
Surya kumar Yadav : ప్రముఖ మోడల్, నటి ఖుషీ ముఖర్జీ ఇటీవల ఒక మీడియా ఈవెంట్‌లో మాట్లాడుతూ.. టీమిండియా స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ గతంలో తనకు తరచూ మెసేజ్‌లు చేసేవాడని సంచలన వ్యాఖ్యలు చేసింది. “చాలామంది క్రికెటర్లు నా వెనుక పడ్డారు. సూర్యకుమార్ కూడా నాకు చాలా మెసేజ్‌లు చేసేవాడు. కానీ ఇప్పుడు మా మధ్య ఎలాంటి కాంటాక్ట్ లేదు. నాకు క్రికెటర్లతో లింక్-అప్స్ ఇష్టం లేదు” అని ఆమె అనడం సోషల్ మీడియాలో దావాగ్నిలా వ్యాపించింది. ఈ వ్యాఖ్యలు సూర్యకుమార్ అభిమానులను తీవ్రంగా కలిచివేసాయి.
ఖుషీ ముఖర్జీ చేసిన ఆరోపణలు కావాలని సూర్యకుమార్ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపిస్తూ ముంబైకి చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫైజాన్ అన్సారీ రంగంలోకి దిగారు. ఆయన ఉత్తరప్రదేశ్‌లోని గజీపూర్ పోలీస్ స్టేషన్‌లో ఖుషీ ముఖర్జీపై ఏకంగా రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఇది కేవలం పబ్లిసిటీ కోసం చేసిన చౌకబారు పని అని, దీనివల్ల దేశ గౌరవమైన క్రికెటర్ ఇమేజ్ దెబ్బతింటుందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒకవేళ తన ఆరోపణలను ఆమె నిరూపించలేకపోతే జైలు శిక్ష అనుభవించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.
చట్టపరమైన చిక్కులు ఎదురవ్వడంతో నటి ఖుషీ ముఖర్జీ తన మాట మార్చింది. తన వ్యాఖ్యలను మీడియా తప్పుగా అర్థం చేసుకుందని, సెన్సేషన్ కోసం వక్రీకరించిందని ఆమె వాదిస్తోంది. అంతేకాదు ఆ సమయంలో తన సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ అయ్యాయని, తన పాత చాట్‌లను ఎవరో తప్పుగా వాడుతున్నారని సరికొత్త వాదనను తెరపైకి తెచ్చింది. “మా మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే. సూర్యకుమార్ గతంలో మ్యాచ్ ఓడిపోయినప్పుడు ఒక స్నేహితుడిగా పలకరించారు. మా మధ్య ఎలాంటి ప్రేమ సంబంధం లేదు” అని ఆమె స్పష్టం చేసింది. అనవసరంగా ఈ విషయాన్ని పెద్దది చేయవద్దని ఆమె వేడుకుంటోంది.
ఈ మొత్తం గందరగోళంపై సూర్యకుమార్ యాదవ్ మాత్రం ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. ఆయన ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా తిరుపతి వంటి దేవాలయాలను సందర్శిస్తున్నారు. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉంటూ, రాబోయే టీ20 వరల్డ్ కప్ సన్నాహాలపైనే ఆయన దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. మరోవైపు సూర్యకుమార్ భార్య దేవిషా శెట్టి పట్ల తమకు ఎంతో గౌరవం ఉందని, వారి వ్యక్తిగత జీవితాన్ని తాము రెస్పెక్ట్ చేస్తామని ఖుషీ ముఖర్జీ తాజా ఇంటర్వ్యూలో పేర్కొనడం గమనార్హం.