Pak Vs SL: ధోనీ, యువరాజ్ స్పెషల్ క్లబ్‌లోకి పాక్ స్టార్.. యూసుఫ్ రికార్డు బ్రేక్

Pak Vs SL: శ్రీలంకతో వన్డే ట్రై సిరీస్ తొలి మ్యాచ్‌లో సల్మాన్ అలీ ఆఘా 90 బంతుల్లో 107 పరుగులతో చెలరేగాడు. పాకిస్థాన్ 37 పరుగులతో విజయం సాధించింది. ఈ సెంచరీతో మహమ్మద్ యూసుఫ్ రికార్డును బద్దలు కొట్టిన ఆఘా, ఎంఎస్ ధోనీ, యువరాజ్ సింగ్ ఉన్న అరుదైన జాబితాలో చోటు సంపాదించాడు.

Pak Vs SL: ధోనీ, యువరాజ్ స్పెషల్ క్లబ్‌లోకి పాక్ స్టార్.. యూసుఫ్ రికార్డు బ్రేక్
Salman Ali Agha

Updated on: Oct 19, 2026 | 6:25 PM

Pak Vs SL: పాకిస్థాన్ బ్యాటర్ సల్మాన్ అలీ ఆఘా తన బ్యాట్‌తో అదరగొట్టాడు. శ్రీలంకతో జరిగిన వన్డే ట్రై సిరీస్ తొలి మ్యాచ్‌లో సెంచరీతో జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఈ ఇన్నింగ్స్‌తో భారత మాజీ క్రికెటర్లు ఎంఎస్ ధోనీ, యువరాజ్ సింగ్‎ల జాబితాలో చోటు సంపాదించాడు. అంతేకాదు వన్డేల్లో ఐదో స్థానం లేదా అంతకంటే స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక సెంచరీలు చేసిన పాకిస్థాన్ బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో మాజీ ఆటగాడు మహమ్మద్ యూసుఫ్ రికార్డును అధిగమించాడు.

90 బంతుల్లో 107 పరుగులు

రావల్పిండిలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 49.5 ఓవర్లలో 305 పరుగులకు ఆలౌటైంది. ఆరంభంలో ఫఖర్ జమాన్ 16, సైమ్ అయూబ్ 7 పరుగులకే వెనుదిరగడంతో జట్టు ఒత్తిడిలో పడింది. బాబర్ ఆజమ్ 57 బంతుల్లో 45 పరుగులు చేయగా, సాద్ బేగ్ 39 పరుగులతో సహకరించాడు. ఈ దశలో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సల్మాన్ ఆఘా అద్భుతంగా ఆడాడు. 90 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 107 పరుగులు చేశాడు. హసన్ నవాజ్‌తో కలిసి ఐదో వికెట్‌కు 97 పరుగులు, అరాఫత్ మిన్హాస్‌తో కలిసి ఆరో వికెట్‌కు 64 పరుగులు జోడించాడు. దీంతో పాకిస్థాన్ పోరాడగలిగే స్కోరు సాధించింది.

ధోనీ, యువరాజ్‌ల సరసన

ఈ సెంచరీ సల్మాన్ ఆఘాకు వన్డేల్లో నాలుగోది. ఐదో స్థానం లేదా అంతకంటే దిగువన బ్యాటింగ్‌కు వచ్చి నాలుగు సెంచరీలు చేసిన పాకిస్థాన్ ఆటగాడిగా ఆయన రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు మహమ్మద్ యూసుఫ్ ఈ స్థానాల్లో బ్యాటింగ్ చేస్తూ మూడు సెంచరీలు సాధించాడు. ఇప్పుడు ఆఘా అతడిని అధిగమించాడు. అంతర్జాతీయ వన్డేల్లో ఐదో స్థానం లేదా అంతకంటే దిగువన బ్యాటింగ్ చేస్తూ నాలుగు లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలోనూ ఆఘాకు చోటు దక్కింది. ఈ జాబితాలో ఎంఎస్ ధోనీ, యువరాజ్ సింగ్ ఏడేసి సెంచరీలతో ఉన్నారు. జోస్ బట్లర్, డేవిడ్ మిల్లర్ ఎనిమిదేసి సెంచరీలతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.

శ్రీలంక పోరాటం వృథా

306 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 48.1 ఓవర్లలో 268 పరుగులకు ఆలౌటైంది. పవన్ రత్నాయకే 79, జనిత్ లియానగే 60, కమిందు మెండిస్ 44 పరుగులతో పోరాడారు. ఐదో వికెట్‌కు రత్నాయకే, లియానగే కలిసి 119 పరుగులు జోడించి శ్రీలంకకు ఆశలు కల్పించారు. అయితే కీలక సమయంలో పాక్ బౌలర్లు వరుస వికెట్లు తీసి మ్యాచ్‌ను తమవైపు తిప్పుకున్నారు. కెప్టెన్ షాహీన్ షా అఫ్రిది మూడు వికెట్లు పడగొట్టగా, నసీమ్ షా, హారిస్ రౌఫ్, ఫహీమ్ అష్రఫ్ రెండేసి వికెట్లు తీశారు. దీంతో పాకిస్థాన్ 37 పరుగుల తేడాతో గెలిచి ట్రై సిరీస్‌ను విజయంతో ప్రారంభించింది.

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా సల్మాన్ ఆఘా

సెంచరీతో పాకిస్థాన్‌ను ఆదుకోవడమే కాకుండా జట్టుకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించిన సల్మాన్ ఆఘాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. 54 వన్డేల్లో నాలుగు సెంచరీలు సాధించిన ఆయన, ఈ మ్యాచ్‌తో తన సత్తా మరోసారి చాటాడు. మరోవైపు శ్రీలంక తరఫున ఇషాన్ మలింగ నాలుగు వికెట్లు తీసి పాక్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. అసిత ఫెర్నాండో మూడు వికెట్లు పడగొట్టగా, దిల్షాన్ మధుశంక రెండు వికెట్లు తీశాడు. అయినప్పటికీ ఆఘా ఆడిన కీలక ఇన్నింగ్స్ మ్యాచ్ ఫలితాన్ని పాకిస్థాన్‌కు అనుకూలంగా మార్చింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us