IPL 2026 SRH : ఉప్పల్ గడ్డ.. హైదరాబాద్ అడ్డా.. ఐపీఎల్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని ఘనత సాధించిన సన్ రైజర్స్

IPL 2026 SRH : సొంత మైదానమైన ఉప్పల్ స్టేడియంలో పంజాబ్‌పై వరుసగా విజయం సాధిస్తూ చరిత్ర సృష్టించింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలుపుతో ఎస్‌ఆర్‌ హెచ్ ఒక చారిత్రాత్మక రికార్డును నెలకొల్పింది.

IPL 2026 SRH : ఉప్పల్ గడ్డ.. హైదరాబాద్ అడ్డా.. ఐపీఎల్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని ఘనత సాధించిన సన్ రైజర్స్
Srh

Updated on: May 07, 2026 | 6:31 PM

IPL 2026 SRH : ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జైత్రయాత్ర కొనసాగుతోంది. బుధవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో 33 పరుగుల తేడాతో విజయం సాధించిన ఆరెంజ్ ఆర్మీ, పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవడమే కాకుండా ప్రపంచ క్రికెట్‌లోనే ఎవరికీ సాధ్యం కాని ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. సొంత మైదానమైన ఉప్పల్ స్టేడియంలో పంజాబ్‌పై వరుసగా విజయం సాధిస్తూ చరిత్ర సృష్టించింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలుపుతో ఎస్‌ఆర్‌హెచ్ ఒక చారిత్రాత్మక రికార్డును నెలకొల్పింది. ఒకే వేదికపై ఒక నిర్దిష్ట జట్టుపై వరుసగా అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా నిలిచింది. 2015 నుంచి 2026 వరకు హైదరాబాద్‌లో పంజాబ్ మీద ఎస్‌ఆర్‌హెచ్ వరుసగా 9 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇంతకుముందు ఈ రికార్డు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) పేరిట ఉండేది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఆర్‌సీబీపై వరుసగా 8 సార్లు గెలిచిన సీఎస్‌కే రికార్డును ఇప్పుడు హైదరాబాద్ చెరిపేసింది.

ఒకే జట్టుపై 10 విజయాలు సాధించిన రెండో టీమ్

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఒకే స్టేడియంలో ఒక జట్టుపై 10 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిన రెండో జట్టుగా కూడా ఎస్‌ఆర్‌హెచ్ నిలిచింది. వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ మీద ముంబై ఇండియన్స్ 11 సార్లు గెలిచి మొదటి స్థానంలో ఉండగా, హైదరాబాద్ గడ్డపై పంజాబ్‌ను 10 సార్లు ఓడించి ఎస్‌ఆర్‌హెచ్ రెండో స్థానంలో నిలిచింది. ఈ విజయంతో సన్‌రైజర్స్ ఖాతాలో ఇప్పుడు 14 పాయింట్లు చేరాయి, దీనితో వారు పాయింట్ల పట్టికలో నంబర్ 1 స్థానానికి చేరుకున్నారు.

క్లాసెన్, ఇషాన్ కిషన్ పరుగుల సునామీ

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ భారీ స్కోరు సాధించింది. హెన్రిచ్ క్లాసెన్ (69), ఇషాన్ కిషన్ (55) మెరుపు హాఫ్ సెంచరీలతో విరుచుకుపడ్డారు. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (38), అభిషేక్ శర్మ (35) కేవలం 3.3 ఓవర్లలోనే 54 పరుగులు జోడించి అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. దీనితో ఎస్‌ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోరును బోర్డుపై ఉంచింది. పంజాబ్ బౌలర్లను హైదరాబాద్ బ్యాటర్లు ఊచకోత కోశారు.

కూపర్ కానోలీ ఒంటరి పోరాటం వృథా

236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ఆరంభంలోనే తడబడింది. కేవలం 3.2 ఓవర్లకే 23 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే పంజాబ్ బ్యాటర్ కూపర్ కానోలీ అద్భుతమైన సెంచరీతో (59 బంతుల్లో 107 నాటౌట్) పోరాటం చేశాడు. కానీ అతనికి మిగిలిన ఆటగాళ్ల నుంచి సహకారం లభించలేదు. చివరికి పంజాబ్ 7 వికెట్ల నష్టానికి 202 పరుగులు మాత్రమే చేయగలిగింది. హైదరాబాద్ బౌలర్లలో ప్యాట్ కమిన్స్, శివాంగ్ కుమార్ తలో రెండు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us