Guguloth Soumya Selected Indian Football Team: ఫుట్‌బాల్ క్రీడ.. అత్యంత ఖరీదైన క్రీడల్లో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులారిటీ ఉన్న ఫుట్‌బాల్‌లో ఓ తెలుగమ్మాయి రాణిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా ప్రకటించిన సీనియర్ మహిళల జట్టులో చోటు దక్కించుకున్న ఈ అమ్మాయి దేశం దృష్టిని ఆకర్షించింది.
వివారాల్లోకి వెళితే.. తెలంగాణలోని నిజామాబాద్‌కు చెందిన గూగులోత్ సౌమ్య పందొమ్మిదేళ్లకే భారత సీనియర్ ఫుట్‌బాల్ మహిళల జట్టులో చోటు దక్కించుకుంది. ఈ ఘనత సాధించిన పిన్న వయస్కురాలిగా సౌమ్య రికార్డు సృష్టించింది. అంతేకాకుండా 30 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల నుంచి భారత సీనియర్ మహిళల జట్టుకు ఎంపికైన ప్లేయర్‌గా సౌమ్య మరో గౌరవాన్ని దక్కించుకుంది. గోవాలో 20 మందితో కూడిన తుది జట్టును ప్రకటించగా అందులో సౌమ్య చోటు దక్కించుకోవడం విశేషం. ఈ నెల 14 నుంచి టర్కీలో జరగనున్న అంతర్జాతీయ ఫుట్ బాల్ పోటీల్లో సౌమ్య భారత జట్టు తరఫున ఆడనుంది.
ఇక సౌమ్య స్వస్థలం నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలానికి చెందిన కిసాన్ నగర్ తండా. ప్రస్తుతం సౌమ్మ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. నేపాల్‌లో జరిగిన అండర్ 14 ఫుట్‌బాల్ పోటీల్లో భారత జట్టు తరఫున తొలిసారి ఆడిన సౌమ్య ఆ తర్వాత పలు మ్యాచ్‌ల్లో తన అసమాన ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంది. మరి ఈ తెలుగు తేజం అంతర్జాతీయంగా రాణించాలని మనమంతా కోరుకుందాం.
Also Read: ఆ ప్లేయర్‌ని ఈసారికి విడిచిపెట్టండి.. తమిళనాడు క్రికెట్ సంఘాన్ని కోరిన బీసీసీఐ.. ఎందుకో తెలుసా..