
Cricket Records : ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా టీ20 ప్రపంచకప్ 2026 సందడి మొదలుకానుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న టీమిండియా.. తన సొంత గడ్డపై మూడోసారి ట్రోఫీని గెలిచి చరిత్ర సృష్టించాలని పట్టుదలగా ఉంది. క్రికెట్ టోర్నీ ఏదైనా సరే, మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు ఇచ్చే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు ప్రత్యేక గౌరవం ఉంటుంది. ఇప్పటి వరకు జరిగిన 9 పొట్టి ప్రపంచకప్ టోర్నీల చరిత్రలో అత్యధిక సార్లు ఈ ఘనత సాధించిన ఆటగాళ్ల జాబితాలో మన కింగ్ కోహ్లీ అందరికంటే ముందున్నాడు.
నెంబర్ వన్ స్థానంలో విరాట్ కోహ్లీ
టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధికంగా 8 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకుని విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. 2012 నుంచి 2024 వరకు మొత్తం 7 ప్రపంచకప్‌లలో పాల్గొన్న కోహ్లీ, 35 మ్యాచ్‌ల్లోనే ఈ అద్భుతమైన ఘనతను సాధించాడు. క్లిష్ట పరిస్థితుల్లో జట్టును ఆదుకోవడంలో కోహ్లీకి సాటిరెవరూ లేరని ఈ గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో కోహ్లీ ప్రదర్శన మరచిపోలేము.
రెండో స్థానంలో నలుగురు దిగ్గజాలు
జాబితాలో రెండో స్థానం కోసం నలుగురు ఆటగాళ్ల మధ్య గట్టి పోటీ ఉంది. వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్, శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్, స్పిన్నర్ ఆడమ్ జంపా తలో 5 సార్లు ఈ అవార్డును అందుకున్నారు. ఇందులో ఆడమ్ జంపా కేవలం 21 మ్యాచ్‌ల్లోనే 5 సార్లు అవార్డు గెలుచుకోవడం విశేషం. జయవర్ధనే 31 మ్యాచ్‌ల్లో, గేల్ 33 మ్యాచ్‌ల్లో, వాట్సన్ 24 మ్యాచ్‌ల్లో ఈ ఫీట్ సాధించారు.
మూడు, నాలుగో స్థానాల్లో ఎవరంటే?
మూడో స్థానంలో దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్, శ్రీలంక మాజీ ఓపెనర్ తిలకరత్నే దిల్షాన్, పాక్ స్టార్ షాహిద్ ఆఫ్రిది, బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ ఉన్నారు. వీరు నలుగురు తలో 4 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లుగా నిలిచారు. ఇక నాలుగో స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ (భారత్), జోస్ బట్లర్ (ఇంగ్లాండ్), సనత్ జయసూర్య (శ్రీలంక), కెవిన్ పీటర్సన్ (ఇంగ్లాండ్) వంటి ఆరుగురు ఆటగాళ్లు 3 సార్లు చొప్పున ఈ అవార్డును సొంతం చేసుకున్నారు.
ఈ గణాంకాలను పరిశీలిస్తే శ్రీలంక ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్‌లో అత్యంత ప్రభావం చూపినట్లు అర్థమవుతోంది. అయితే, రాబోయే 2026 ప్రపంచకప్‌లో ఈ జాబితాలో మరిన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా వంటి ప్రస్తుత తరం ఆటగాళ్లు కోహ్లీ రికార్డు దిశగా అడుగులు వేస్తారేమో చూడాలి.