
Ruturaj Gaikwad 7 Sixes: సాధారణంగా క్రికెట్లో ఒక ఓవర్‌కు ఆరు బంతులు ఉంటాయి. ఎంతటి విధ్వంసకర బ్యాటర్ అయినా ఒకే ఓవర్లో గరిష్టంగా ఆరు సిక్సర్లు మాత్రమే కొట్టగలడు. అయితే ఒకే ఓవర్లో ఏకంగా ఏడు సిక్సర్లు బాది ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యంకాని అరుదైన రికార్డును నెలకొల్పాడు టీమిండియా స్టార్ బ్యాటర్. ఆ వివరాలు ఏంటో ఓసారి చూద్దాం.. ప్రపంచ క్రికెట్లో రోజూ ఎన్నో అద్భుతాలు, రికార్డులు నమోదవుతుంటాయి. కొన్ని రికార్డులను సమయం దాటే కొద్దీ ఎవరో ఒకరు బద్దలు కొడుతూనే ఉంటారు. అయితే భారత డాషింగ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ సాధించిన ఒకే ఓవర్లో ఏడు సిక్సర్ల రికార్డు మాత్రం చెక్కుచెదరకుండా నిలిచిపోయింది. 2022 నవంబర్ 28న జరిగిన విజయ్ హజారే ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఈ సంచలనం నమోదైంది.
మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ జట్ల మధ్య జరిగిన ఆ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ మహారాష్ట్ర తరఫున నాయకుడిగా బరిలోకి దిగాడు. ప్రత్యర్థి బౌలర్లను విచక్షణారహితంగా ఎదుర్కొంటూ మైదానం నలుమూలలా బౌండరీల వర్షం కురిపించాడు. ముఖ్యంగా ఒకే ఓవర్లో అతను సృష్టించిన విధ్వంసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను వేళ్లమీద నీళ్లు నమిలేలా చేసింది.
ఉత్తరప్రదేశ్ ఎడమచేతి వాటం స్పిన్నర్ శివ సింగ్ వేసిన ఇన్నింగ్స్ 49వ ఓవర్లో రుతురాజ్ విశ్వరూపం చూపించాడు. శివ సింగ్ ఆ ఓవర్లో వేసిన మొదటి ఐదు బంతులను మైదానం బయటకు పంపిన గైక్వాడ్, ఐదో బంతి నో బాల్ కావడంతో లభించిన ఫ్రీ హిట్‌ను కూడా సిక్సర్‌గా మలిచాడు. ఆ తర్వాత వేసిన ఆఖరి బంతిని కూడా బౌండరీ లైన్ దాటించి మొత్తం 7 బంతుల్లో వరుసగా 7 సిక్సర్లు బాదాడు.
క్రికెట్ చరిత్రలో ఒకే ఓవర్లో 43 పరుగులు రాబట్టిన ఏకైక బ్యాటర్‌గా రుతురాజ్ చరిత్ర పుటల్లోకెక్కిడు. బౌలర్ వేసిన నో బాల్‌ను పూర్తిస్థాయిలో అనుకూలంగా మార్చుకుని మైదానంలో పరుగుల సునామీ సృష్టించాడు. ఈ అద్భుతమైన ఫీట్ ప్రపంచ క్రికెట్‌ను ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఎక్కువమంది చదివింది: వరల్డ్ కప్ 2027 రేసు నుంచి ఆ 2 దిగ్గజ టీంలు ఔట్.. టీమిండియా పరిస్థితి ఏంటంటే?
ఆ మ్యాచ్‌లో రుతురాజ్ కేవలం 159 బంతుల్లోనే 10 ఫోర్లు, 16 సిక్సర్లతో 220 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. విజయ్ హజారే ట్రోఫీలో ద్విశతకం సాధించిన కొద్దిమంది బ్యాటర్లలో ఒకడిగా నిలిచాడు. దేశవాళీ క్రికెట్ నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన రుతురాజ్, భారత జట్టు తరఫున వన్డేలు, టీ20లలో తన సత్తా చాటాడు.
ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ సుమారు 2500కి పైగా పరుగులు సాధించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎంతమంది దిగ్గజ బ్యాటర్లు వచ్చినా ఒకే ఓవర్లో వరుసగా 7 సిక్సర్లు కొట్టడం సాంకేతికంగా దాదాపు అసాధ్యం కాబట్టి, గైక్వాడ్ పేరిట ఉన్న ఈ రికార్డు ఎప్పటికీ చెక్కుచెదరకుండా ఉండే అవకాశం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..