Watch: ఎంత పని చేశావు కోహ్లీ భాయ్.. చేతిలో పడ్డ క్యాచ్‌ను నేలపాలు చేస్తే ఎలా

Virat Kohli Catch Drop: గౌహతి‎ వన్డేలో ఒక చిన్న పొరపాటు టీమిండియాను ఎంతటి ఒత్తిడిలోకి నెట్టిందో ప్రత్యక్షంగా కనిపించింది. చేతిలోకి వచ్చిన సులువైన క్యాచ్‌ను విరాట్ కోహ్లీ నేలపాలు చేయడంతో లభించిన ఆ అవకాశాన్ని వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ రెండు చేతులా ఒడిసిపట్టుకుని ధనాధన్ సెంచరీతో భారత్‌ను కోలుకోలేని దెబ్బతీశారు.

Watch: ఎంత పని చేశావు కోహ్లీ భాయ్.. చేతిలో పడ్డ క్యాచ్‌ను నేలపాలు చేస్తే ఎలా
Virat Kohli

Updated on: Sep 30, 2026 | 5:58 PM

Virat Kohli Catch Drop: భారత్, వెస్ట్ ఇండీస్ జట్ల మధ్య గౌహతి‎లోని బర్సాపరా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో అనూహ్య ఘట్టం చోటుచేసుకుంది. ప్రపంచ స్థాయి ఫీల్డర్‌గా పేరుగాంచిన విరాట్ కోహ్లీ చేసిన చిన్న పొరపాటు భారత్‌కు భారీగా నష్టం కలిగించింది. విండీస్ ఇన్నింగ్స్ 20వ ఓవర్లో ఈ సంఘటన జరిగింది. షార్ట్ మిడ్-వికెట్ ప్రాంతంలో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ, వెస్ట్ ఇండీస్ కెప్టెన్ షై హోప్ ఇచ్చిన చాలా తేలికైన క్యాచ్‌‌ను జారవిడిచారు. ఈ దెబ్బతో విండీస్ కెప్టెన్ భారీ జీవనదానం పొంది జట్టు స్కోరును వేగంగా పెంచేశారు.

నమన్ ధీర్ తొలి వికెట్ ఆశలు ఆవిరి

యువ ఆల్‌రౌండర్ నమన్ ధీర్ వేసిన ఫుల్‌లెంత్ బంతిని షై హోప్ మిడ్-వికెట్ దిశగా గాలిలో బాదారు. నేరుగా కోహ్లీ చేతుల్లోకి వెళ్లిన బంతిని పట్టుకోవడానికి రివర్స్ కప్ విధానాన్ని ఉపయోగించినప్పటికీ, చేతివేళ్ల సందుల నుంచి బంతి జారి కింద పడిపోయింది. ఈ క్యాచ్ పట్టి ఉంటే అంతర్జాతీయ వన్డేల్లో నమన్ ధీర్‌కు అది మొదటి వికెట్ అయ్యేది. కానీ దేవుడు ఇచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టుకున్న విండీస్ బ్యాటర్లు వెంటనే రెండు పరుగులు తీసి కోహ్లీ పొరపాటును సొమ్ము చేసుకున్నారు.

లైఫ్ ఇచ్చిన విండీస్ కెప్టెన్ విధ్వంసం

లభించిన అవకాశాన్ని షై హోప్ సంపూర్ణంగా ఉపయోగించుకున్నారు. భారత బౌలర్లను ఒత్తిడిలోకి నెడుతూ నిలకడగా పరుగులు సాధించి ఒక అద్భుతమైన సెంచరీని పూర్తి చేశారు. అంతకుముందే మరొక ఓపెనర్ జాన్ కాంప్‌బెల్ 68 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 101 పరుగులు చేసి విధ్వంసం సృష్టించగా, షై హోప్ కూడా తోడవడంతో వెస్టిండీస్ మెరుగైన స్థానంలో నిలిచింది. క్యాచ్ జారవిడవడం వల్ల భారత జట్టు మూల్యం చెల్లించుకోవడమే కాకుండా, నమన్ ధీర్ ఆ తర్వాత కాసేపటికే గాయపడి మైదానాన్ని వీడటం భారత్‌ను మరింత ఆందోళనకు గురిచేసింది.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్నారు. సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న భారత్, ఈ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని భావించింది. అయితే కరేబియన్ బ్యాటర్ల ధాటి, విరాట్ కోహ్లీ క్యాచ్ డ్రాప్ వంటి పరిణామాలు వెస్ట్ ఇండీస్ జట్టుకు మ్యాచ్‌పై పట్టు సాధించే అవకాశాన్ని ఇచ్చాయి.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us