Indian Cricket Team: టీ20 ప్రపంచకప్ 2021 నుంచి టీమిండియా నిష్క్రమించింది. సెమీ-ఫైనల్‌కు చేరుకోకుండానే టోర్నమెంట్ నుంచి తప్పుకుంది. ఐపీఎల్‌లో కొందరు ఆటగాళ్లు తమ ఆటతీరుతో అందరినీ ఆకర్షించారు. తమ జట్టుకు విజయాలు కూడా అందించారు. కానీ, వారి పేర్లు అంతగా ఫేమ్ రానుందున వారికి జట్టులో స్థానం ఇవ్వలేదనే విమర్శలు వస్తున్నాయి. కాగా, ఫామ్ కోసం తంటాలు పడుతున్న హార్దిక్ పాండ్యా లాంటి ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం ఎంతవరకు సబబు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఐపీఎల్ ఫేజ్-2 ప్రారంభం కాకముందే టీ20 ప్రపంచకప్ కోసం టీమ్ ఇండియా స్వ్కాడ్ ప్రకటించారు. అయితే లీగ్ ప్రారంభమైన తర్వాత కూడా ప్రపంచకప్ జట్టులో మార్పులు చేసుకోవచ్చేని ఐసీసీ వెల్లడించడంతో.. ఐపీఎల్‌లో రాణించిన వారికి చోటు దక్కవచ్చనే వార్తలు వినిపించాయి. కానీ సెలెక్టర్లు మాత్రం అలాంటి వాటి జోలికి పోలేదు. చేతన్ శర్మ, కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రధాన కోచ్ రవిశాస్త్రి నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ కేవలం ఒకే ఒక మార్పు చేసి అక్షర్ పటేల్ స్థానంలో శార్దూల్ ఠాకూర్‌ను చివరి 15 మందిలో చేర్చారు.
గత నాలుగేళ్లలో భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన యుజ్వేంద్ర చాహల్‌ను కూడా పరిగణనలోకి తీసుకోలేదు. మరోవైపు ఫిట్‌నెస్ లేని హార్దిక్ పాండ్యా కూడా జట్టులోకి వచ్చాడు. ఐపీఎల్ ఫేజ్-2లో అద్భుతమైన ఆటతీరు కనబరిచిన ఆటగాళ్ల పేర్లను ఒకసారి పరిశీలిస్తే.. వారిలో ఒక్కరూ కూడా జట్టులో అవకాశం పొందలేకపోవడం గమనార్హం.
యుజ్వేంద్ర చాహల్‌కు బదులుగా రాహుల్ చాహర్..
టీ20 ప్రపంచకప్‌కి ఎంపిక చేసిన జట్టులో, వెటరన్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కంటే రాహుల్ చాహర్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. దీనిపై చాలా ప్రశ్నలు కూడా లేవనెత్తారు. కానీ, వాటిని కూడా పట్టించుకోలేదు మేనేజ్‌మెంట్. ఐపీఎల్ ఫేజ్-2లో రాహుల్ ప్రదర్శన పేలవంగా ఉంది. అతను నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం రెండు వికెట్లు మాత్రమే తీయగలిగాడు. చాహర్ ఫామ్‌లో లేడు. దీని కారణంగా అతను ఫేజ్ 2లోని మిగిలిన మ్యాచ్‌లలో తొలగించారు. ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి వార్మప్ మ్యాచ్‌లో కూడా 43 పరుగులు మాత్రమే చేశాడు. ప్రపంచ కప్‌లో, అతను ఒకే ఒక్క మ్యాచ్‌లో ఆడే అవకాశం పొందాడు. నమీబియాపై కూడా అతను వికెట్ తీయకుండా 30 పరుగులు ఇచ్చాడు.
అదే సమయంలో ఐపీఎల్ ఫేజ్ 2లో చాహల్ ప్రదర్శన చాలా ప్రభావవంతంగా ఉంది. అతను ఆర్‌సీబీని ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లడంలో కీలకపాత్ర పోషించాడు. యూఏఈ మైదానంలో ఎనిమిది మ్యాచ్‌లలో 14 వికెట్లు తీసి పేరుగాంచాడు. ఈ గణాంకాలను పక్కన పెడితే, చాహల్ 2016 నుంచి ప్రపంచ కప్ ప్రారంభం వరకు టీ20ఐలలో భారతదేశం తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా మారాడు. 49 మ్యాచ్‌లలో 25.30 సగటుతో 63 వికెట్లు పడగొట్టాడు. అయితే దీని తర్వాత కూడా అతనికి టీ20 ప్రపంచకప్‌లో స్థానం లభించలేదు.
హార్దిక్ స్థానంలో వెంకటేష్ లేదా హర్షల్ వస్తే..!
