
Sompal Kami Dismissal: క్రికెట్‌లో అప్పుడప్పుడు జరిగే కొన్ని ఘటనలు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. తాజాగా నేపాల్ ప్రీమియర్ లీగ్ 2026 (Nepal Premier League 2026)లో అలాంటి అరుదైన సంఘటన చోటుచేసుకుంది. నవంబర్ 9న కీర్తిపూర్‌లోని త్రిభువన్ యూనివర్సిటీ అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో కర్నాలి యాక్స్ (Karnali Yaks), పోఖారా అవెంజర్స్ (Pokhara Avengers) మధ్య 19వ మ్యాచ్ జరిగింది. ఈ పోరులో కర్నాలి యాక్స్ కెప్టెన్ సోంపాల్ కామి (Sompal Kami) ఒకే బంతిని రెండుసార్లు బ్యాట్‌తో కొట్టాడు. దీంతో ప్రత్యర్థి జట్టు అప్పీల్ చేయగా, అంపైర్లు అతడిని ఔట్‌గా ప్రకటించారు. సాధారణంగా క్రికెట్‌లో చాలా అరుదుగా కనిపించే ఈ తరహా ఔట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
పోఖారా అవెంజర్స్ నిర్దేశించిన 218 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కర్నాలి యాక్స్ బ్యాటింగ్ చేస్తోంది. ఇన్నింగ్స్ 15వ ఓవర్ చివరి బంతిని స్పిన్నర్ బిపిన్ ఖత్రి (Bipin Khatri) వేశాడు. ఆఫ్ స్టంప్ బయట పడిన బంతి టర్న్ కావడంతో సోంపాల్ కామి బ్యాట్ లోపలి అంచును తాకింది.
అయితే బంతి వికెట్ల వైపు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నంలోనో, అసహనంతోనో కామి మరోసారి బ్యాట్‌తో దానిని కొట్టాడు. దీంతో బంతి స్టంప్స్‌కు దూరంగా వెళ్లింది. కానీ ప్రత్యర్థి ఆటగాళ్లు వెంటనే అంపైర్లకు అప్పీల్ చేశారు.
పోఖారా ఆటగాళ్ల అప్పీల్ తర్వాత అంపైర్లు పరిస్థితిని పరిశీలించారు. చివరకు సోంపాల్ కామిని ఔట్‌గా ప్రకటించారు. దీంతో కర్నాలి యాక్స్ 15 ఓవర్లలో 130 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయింది. అయితే సాధారణంగా బ్యాటర్ బంతిని రెండుసార్లు కొడితే అది నిబంధనలకు విరుద్ధమా? అనే సందేహం అభిమానుల్లో మొదలైంది.
క్రికెట్ నిబంధనల్లో ‘హిట్ ది బాల్ ట్వైస్’ (Hit the Ball Twice) అనే ప్రత్యేక ఔట్ విధానం ఉంది. బ్యాటర్ ఉద్దేశపూర్వకంగా ఒకే బంతిని రెండోసారి కొడితే ఈ నిబంధన వర్తించవచ్చు.
అయితే ఇక్కడ ఓ ముఖ్యమైన మినహాయింపు ఉంది. బంతి వికెట్లను తాకకుండా కాపాడుకునేందుకు బ్యాటర్ రెండోసారి కొట్టవచ్చు. కానీ ఆ ప్రయత్నంలో ఫీల్డర్ క్యాచ్ పట్టకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకోకూడదు.
మరోవైపు ‘అబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్’ (Obstructing the Field) అనే నిబంధన కూడా ఉంది. బ్యాటర్ ఉద్దేశపూర్వకంగా ఫీల్డింగ్ జట్టును అడ్డుకున్నప్పుడు ఈ విధంగా ఔట్ ప్రకటించే అవకాశం ఉంటుంది.
సోంపాల్ కామి ఘటనలో బంతిని రెండుసార్లు కొట్టడం ప్రధాన వివాదంగా మారింది. అయితే రెండోసారి బ్యాట్‌తో బంతిని కొట్టడానికి గల ఉద్దేశం, అధికారికంగా ఏ నిబంధన కింద ఔట్ ఇచ్చారన్నది కీలకం. ఈ అరుదైన ఘటనతో క్రికెట్‌లో ఎక్కువ మందికి తెలియని ఔట్ నిబంధనలపై మరోసారి చర్చ మొదలైంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..