
Shikhar Dhawan: భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ తాజాగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ టోర్నమెంట్లో తాను పాల్గొంటున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అబద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఎలాంటి అనుమతి లేదా సమాచారం ఇవ్వకుండానే నిర్వాహకులు తన పేరును ఆటగాళ్ల జాబితాలో చేర్చడంపై ధావన్ మండిపడ్డారు. ఈ వ్యవహారంపై ఆయన తన లీగల్ టీంతో కలిసి కఠినమైన న్యాయపరమైన చర్యలకు దిగనున్నట్లు సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు.
పాకిస్థాన్ ఆటగాళ్లతో జట్టులో పేరు
ఆ టోర్నమెంట్లో ఏషియా వారియర్స్ అనే జట్టు తరఫున శిఖర్ ధావన్ ఆడనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ జట్టులో పాకిస్థాన్‌కు చెందిన పలువురు క్రికెటర్లు సోహైల్ తన్వీర్, ఇఫ్తికార్ అహ్మద్, మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ తదితరులు ఉన్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా భారత్ తరఫున రాహుల్ శర్మ, గురుకీరత్ సింగ్ మన్, అభిమన్యు మిథున్ పేర్లు కూడా ఆ జాబితాలో చేర్చారు. తమతో ఎలాంటి సంబంధం లేని ఈ టోర్నమెంట్లో పేర్లను వాడటం పట్ల భారత ఆటగాళ్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియా వేదికగా క్లారిటీ
ఈ వివాదంపై సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా శిఖర్ ధావన్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ టోర్నమెంట్లో తన పేరు ఉండటాన్ని తాను చూశానని, తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే నిర్వాహకులు ఈ పని చేశారని తెలిపారు. అభిమానులు, మీడియా ఈ వదంతులను నమ్మవద్దని కోరారు. తన లీగల్ టీమ్ త్వరలోనే తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని తేల్చిచెప్పారు. నిరంతరం ప్రేమ అందిస్తున్న అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
గతంలో పాకిస్థాన్‌పై ధావన్ గట్టి స్టాండ్
పాకిస్థాన్ ఆటగాళ్లతో కలిసి ధావన్ బరిలోకి దిగనున్నారనే వార్త క్రికెట్ అభిమానులను తీవ్ర విస్మయానికి గురిచేసింది. గతంలో ఉగ్రవాద దాడుల సమయంలో, ఆపరేషన్ సింధూర్ వేళ పాకిస్థాన్‌పై ధావన్ అత్యంత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దేశమే ముందుంటుందని, ఉగ్రవాదాన్ని ఎప్పుడూ సహించేది లేదని ఆయన బహిరంగంగానే తన దేశభక్తిని చాటుకున్నారు. అలాంటి వ్యక్తి పాక్ ఆటగాళ్లతో కలిసి మ్యాచ్ ఆడతారనే తప్పుడు ప్రచారం రావడంతో ఆయన వెంటనే రంగంలోకి దిగి లీగల్ యాక్షన్ తీసుకుంటామని ప్రకటించారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..