
Ruturaj Gaikwad : విజయ్ హజారే ట్రోఫీలో మహారాష్ట్ర కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తన ఫామ్‌ను కొనసాగిస్తూ మరో అద్భుతమైన సెంచరీతో చెలరేగిపోయాడు. ఉత్తరాఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో విపత్కర పరిస్థితుల్లో బ్యాటింగ్‌కు వచ్చిన రుతురాజ్, బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. కేవలం మ్యాచ్ గెలవడమే కాదు, ఈ సెంచరీతో టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ స్థానానికి గట్టి పోటీని ఇస్తూ సెలెక్టర్లకు స్పష్టమైన సంకేతాలు పంపాడు.
జైపూర్‌లో జరిగిన ఈ పోరులో మహారాష్ట్ర జట్టుకు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. కేవలం 50 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. 113 బంతుల్లో 124 పరుగులు చేసి జట్టు స్కోరును 331 పరుగులకు చేర్చాడు. అతని ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. గైక్వాడ్ తో పాటు సత్యజీత్ బచ్చవ్ (56), రామకృష్ణ ఘోష్ (47) కూడా రాణించడంతో మహారాష్ట్ర భారీ స్కోరు సాధించింది.
332 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఉత్తరాఖండ్ ఏ దశలోనూ మహారాష్ట్ర బౌలర్లకు పోటీ ఇవ్వలేకపోయింది. సౌరభ్ రావత్ (56) మినహా మిగిలిన బ్యాటర్లంతా విఫలమవడంతో ఆ జట్టు 202 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఫలితంగా మహారాష్ట్ర 129 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. బౌలింగ్‌లో రాజ్‌వర్ధన్ హంగర్గేకర్, సత్యజీత్ బచ్చవ్ తలో మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
ఈ సెంచరీ ఇప్పుడు టీమిండియాలో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా రుతురాజ్ ఓపెనర్ అయినప్పటికీ, ఈ మ్యాచ్‌లో నాలుగో స్థానంలో వచ్చి సెంచరీ బాదాడు. భారత వన్డే జట్టులో నంబర్-4 స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఆడుతుంటాడు. ప్రస్తుతం అయ్యర్ గాయంతో జట్టుకు దూరంగా ఉండటంతో, అతని స్థానంలో గైక్వాడ్ పాగా వేసేలా కనిపిస్తున్నాడు. ఇటీవలే సౌతాఫ్రికాపై తన తొలి అంతర్జాతీయ వన్డే సెంచరీని నమోదు చేసిన రుతురాజ్, ఇప్పుడు న్యూజిలాండ్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు ముందు మళ్ళీ సెంచరీతో మెరవడం విశేషం. గైక్వాడ్ ఇలాగే రాణిస్తే అయ్యర్ తిరిగి జట్టులోకి రావడం కష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..