Cristiano Ronaldo: ఇంగ్లండ్ లెజెండరీ ఫుట్‌బాల్ క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్ 12 సంవత్సరాల నిరీక్షణ సెప్టెంబర్ 11న శనివారం ఫలించింది. క్లబ్‌లో అత్యంత ప్రియమైన ఆటగాళ్లలో ఒకరైన క్రిస్టియానో రొనాల్డో ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానానికి తిరిగి వచ్చారు. దాదాపు రెండు వారాల అంతర్జాతీయ విరామం ముగిసిన తర్వాత శనివారం ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్‌లోకి తిరిగి వచ్చాడు. యునైటెడ్‌లో క్రిస్టియానో ’హోమ్‌కమింగ్’ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. ఈ పోర్చుగల్ కెప్టెన్ అద్భుత ఆటతీరుతో మాంచెస్టర్ యునైటెడ్ అభిమానులకు గొప్ప బహుమతిని అందించాడు. క్రిస్టియానో 12 సంవత్సరాల తర్వాత యునైటెడ్ కోసం తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించాడు. మొదటి మ్యాచ్‌లోనే రెండు గోల్స్ చేసి, తన ఎంట్రీని ఘనంగా ఆరంభించాడు.
2009 లో మాంచెస్టర్ యునైటెడ్ నుంచి రియల్ మాడ్రిడ్‌లో చేరడానికి వెళ్లిన రొనాల్డో.. ఇటీవల యూరోపియన్ క్లబ్ నుంచి వైదొలిగిన అనంతరం మరలా తన పాత క్లబ్‌లో చేరాడు. 36 ఏళ్ల రొనాల్డో, గత సీజన్‌లో ఇటలీలోనే అతిపెద్ద క్లబ్ జువెంటస్‌తో ఉన్నాడు. గత 12 సంవత్సరాలలో ప్రపంచ రికార్డులను బ్రేక్ చేసి, ఎన్నో సరికొత్త రికార్డులను సృష్టించాడు. తన కెరీర్‌కు దిశానిర్దేశం చేసిన అదే క్లబ్‌కు తిరిగి వచ్చాడు.
ముగిసిన 12 సంవత్సరాల 124 రోజుల నిరీక్షణ
మాంచెస్టర్ యునైటెడ్ శనివారం న్యూకాజిల్ యునైటెడ్‌తో, ప్రీమియర్ లీగ్‌లో నాల్గవ మ్యాచ్ ఆడింది. ఊహించినట్లుగానే, రోనాల్డోకు ప్లేయింగ్ XI లో చోటు లభించింది. పోర్చుగీస్ లెజెండ్ యునైటెడ్ అభిమానుల ఆశలను నెవవేరుస్తూ ఎంట్రీ ఇచ్చాడు. ప్రథమార్ధంలో చాలా సేపు నిరీక్షించిన తర్వాత, రోనాల్డో 45వ నిముషంలో గోల్ చేసి విజయం సాధించేందుకు అడుగులు వేశాడు.
దీంతో, రొనాల్డో 12 సంవత్సరాల 124 రోజుల తర్వాత మాంచెస్టర్ యునైటెడ్ కొరకు మళ్లీ గోల్ చేశాడు. ఈ క్లబ్ కోసం రొనాల్డో చివరిగా 2009 సీజన్‌లో నగర ప్రత్యర్థి క్లబ్ మాంచెస్టర్ సిటీకి వ్యతిరేకంగా బరిలోకి దిగాడు. రొనాల్డో తన లక్ష్యాన్ని సాధించేందుకు ఎక్కువ సమయం తీసుకోలేదు. 62 వ నిమిషంలో ద్వితీయార్ధంలో ల్యూక్ షా పాస్‌లో రొనాల్డో మరోసారి న్యూకాజిల్ వ్యతిరేకంగా రెండవ గోల్ చేసి, జట్టుకు విజయాన్ని అందించాడు.
మాంచెస్టర్ యునైటెడ్‌కు సులవైన విజయం
మాంచెస్టర్ యునైటెడ్ 4–1తో సులభంగా న్యూకాజిల్ యునైటెడ్‌ని ఓడించి సీజన్‌లో మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. వారి స్టార్ ప్లేయర్ తిరిగి రావడంతోపాటు అద్భుతమైన ప్రదర్శనతో మూడో విజయాన్ని సాధించింది. రొనాల్డో కాకుండా, బ్రూనో ఫెర్నాండెస్ 80 వ నిమిషంలో మాంచెస్టర్ కొరకు గోల్ చేయగా, జెస్సీ లింగార్డ్ 90 వ నిముషంలో నాలుగో గోల్ సాధించాడు. 56 వ నిమిషంలో న్యూకాజిల్ తరఫున జేవియర్ మాంక్విల్లో ఏకైక గోల్ సాధించాడు.
That one was for you, Reds ❤️#MUFC | #HereWeBelong pic.twitter.com/7pZE8kKWY5
— Manchester United (@ManUtd) September 11, 2021