
Shreyas Iyer : టీమిండియా తదుపరి మిషన్ న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్. జనవరి 11 నుంచి ప్రారంభం కానున్న ఈ మూడు వన్డేల సిరీస్ కోసం సెలక్టర్లు జట్టును ప్రకటించాల్సి ఉంది. అయితే ఇప్పుడు అందరి కళ్లు టీమిండియా వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ పైనే ఉన్నాయి. ఆస్ట్రేలియా పర్యటనలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలైన అయ్యర్, ఇప్పుడు కోలుకుని మళ్లీ బ్యాట్ పట్టడం అభిమానుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ఆయన బెంగళూరులోని బిసిసిఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో కోలుకుంటున్నారు.
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో క్యాచ్ పట్టేందుకు డైవ్ చేసిన సమయంలో అయ్యర్ పక్కటెముకలకు బలమైన గాయమైంది. ఆ నొప్పి ఎంత తీవ్రంగా ఉందంటే, ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. పరీక్షల్లో ఇంటర్నల్ బ్లీడింగ్ (అంతర్గత రక్తస్రావం) జరుగుతున్నట్లు తేలడంతో క్రికెట్ ప్రేమికులు ఆందోళన చెందారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. శ్రేయస్ చాలా వేగంగా కోలుకుంటున్నారు. ఆయన స్వయంగా నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో, కివీస్ సిరీస్ నాటికి ఆయన అందుబాటులోకి వస్తారనే ప్రచారం జరుగుతోంది.
Shreyas Iyer’s first net Season after injury at cci on 24th December
He batted around one hour without any discomfort and went to coe the next day
He is currently at coe pic.twitter.com/zUj4KnL6sL— Sawai96 (@Aspirant_9457) December 26, 2025
భారత్ – న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే జనవరి 11న వడోదరలో జరగనుంది. ఆ తర్వాత 14న రాజకోట్, 18న ఇండోర్‌లో మిగిలిన మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ వన్డే సిరీస్ తర్వాత ఐదు టీ20ల సిరీస్ కూడా ఉంది, దీని కోసం ఇప్పటికే జట్టును ప్రకటించారు. అయితే వన్డే జట్టు ప్రకటన మాత్రం శ్రేయస్ అయ్యర్ ఫిట్‌నెస్ రిపోర్ట్‌పై ఆధారపడి ఆగిపోయినట్లు తెలుస్తోంది. అయ్యర్ ప్రస్తుతం జిమ్‌లో కఠినమైన కసరత్తులు చేస్తూ పూర్తి ఫిట్‌నెస్ సాధించే పనిలో ఉన్నారు.
టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. అయ్యర్ కోలుకుంటున్న తీరు సంతృప్తికరంగా ఉన్నప్పటికీ, బిసిసిఐ తొందరపడదలచుకోలేదు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇచ్చే మెడికల్ రిపోర్ట్ ఆధారంగానే ఆయనను జట్టులోకి తీసుకోవాలా వద్దా అన్నది నిర్ణయిస్తారు. ఒకవేళ శ్రేయస్ అయ్యర్ వంద శాతం ఫిట్‌గా లేకపోతే, ఆయన స్థానంలో ఎవరిని తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఛాంపియన్స్ ట్రోఫీని దృష్టిలో ఉంచుకుని, వైస్ కెప్టెన్ అయ్యర్ ఫిట్‌నెస్‌ను బిసిసిఐ అత్యంత కీలకంగా భావిస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..