Sarfaraz Khan : నా కొడుకును వాడుకోవడం మీకు చేతకాదు.. టీమిండియా మీద దుమ్మెత్తిపోసిన సర్ఫరాజ్ తండ్రి

Sarfaraz Khan : టీమిండియాలో చోటు దక్కకపోవడంపై సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషాద్ ఖాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిభ ఉన్నా అవకాశాలు ఇవ్వడం లేదని పరోక్షంగా జట్టు మేనేజ్‌మెంట్‌పై విమర్శలు గుప్పించారు. డ్రెస్సింగ్ రూమ్ వివాదాలపై కూడా మరోసారి చర్చ మొదలైంది.

Sarfaraz Khan : నా కొడుకును వాడుకోవడం మీకు చేతకాదు.. టీమిండియా మీద దుమ్మెత్తిపోసిన సర్ఫరాజ్ తండ్రి
Sarfaraz Khan

Updated on: Jul 11, 2026 | 4:20 PM

Sarfaraz Khan : భారత క్రికెట్ జట్టులో అంతర్గత విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతూ తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. దేశవాళీ క్రికెట్‌లో డాన్ బ్రాడ్‌మాన్ తరహా సగటుతో పరుగుల వరద పారించి టీమిండియా టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్.. ప్రస్తుతం జట్టులో చోటు దక్కక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ సిరీస్‌లలో హాఫ్ సెంచరీలు, ఒక భారీ 150 పరుగుల ఇన్నింగ్స్‌తో అదరగొట్టినప్పటికీ.. ఆ తర్వాత జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఐదు టెస్టుల పాటు అతనికి కనీసం ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా ఇవ్వకుండా బెంచ్‌కే పరిమితం చేశారు. తన పెద్ద కుమారుడికి జరిగిన ఈ అన్యాయంపై సర్ఫరాజ్ తండ్రి, కోచ్ అయిన నౌషాద్ ఖాన్ తాజాగా స్పందించారు. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, జట్టు మేనేజ్‌మెంట్‌ను ఉద్దేశించి ఆయన పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

టీమిండియా మేనేజ్‌మెంట్ దే తప్పు

ప్రముఖ జర్నలిస్ట్ రోహిత్ జుగ్లాన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నౌషాద్ ఖాన్ తమకు జరుగుతున్న అన్యాయాన్ని కారు టైర్ల ఉదాహరణతో వివరించారు. “మా దగ్గర ఉన్నది అత్యంత నాణ్యమైన టైర్. అది చలికాలంలో, ఎండాకాలంలో, మంచి రోడ్లపై, అధ్వాన్నమైన రోడ్లపై.. ఇలా ఎలాంటి పరిస్థితుల్లోనైనా అద్భుతంగా పనిచేస్తుంది. అయితే ఆ టైరును కారుకు ముందు వరుసలో వేసుకోవాలా, వెనుక వరుసలో వేసుకోవాలా లేక కేవలం స్టెప్నీ లాగా వాడుకోవాలా అనేది పూర్తిగా ఆ కారు యజమాని ఇష్టానికే వదిలేస్తున్నాం” అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడ కారు యజమాని అంటే టీమ్ మేనేజ్‌మెంట్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. సర్ఫరాజ్ లాంటి ప్రతిభావంతుడైన ఆటగాడిని కేవలం అదనపు ప్లేయర్‌గా బెంచ్‌కే పరిమితం చేయడంపై ఆయన ఈ రేంజ్‌లో కౌంటర్ ఇచ్చారు.

డ్రెస్సింగ్ రూమ్ సీక్రెట్స్ లీక్ చేశాడా?

సర్ఫరాజ్ ఖాన్‌ను జట్టుకు దూరం చేయడం వెనుక కేవలం ఆట మాత్రమే కారణం కాదని, డ్రెస్సింగ్ రూమ్ వివాదాలు కూడా ఉన్నాయనే వార్తలు గుప్పుమంటున్నాయి. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు ఘోరంగా పరాజయం పాలైన తర్వాత.. డ్రెస్సింగ్ రూమ్‌లో జరిగే అంతర్గత విషయాలను మీడియాకు లీక్ చేస్తున్నారంటూ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఒక ఆటగాడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ ఆటగాడు సర్ఫరాజ్ ఖానే అని గట్టిగా ప్రచారం జరిగింది. దానికి తోడు, భారత జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఓ సీనియర్ ఆటగాడు తాత్కాలిక కెప్టెన్ అవ్వడానికి పావులు కదిపాడని, అలాగే బాక్సింగ్ డే టెస్ట్‌లో గంభీర్ వ్యూహాలను ఆటగాళ్లు సరిగ్గా అమలు చేయలేకపోయారని లీకులు వచ్చాయి. ఆ తర్వాత గంభీర్ ఈ లీకుల వార్తలను అధికారికంగా ఖండించినప్పటికీ, అప్పటి నుండి సర్ఫరాజ్ ఖాన్‌కు మళ్లీ టీమిండియాలో చోటు దక్కలేదు.

ఫిట్‌నెస్‌పై ఫోకస్.. ఐపీఎల్‌లో చెన్నై తరఫున మెరుపులు

జట్టు నుండి తొలగించబడిన తర్వాత సర్ఫరాజ్ ఖాన్ కుంగిపోకుండా తన ఫిట్‌నెస్, ఫీల్డింగ్‌పై తీవ్రంగా శ్రమించాడు. ముంబై జట్టుతో పాటు ఇండియా-ఏ తరఫున దేశవాళీల్లో పరుగుల వేటను కొనసాగించాడు. దీని ఫలితంగానే ఐపీఎల్ 2026 సీజన్‌లో అతనిని చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు కొనుగోలు చేసింది. సిఎస్‌కే తరఫున సీజన్ ప్రారంభంలో ఆర్‌సీబీపై మెరుపు హాఫ్ సెంచరీతో పాటు కొన్ని కీలక ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ, సీజన్ ద్వితీయార్థంలో వచ్చిన అవకాశాలను వృధా చేసుకోవడంతో చివరికి జట్టులో స్థానం కోల్పోయాడు. ప్రస్తుతం భారత జట్టులో మార్పులు జరుగుతున్న తరుణంలో సర్ఫరాజ్ ఖాన్‌కు టెస్ట్ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ, విదేశీ పిచ్‌లపై షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోవడంలో అతనికున్న సాంకేతిక లోపాలు అతనికి ప్రతిబంధకంగా మారాయి. మరోవైపు అతని తమ్ముడు ముషీర్ ఖాన్ పంజాబ్ కింగ్స్ (PBKS)కు, నౌషాద్ శిష్యుడైన సూర్యాంశ్ శెడ్గే ఇటీవల భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం గమనార్హం.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us