Rohit Sharma : విమర్శకుల నోళ్లు బ్యాట్‎తోనే మూయించిన హిట్‎మ్యాన్.. రోహిత్ సెంచరీపై రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు

Rohit Sharma : లార్డ్స్‌లో చారిత్రాత్మక సెంచరీతో రోహిత్ శర్మ విమర్శకులకు గట్టి సమాధానం ఇచ్చాడని రవిశాస్త్రి ప్రశంసించాడు. రిటైర్మెంట్ పుకార్లకు చెక్ పెట్టిన హిట్‌మ్యాన్, 2027 వన్డే ప్రపంచకప్‌ పైనే దృష్టి పెట్టాడని అశ్విన్ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Rohit Sharma : విమర్శకుల నోళ్లు బ్యాట్‎తోనే మూయించిన హిట్‎మ్యాన్.. రోహిత్ సెంచరీపై రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు
Rohit Sharma

Updated on: Jul 22, 2026 | 9:33 AM

Rohit Sharma : భారత క్రికెట్ జట్టు దిగ్గజ ఓపెనర్, హిట్‌మాన్ రోహిత్ శర్మ ఇంగ్లాండ్‌తో లార్డ్స్ మైదానంలో జరిగిన మూడో వన్డేలో 138 పరుగుల సాధించి సంచలన సెంచరీతో చెలరేగాడు. ఈ సిరీస్‌కి ముందు రోహిత్ రిటైర్మెంట్ గురించి అతడి ఫామ్ గురించి సోషల్ మీడియాలో, క్రికెట్ వర్గాల్లో రకరకాల ప్రచారాలు జరిగాయి. అయితే చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో సెంచరీ సాధించి, విమర్శకుల నోళ్లు మూయించడమే కాకుండా తన రిటైర్మెంట్ ఊహాగానాలకు రోహిత్ చెక్ పెట్టాడు.

లండన్‌లో ప్రత్యక్షమైన హిట్‌మాన్

వన్డే సిరీస్ ముగిసిన అనంతరం లండన్‌లోని కియా ఓవల్ మైదానంలో ప్రారంభమైన ద హండ్రెడ్ 2026 ఓపెనింగ్ మ్యాచ్ తిలకించేందుకు రోహిత్ శర్మ విజిటర్‌గా స్టేడియంకు వచ్చాడు. కాగా ఈ మ్యాచ్‌లో వ్యాఖ్యాతగా ఉన్న భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి మైదానంలో రోహిత్‌ను చూసి తన స్టైల్‌లో స్పందించాడు. “విమర్శకుల నోళ్లు మూయించి రోహిత్ శర్మ ఇప్పుడు చాలా రిలాక్స్‌గా కనిపిస్తున్నాడు. ఆఖరి వన్డేకి ముందు రకరకాల వ్యాఖ్యలు వచ్చాయి. కానీ రోహిత్ బ్యాట్‌తోనే వాటన్నింటికీ గట్టి చెంపదెబ్బ లాంటి సమాధానమిచ్చాడు. లార్డ్స్‌లో అతడికి ఇది తొలి వన్డే సెంచరీ. ముంబై ఇండియన్స్‌కు ఐదు ట్రోఫీలు అందించిన హిట్‌మాన్ ప్రయాణం అద్భుతం” అంటూ రవిశాస్త్రి ప్రశంసల జల్లు కురిపించాడు.

రోహిత్, కోహ్లీల జోలికి వెళ్లలేరు: అశ్విన్

మరోవైపు భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల భవిష్యత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. “సెలెక్టర్లు గానీ, టీమ్ మేనేజ్‌మెంట్ గానీ రోహిత్, విరాట్‌ల జోలికి వెళ్లలేరు. దాదాపు 12 వేల వన్డే పరుగులు సాధించిన రోహిత్‌ను ఎవరూ ఏమీ చేయలేరు. ఒకవేళ వారిని జట్టు నుంచి తప్పించాలని చూస్తే అభిమానుల నుంచి విపరీతమైన వ్యతిరేకత వస్తుంది. రోహిత్ ఎవరికీ ఏమీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అతడి ఏకైక లక్ష్యం రాబోయే వన్డే వరల్డ్ కప్ ఆడటమే. ఆ అంతర్గత కసి తోనే అతడు ఇలా చెలరేగి ఆడుతున్నాడు” అని అశ్విన్ స్పష్టం చేశాడు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us