Manisha Kalyan : రొనాల్డోను తలపించిన మనీషా షాట్.. 30 గజాల దూరం నుంచి మెరుపు గోల్

Manisha Kalyan : ఏఎఫ్‌సీ ఆసియా కప్‌లో మనీషా కళ్యాణ్ అద్భుతమైన ఫ్రీ కిక్ గోల్ సాధించింది. 30 గజాల దూరం నుండి ఆమె కొట్టిన ఈ గోల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మ్యాచ్ 39వ నిమిషంలో భారత్‌కు ఫ్రీ కిక్ లభించగా.. మనీషా కళ్యాణ్ ఎంతో ఆత్మవిశ్వాసంతో బంతిని గోల్ పోస్ట్ వైపు మళ్లించింది

Manisha Kalyan : రొనాల్డోను తలపించిన మనీషా షాట్.. 30 గజాల దూరం నుంచి మెరుపు గోల్
Manisha Kalyan

Updated on: Mar 16, 2026 | 10:04 AM

Manisha Kalyan : భారత మహిళా ఫుట్‌బాల్ సంచలనం మనీషా కళ్యాణ్ మరోసారి ప్రపంచాన్ని తనవైపు తిప్పుకుంది. AFC మహిళల ఆసియా కప్ 2026లో భాగంగా చైనీస్ తైపీతో జరిగిన మ్యాచ్‌లో మనీషా ఒక అద్భుతమైన గోల్‌తో మెరిసింది. దాదాపు 30 గజాల దూరం నుంచి ఆమె కొట్టిన ఫ్రీ కిక్ గోల్ పోస్ట్ పైభాగాన్ని తాకుతూ లోపలికి దూసుకెళ్లింది. ఈ గోల్ చూసిన ఫుట్‌బాల్ అభిమానులు ఫిదా అయిపోతున్నారు. సోషల్ మీడియాలో ఈ వండర్ గోల్ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

మ్యాచ్ 39వ నిమిషంలో భారత్‌కు ఫ్రీ కిక్ లభించగా.. మనీషా కళ్యాణ్ ఎంతో ఆత్మవిశ్వాసంతో బంతిని గోల్ పోస్ట్ వైపు మళ్లించింది. ఆమె తన్నడంలోని వేగం, ఖచ్చితత్వం చూస్తుంటే లెజెండరీ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ఫ్రీ కిక్స్‌ గుర్తుకొచ్చాయని క్రీడా విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. తొలుత బంతి గీత దాటిందా లేదా అన్న అనుమానం వచ్చినప్పటికీ, VAR (వీడియో అసిస్టెంట్ రెఫరీ) ద్వారా అది గోల్‌గా ఖరారైంది. ఈ గోల్‌తో భారత్ స్కోరును సమం చేసినప్పటికీ, దురదృష్టవశాత్తూ చివరికి చైనీస్ తైపీ 1-3తో విజయం సాధించింది.

ఈ టోర్నీలో భారత్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. జట్టు ప్రదర్శన నిరాశపరిచినప్పటికీ, మనీషా కళ్యాణ్ అద్భుతమైన ప్రదర్శన మాత్రం భారత్ పేరును నిలబెట్టింది. విదేశీ క్లబ్‌ల తరఫున ఆడిన అనుభవం ఉన్న మనీషా, ఇటీవలే సౌత్ అమెరికన్ క్లబ్ తరఫున గోల్ సాధించిన తొలి భారతీయ మహిళగా కూడా చరిత్ర సృష్టించింది. ఆమె ఆటతీరు చూస్తుంటే భారత మహిళా ఫుట్‌బాల్ భవిష్యత్తుపై గట్టి నమ్మకం కలుగుతోందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని కామ్‌బ్యాంక్ స్టేడియంలో జరుగుతున్న ఈ టోర్నీలో మనీషా సాధించిన గోల్ ‘గోల్ ఆఫ్ ది టోర్నమెంట్’ రేసులో నిలిచింది. ఓటమి ఎదురైనా మనీషా పోరాట పటిమను నెటిజన్లు వేనోళ్ల కొనియాడుతున్నారు. ఆమె కొట్టిన ఆ రాకెట్ లాంటి షాట్ ఇప్పుడు భారత ఫుట్‌బాల్ చరిత్రలో ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోనుంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us