
Sourav Ganguly: భారత మాజీ క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తన అనుమతి లేకుండా వ్యక్తిగత గుర్తింపు, క్రికెట్ కెరీర్‌లోని కీలక ఘట్టాలను ఉపయోగిస్తున్నారంటూ దూస్రా సినిమా విడుదలను ఆపాలని ఆయన కోర్టును ఆశ్రయించారు. అయితే అక్టోబర్ 23న విడుదల కావాల్సిన ఈ సినిమాపై తక్షణం స్టే విధించేందుకు కోర్టు నిరాకరించింది. సినిమా విడుదలకు ఒక్క రోజు ముందు వెలువడిన ఈ తీర్పు క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జస్టిస్ దినేష్ భట్ నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.
2002లో ఇంగ్లండ్‌తో జరిగిన నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్ భారత క్రికెట్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించింది. ఆ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించిన తర్వాత లార్డ్స్ మైదానంలోని బాల్కనీలో గంగూలీ షర్ట్ విప్పి సంబరాలు చేసుకున్నాడు. ఈ ఘటన అప్పట్లోనే కాదు, ఇప్పటికీ క్రికెట్ అభిమానులకు గుర్తుండిపోయింది. దూస్రా సినిమా ప్రచారంలో గంగూలీ కెప్టెన్సీ, ఆ చారిత్రక విజయం, ఆయన సంబరాలకు సంబంధించిన దృశ్యాలను ఉపయోగించడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తన పేరు, ప్రతిష్ఠ, వ్యక్తిత్వాన్ని వాణిజ్య ప్రయోజనాల కోసం అనుమతి లేకుండా వాడుతున్నారని గంగూలీ తరఫు న్యాయవాదులు కోర్టులో వాదించారు.
లవ్ ఫిల్మ్స్ ఎల్‌ఎల్‌పీ సంస్థతో కలిసి ఆయన ఈ పిటిషన్ వేశారు. అయితే సినిమా మేకర్స్ తరఫు న్యాయవాది వాదిస్తూ ఇది పూర్తిగా బయోపిక్ కాదని, రాజస్థాన్‌కు చెందిన ఒక మధ్యతరగతి అమ్మాయి క్రికెట్ స్ఫూర్తితో ఎదిగే కల్పిత కథ అని స్పష్టం చేశారు. కొన్ని వీడియో క్లిప్‌ల వాడకానికి సంబంధించి తగిన అనుమతులు తీసుకున్నట్లు తెలిపారు. కోర్టు విచారణ సందర్భంగా న్యాయమూర్తి స్పందిస్తూ సువిధా కా సంతులన్(Balance of Convenience) అనే చట్టపరమైన అంశం ప్రస్తుతం సినిమా నిర్మాతలకు అనుకూలంగా ఉందని పేర్కొన్నారు. చివరి నిమిషంలో సినిమా విడుదలను ఆపడం వల్ల నిర్మాతలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని కోర్టు అభిప్రాయపడింది. వాది తరఫున హక్కులు ఉన్నప్పటికీ, హడావుడిగా స్టే ఇవ్వలేమని కోర్టు తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 23న సినిమా అనుకున్న ప్రకారమే థియేటర్లలో విడుదల కావడానికి మార్గం సుగమమైంది.
ఈ కేసు విచారణను కోర్టు తదుపరి తేదీకి వాయిదా వేసింది. అయితే సినిమా విడుదల ఆగిపోకపోయినా, వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి కోర్టులో న్యాయ పోరాటం కొనసాగే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందనే అంశంపై ఇటు సినిమా ఇండస్ట్రీతో పాటు అటు క్రికెట్ అభిమానులలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..