
WPL 2026 : మహిళా ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన విజయ పరంపరను కొనసాగిస్తోంది. శనివారం జరిగిన తొమ్మిదో మ్యాచ్‌లో స్మృతి మంధాన సేన గుజరాత్ జెయింట్స్‌ను 32 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఈ విజయంతో ఆర్‌సీబీ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేయడమే కాకుండా, పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకుంది. భారత యువ స్పిన్ సంచలనం శ్రేయాంక పాటిల్ ఐదు వికెట్లతో చెలరేగి గుజరాత్ నడ్డి విరిచింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీకి ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. స్టార్ ప్లేయర్లు గ్రేస్ హారిస్ (17), కెప్టెన్ స్మృతి మంధాన (5) స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరారు. కేవలం 43 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో పడింది. ఆ సమయంలో రాధా యాదవ్, రిచా ఘోష్ అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నారు. రాధా యాదవ్ 47 బంతుల్లో 3 సిక్సర్లు, 6 ఫోర్లతో 66 పరుగులు చేసి మెరుపు హాఫ్ సెంచరీ సాధించింది. ఆమెకు రిచా ఘోష్ (28 బంతుల్లో 44) చక్కని సహకారం అందించడంతో ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోరు సాధించింది.
183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జెయింట్స్ జట్టుకు ఆర్‌సీబీ బౌలర్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా శ్రేయాంక పాటిల్ తన స్పిన్ మాయాజాలంతో గుజరాత్ బ్యాటర్లను వణికించింది. బెత్ మూనీ (27), కనికా అహుజా, కాశ్వి గౌతమ్, తనూజా కన్వర్, రేణుకా సింగ్‌లను అవుట్ చేసి ఈ సీజన్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన (5/23) నమోదు చేసింది. లారెన్ బెల్ కూడా మూడు వికెట్లతో రాణించడంతో గుజరాత్ జట్టు 150 పరుగులకే కుప్పకూలింది. గుజరాత్ బ్యాటర్లలో భారతి ఫుల్మాలి (39) మాత్రమే కాసేపు పోరాడింది.
ఈ విజయంతో ఆర్‌సీబీ టోర్నమెంట్‌లో వరుసగా మూడో విజయాన్ని అందుకుంది. అంతకుముందు ముంబై ఇండియన్స్, యూపీ వారియర్స్‌పై ఘనవిజయాలు సాధించిన బెంగళూరు, ఇప్పుడు గుజరాత్‌ను కూడా ఓడించి హ్యాట్రిక్ కొట్టింది. ప్రస్తుతం ఆరు పాయింట్లతో టేబుల్ టాపర్‌గా నిలిచిన ఆర్‌సీబీ, ప్లేఆఫ్స్ దిశగా దూసుకుపోతోంది. ముఖ్యంగా యువ బౌలర్ శ్రేయాంక పాటిల్ ఫామ్‌లోకి రావడం జట్టుకు పెద్ద సానుకూలాంశం.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..