లక్ష్యంగా ఆయా ప్రపంచ దేశాలు వివిధ కార్యక్రమాలు చేపడుతాయి. ఒలింపిక్ హాస్పిటాలిటీ హౌస్ పేరుతో అధికారులు, క్రీడాకారులు, వారి కుటుంబాలతో పాటు సామాన్య ప్రజలను ఇందులో భాగంగా చేస్తుంది. ఒలింపిక్స్ లో పాల్గొనే క్రీడాకారులకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ప్రోత్సహించడమే ఈ ప్రోగ్రామ్ లక్ష్యం. ఇప్పుడు ఇలాంటి హౌస్‌నే రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐఏఓ ఏర్పాటుచేయనున్నాయి.
మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..