హార్దిక్ పాండ్యా పూర్తిగా ఫిట్‌గా లేడని అందరికీ తెలుసు. అతను ఐపీఎల్ ఫేజ్-2 ప్రారంభ మ్యాచ్‌లలో బెంచ్‌పై కనిపించాడు. ఆ తరువాత ఆడిన మ్యాచుల్లోనూ ఫాంతో నానా తంటాలు పడ్డాడు. ఫేజ్ 2లో అతని బ్యాట్ నుంచి ఎక్కువగా పరుగులు రాలేదు. అలాగే అసలు బౌలింగ్ కూడా చేయలేదు. అయితే దీని తర్వాత కూడా సెలెక్టర్, కెప్టెన్ కోహ్లీ పెద్ద పేరున్న హార్దిక్‌కు జట్టులో చోటు కల్పించి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
హార్దిక్ పాండ్యా స్థానంలో యువ ఆటగాడు వెంకటేష్ అయ్యర్ లేదా హర్షల్ పటేల్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్ ఫేజ్-2లో కేకేఆర్ తరఫున ఆడుతున్న సమయంలో వెంకటేష్ అయ్యర్ తన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. 10 మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా 370 పరుగులు చేసి 3 వికెట్లు కూడా పడగొట్టాడు. అయ్యర్ జట్టు కోసం ఓపెనింగ్ కాకుండా ఫినిషర్ పాత్రలో కనిపించవచ్చు. అలాగే ఆరో బౌలర్ ఖాళీని కూడా భర్తీ చేసినట్లు అయ్యేది.
హర్షల్ పటేల్ గురించి మాట్లాడితే, ఐపీఎల్ 2021లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా పలు రికార్డులు సాధించాడు. టోర్నీలో 32 వికెట్లు తీయడమే కాకుండా ఫేజ్-2లో 8 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు తీశాడు. ఫామ్‌ను బట్టి పటేల్‌ను జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది. హర్షల్ జట్టుకు మంచి ఫాస్ట్ బౌలర్‌తో పాటు ఆల్ రౌండర్ పాత్రను పోషించగలడు.
రితురాజ్ గైక్వాడ్..
ఐపీఎల్ 2021లో రితురాజ్ గైక్వాడ్ ఆధిపత్యం కనిపించింది. ఐపీఎల్2021 టైటిల్‌ను చెన్నై సూపర్ కింగ్స్ సాధించడంలో రితురాజ్ కీలక పాత్ర పోషించాడు. అతను 9 ఇన్నింగ్స్‌ల్లో 2 అర్ధసెంచరీలు, ఒక సెంచరీ సాధించాడు. 439 పరుగులు చేసిన ఈ ఆటగాడు విపరీతమైన ఫామ్‌లో ఉన్నా ప్రపంచకప్ జట్టులో అవకాశం ఇవ్వలేదు. ఫేజ్-2లో సూర్యకుమార్ యాదవ్ లయ తప్పుతూ కనిపించాడు. అయినప్పటికీ అతని స్థానంలో గైక్వాడ్‌కు అవకాశం వస్తే బాగుండేది.
ఇది కాకుండా యూఏఈ గణాంకాల గురించి మాట్లాడితే గతేడాది ఐపీఎల్‌లో రితురాజ్ గైక్వాడ్ బ్యాట్‌తో పరుగుల వర్షం కురిసింది. కేవలం 6 ఇన్నింగ్స్‌లలో అతను 120.71 స్ట్రైక్ రేట్, 51 సగటుతో 204 పరుగులు చేశాడు. అయినప్పటికీ టీ20 ప్రపంచకప్‌లో అతడిని సెలక్టర్లు తీసుకోలేదు.
ఫామ్‌లో లేని భువీ..
గాయం తర్వాత తిరిగి వచ్చిన భువనేశ్వర్ కుమార్ ప్రదర్శన ప్రత్యేకంగా ఏంలేదు. ఐపీఎల్ ఫేజ్-2లో 6 మ్యాచ్‌లు ఆడిన భువీ కేవలం 3 వికెట్లు తీశాడు. ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో ఆడేందుకు అతనికి అవకాశం వచ్చింది. కానీ, అతని స్థాయికి అనుగుణంగా ప్రదర్శన కనిపించలేదు. భువనేశ్వర్ మూడు ఓవర్ల బౌలింగ్‌లో 8.30 ఎకానమీతో వికెట్ తీయకుండా 25 పరుగులు ఇచ్చాడు. ఈ పోటీలో అతని బంతుల్లో తగినంత స్పీడ్ కనిపించలేదు.
భువీ స్థానంలో అవేశ్ ఖాన్‌కు అవకాశం ఇస్తే బాగుండేది. అవేష్ గత కొంతకాలంగా ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌లో మంచి ప్రదర్శన చేస్తున్నాడు. ఈ ఏడాది ఇంగ్లండ్ పర్యటనలోనూ నెట్ బౌలర్‌గా జట్టులో ఉంచారు. ఐపీఎల్ ఫేజ్-2లో కూడా యువ ఫాస్ట్ బౌలర్ 7.06 ఎకానమీతో 10 వికెట్లు పడగొట్టాడు.
Also Read: T20 World Cup 2021: టాస్ ఓడినా, గెలిచినా.. మైదానంలో 100 శాతం ప్రదర్శన ఇవ్వాల్సిందే: విరాట్ కోహ్లీ