IND vs PAK: పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించిన భారత్.. అజేయంగా సెమీ ఫైనల్‌లోకి ఎంట్రీ..

|

Sep 14, 2024 | 5:13 PM

Asian Champions Trophy 2024: ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీలో, చిరకాల ప్రత్యర్థి భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య ఈరోజు హైవోల్టేజ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో చాంపియన్ ఆటను కొనసాగించిన హర్మన్‌ప్రీత్ నేతృత్వంలోని భారత హాకీ జట్టు 2-1తో పాక్ జట్టును ఓడించి వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది.

IND vs PAK: పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించిన భారత్.. అజేయంగా సెమీ ఫైనల్‌లోకి ఎంట్రీ..
Asian Champions Trophy 2024
Follow us on

Asian Champions Trophy 2024: ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీలో చిరకాల ప్రత్యర్థి భారత్, పాకిస్థాన్ మధ్య ఈరోజు హైవోల్టేజ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో చాంపియన్ ఆటను కొనసాగించిన హర్మన్‌ప్రీత్ నేతృత్వంలోని భారత హాకీ జట్టు 2-1తో పాక్ జట్టును ఓడించి వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది. దీంతో భారత హాకీ జట్టు ఓటమి ఎరుగని జట్టుగా సెమీస్‌లోకి ప్రవేశించింది. చైనాలో జరుగుతున్న ఈ టోర్నీ గ్రూప్ దశలో చివరి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో తలపడిన టీమిండియా.. అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించి వరుసగా ఐదో విజయాన్ని అందుకుంది. ఈ టోర్నీలో భారత జట్టు ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. పెనాల్టీ కార్నర్ ద్వారా 2 గోల్స్ చేసిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ జట్టు విజయానికి హీరో అయ్యాడు. అయితే ప్రారంభంలో ఒక గోల్ చేసి భారత్‌కు ధీటుగా బదులిచ్చిన పాకిస్థాన్ చివరికి 2-1 తేడాతో మ్యాచ్‌ను కోల్పోయింది.

ఆరంభం నుంచి పాకిస్థాన్‌ ఆధిపత్యం..

మ్యాచ్ ప్రారంభమైన వెంటనే పాకిస్థాన్ అటాకింగ్ ప్రారంభించి 7వ నిమిషంలో హన్నన్ షాహిద్ సహకారంతో గోల్ చేసి 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే, పునరాగమనానికి భారత్ ఏమాత్రం ఆలస్యం చేయలేదు. 13వ నిమిషంలో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ తొలి గోల్ చేసి మ్యాచ్‌ను 1-1తో సమం చేశాడు. రెండో క్వార్టర్‌లో మ్యాచ్ 19వ నిమిషంలో టీమిండియాకు మళ్లీ పెనాల్టీ కార్నర్ లభించింది. హర్మన్ ప్రీత్ మళ్లీ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి 2-1తో ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు.

ఇరు జట్లకు ఎదురుదెబ్బ..

మూడో క్వార్టర్‌లో భారత్‌కు 38వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ అవకాశం లభించింది. అయితే, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ హ్యాట్రిక్ సాధించే అవకాశాన్ని కోల్పోయాడు. ఆ తర్వాత కూడా భారత జట్టుకు మూడు, నాలుగో క్వార్టర్లలో గోల్ చేసే అవకాశాలు వచ్చినా వాటిని గోల్‌గా మలచలేకపోయింది. మరోవైపు పాక్ జట్టు కూడా మ్యాచ్ సమం చేసేందుకు అనేక అవకాశాలను చేజార్చుకుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ ఆటగాడు అబు మహమూద్‌ తీవ్రంగా గాయపడడంతో స్ట్రెచర్‌పై బయటకు తీసుకెళ్లాల్సి వచ్చింది. దీంతో పాక్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.

ఇవి కూడా చదవండి

ముగ్గురికి ఎల్లో కార్డు..

భారత్-పాకిస్థాన్ మధ్య పోటీ ఏర్పడితే హోరాహోరీ పోరు జరగడం ఖాయం. ఇప్పుడు ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లోనూ అదే జరిగింది. మ్యాచ్ సందర్భంగా ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆటగాళ్లు ఒకరికొకరు కొట్టుకునేంత వరకు వెళ్లారు. దీంతో అంపైర్ కఠిన చర్యలు తీసుకుని ముగ్గురు ఆటగాళ్లకు ఎల్లోకార్డు ఇచ్చాడు. దీంతో పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరు ఆటగాళ్లు మ్యాచ్‌కు దూరంగా ఉండగా, భారత్‌కు చెందిన ఒక ఆటగాడిని సస్పెండ్ చేయాల్సి వచ్చింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..