
Vaibhav Suryavanshi : భారత క్రికెట్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ నోట విన్నా ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ పేరే వినిపిస్తోంది. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతూ పరుగుల వరద పారిస్తున్న ఈ టీనేజ్ సెన్సేషన్ గురించి టీమిండియా వెటరన్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైభవ్ కేవలం టీ20లకే పరిమితం కాకుండా టెస్టు క్రికెట్ కూడా ఆడాలని, అప్పుడే ఒక ఆటగాడిగా పరిపూర్ణత వస్తుందని పుజారా అభిప్రాయపడ్డారు. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ వంటి అతిపెద్ద లీగ్‌లో వైభవ్ సూర్యవంశీ అదరగొడుతున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్.. ప్రస్తుత సీజన్‌లో ఆ జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు 10 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 404 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో భవిష్యత్తు టీమ్ ఇండియా స్టార్‌గా అవతరించాడు.
వైభవ్ పెర్ఫార్మెన్స్ చూసి అతడిని వెంటనే టీమిండియా టీ20 జట్టులోకి తీసుకోవాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. అయితే పుజారా మాత్రం వైభవ్ టెస్టు క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నారు. “వైభవ్ టీ20ల్లో అద్భుతంగా ఆడుతున్నాడు, అతడికి త్వరలోనే టీమిండియా పిలుపు వస్తుంది. కానీ టెస్టు క్రికెట్ అనేది ప్రతి యువ ఆటగాడి మనసులో ఉండాలి. ఒక ఆటగాడికి గౌరవం, పట్టుదల, టెక్నిక్ అనేవి టెస్టుల నుంచే వస్తాయి. సామర్థ్యం ఉంటే వైభవ్ కచ్చితంగా టెస్టుల్లో కూడా రాణించాలి” అని పుజారా పేర్కొన్నారు.
టెస్టు క్రికెట్ గొప్పదే అయినప్పటికీ.. వైట్ బాల్ (పరిమిత ఓవర్ల) నిపుణులకు కూడా తమదైన ప్రాముఖ్యత ఉంటుందని పుజారా చెప్పారు. శ్రేయస్ అయ్యర్, వైభవ్ వంటి ఆటగాళ్లను వారి బలాబలాలకు అనుగుణంగా వాడుకోవాలని సూచించారు. వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు ఆటగాళ్లను ఎంపిక చేసే విధానాన్ని ఆయన సమర్థించారు. దీనివల్ల ఆటగాళ్లపై ఒత్తిడి తగ్గడమే కాకుండా, ఆయా ఫార్మాట్లలో జట్టు మరింత బలంగా తయారవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
జియోస్టార్ సిటివి హిందీ ఫీడ్ నిపుణుడిగా తన కొత్త పాత్ర గురించి కూడా పుజారా ముచ్చటించారు. టీవీలో మ్యాచ్ విశ్లేషణ చేయడం ద్వారా అభిమానులకు ఆటలోని లోటుపాట్లను వివరించవచ్చని ఆయన చెప్పారు. ఆటగాడిగా తనకున్న అనుభవం ద్వారా ఫీల్డ్‌లో జరిగే పరిస్థితులు, టెక్నిక్, బౌలింగ్ వ్యూహాలను విడమర్చి చెప్పడం వల్ల కుర్రాళ్లకు కూడా ఆటపై అవగాహన పెరుగుతుందని తెలిపారు. ఒక ఆటగాడు ఒక షాట్‌ను ఎలా ఆడాడు లేదా బౌలర్ ఏ యాంగిల్ వాడుతున్నాడు వంటి విషయాలు ప్రేక్షకులకు తెలియజేయడం తనకు సంతోషంగా ఉందన్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..