
సాధారణంగా క్రికెట్ అంటేనే పరుగులు, వికెట్ల లెక్కలు. అయితే ఎన్ని రన్స్ చేసినా? ఎన్ని వికెట్లు సాధించినా? తొలి సారి తీసిన పరుగు, మొదటి వికెట్ ఏ ఆటగాడికైనా మధురమే. అయితే ఒక్క ఆటగాడి కెరీర్‌లోనే కాదు.. ఏకంగా క్రికెట్ చరిత్రలోనే ఫస్ట్ వికెట్ తీసినా, ఫస్ట్ సెంచరీ కొట్టినా ఎంత పెద్ద అచీవ్‌మెంటో కదా. అయితే క్రికెట్ హిస్టరీలో ఫస్ట్ సిక్స్ కొట్టిన ప్లేయర్ ఎవరో తెలుసా? ఏ దేశానికి చెందిన వాడు, ఏ మ్యాచ్‌లో కొట్టాడు? ఏ బౌలర్ బౌలింగ్‌లో కొట్టాడు? అసలు అధికారికంగా అంతర్జాతీయ క్రికెట్ మొదలైన తర్వాత సిక్స్ కోసం రూల్స్ ఎలా ఉండేవి? ఎక్కడ పడితే సిక్స్‌గా డిక్లేర్ చేసేవారు? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
1877లో మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్‌తో అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌కు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత రెండు దశాబ్దాలకుపైగా గడిచిన తరువాత, 1898లో టెస్ట్ క్రికెట్ మరో అరుదైన ఘట్టానికి సాక్ష్యమైంది. ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాట్స్‌మన్ జో డార్లింగ్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి సిక్సర్ నమోదు చేసిన ఆటగాడిగా నిలిచారు. 1898లో ఆస్ట్రేలియా జాతీయ క్రికెట్ జట్టు-ఇంగ్లాండ్ జాతీయ క్రికెట్ జట్టు మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో, అడిలైడ్ ఓవల్ మైదానంలో డార్లింగ్ కొట్టిన భారీ షాట్ మైదానం అవతలికి వెళ్లింది. ఆ కాలంలో నేటిలా బౌండరీ దాటితే ఆరు పరుగులు ఇచ్చే రూల్ లేదు. బంతి కేవలం బౌండరీ దాటితే ఐదు పరుగులుగా లెక్కించేవారు. అయితే బంతి నేరుగా మైదానం బయటకు వెళ్తే మాత్రమే సిక్సర్‌గా పరిగణించేవారు.
ఆ మ్యాచ్‌లో డార్లింగ్ తన ఇన్నింగ్స్‌లో మొత్తం మూడు భారీ సిక్సర్లు బాదాడు. వాటిలో ఒకటి టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి సిక్సర్‌గా నమోదైంది. అదే మ్యాచ్‌లో ఆయన సెంచరీ కూడా సాధించాడు. డార్లింగ్ అద్భుత ప్రదర్శనతో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్‌పై ఇన్నింగ్స్ 13 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఐదు టెస్టుల సిరీస్‌ను కూడా 4-1తో కైవసం చేసుకుంది. 1870 నవంబర్ 21న జన్మించిన జో డార్లింగ్ కేవలం గొప్ప బ్యాట్స్‌మన్ మాత్రమే కాదు, విజయవంతమైన కెప్టెన్ కూడా. ఆయన నాయకత్వంలో ఆస్ట్రేలియా 21 టెస్టులు ఆడగా కేవలం నాలుగు మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడిపోయింది. టెస్ట్ క్రికెట్‌లో శతకం సాధించిన తొలి ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్‌గా కూడా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందాడు. నేటి క్రికెట్‌లో సిక్సర్లు వినోదానికి ప్రతీకగా మారినా, టెస్ట్ క్రికెట్‌లో తొలి సిక్సర్‌తో చరిత్ర సృష్టించిన జో డార్లింగ్ పేరు మాత్రం క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.
టెస్ట్ క్రికెట్‌లో డార్లింగ్ తొలి సిక్స్ కొడితే.. ఇక వన్డేల్లో ఆ ఫీట్ ఎవరు సాధించారో చాలా మందికి తెలిసే ఉంటుంది. వన్డే ఇంటర్నేషనల్స్‌లో 1971 జనవరి 5న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఇంగ్లాండ్‌పై తొలి వన్డే సిక్సర్ కొట్టిన ఘనత ఆస్ట్రేలియాకు చెందిన ఇయాన్ చాపెల్‌కు విస్తృతంగా దక్కింది. ఇక మోడ్రన్ క్రికెట్ అయిన టీ20ల విషయానికి వస్తే.. తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లోనే తొలి సిక్స్ కూడా నమోదైంది. 2005లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల మధ్య జరిగిన మొట్టమొదటి టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆసీస్ బ్యాటర్ మైఖేల్ క్లార్క్ తొలి సిక్సర్ కొట్టాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి