Nishad Kumar Silver Medal in Paris Paralympics: పారిస్ పారాలింపిక్స్ 2024లో ఆదివారం జరిగిన హైజంప్‌లో భారతదేశానికి చెందిన నిషాద్ కుమార్ రజత పతకం సాధించాడు. పారాలింపిక్స్‌లో అతనికిది వరుసగా రెండో రజత పతకం. అంతకుముందు, అతను 2021 టోక్యో పారాలింపిక్స్‌లో రజత పతకాన్ని కూడా గెలుచుకున్నాడు. 2.08 మీటర్ల మూడు జంప్‌లలో విఫలమైన తర్వాత పతకం సాధించాడు. USAకి చెందిన రెండుసార్లు పారాలింపిక్ స్వర్ణ పతక విజేత రోడెరిక్ టౌన్‌సెండ్ తన వరుసగా మూడో స్వర్ణం సాధించాడు. నిషాద్ రజత పతకంతో పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ 7 పతకాలు సాధించింది.
నిషాద్ కుమార్ పారాలింపిక్ ప్రయాణం 2017లో ప్రారంభమైంది. 2016లో పారాలింపిక్స్‌ను చూసిన తర్వాత, ఈ క్రీడల్లోనే కెరీర్‌ను కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. సెప్టెంబర్ 2017లో, నిషాద్ తన ఇంటిని విడిచిపెట్టి పంచకులకి మారాడు. కోచ్ నసీమ్ అహ్మద్ పర్యవేక్షణలో ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో తన కెరీర్‌ను ప్రారంభించాడు.
రెండు పూటల భోజనం కోసం కుటుంబం కష్టపడే కాలం అది. ఆ సమయాన్ని ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంటూ, నిషాద్ ఇలా అన్నాడు, “మా వద్ద ఉప్పు కొనడానికి కూడా డబ్బు లేదు. నా ఖర్చులకు, మా నాన్న అదనపు ఉద్యోగం చేయాల్సి వచ్చింది. పంచకులలో నివసిస్తూ, నిషాద్ తన సొంత ఆహారాన్ని సంపాదించుకునేవాడిని. నాకు వేరే మార్గం లేదని తెలుసు’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఏడాదిపాటు శ్రమించిన నిషాద్ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది. 2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ముందు మూడు నెలల జాతీయ శిబిరంలో అతని పేరు చేరింది. అతను పాటియాలాలోని SAI కేంద్రానికి మారాడు. అక్కడ వసతి, పోషకాహారం అందడంతో.. ఆటపై పూర్తిగా దృష్టి పెట్టాడు.
ఈ కష్టానికి కూడా ప్రతిఫలం లభించింది. నిషాద్ తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనను 5 సెంటీమీటర్లు పెంచుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 2 మీటర్లు దూకి కాంస్య పతకాన్ని సాధించాడు. ఇది అతని కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లింది. 2021 టోక్యో పారాలింపిక్స్ 2023, 2024 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో రజత పతకాన్ని, పారా ఆసియా క్రీడలలో బంగారు పతకాన్ని గెలుచుకోవడం ద్వారా తన సత్తా చాటాడు.
నిషాద్ కుమార్ ఏడున్నరేళ్ల వయసులో పొలంలో గడ్డి కోసే యంత్రంలో కుడి చేయి కోల్పోయాడు. అతని చేతిని తొలగించాల్సి వచ్చింది. నిషాద్ ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటూ, “నేను ఇతరుల నుంచి భిన్నంగా ఉన్నానని నాకు అనిపించలేదు లేదా అర్థం కాలేదు. నేను గుడికి వెళ్లి నా చేయి తిరిగి ఇవ్వమని దేవుడిని ప్రార్థించాను. దేవుడు నాకు ఒక చేయి ఉంచాడు. మరొక దానిని లాక్కున్నాడు. కానీ నాకు ప్రతిఫలంగా ఏమి ఇచ్చారో ఇప్పుడు చూడండి” అంటూ ధైర్యంగా మాట్లాడాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..