Pakistan Cricket Board: గత వారం పాకిస్తాన్ క్రికెట్‌కు అంత అనుకూలంగా లేదు. న్యూజిలాండ్ జట్టు పాకిస్తాన్‌లో ఉంది. తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైన తరుణంలో సెక్యూరిటీ కారణంతో సిరీస్‌ను రద్దు చేసుకుంది. అనంతరం ఇంగ్లండ్ బోర్డు కూడా ఇవే కారణాలతో పాకిస్తాన్ పర్యటనను రద్దు చేసుకుంది. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు చాలా నష్టం వాటిల్లింది. ఇంగ్లీష్ జట్టు నిర్ణయం తరువాత క్రికెట్ అభిమానులు, సోషల్ మీడియాలో నిపుణులు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్‌ని తీవ్రంగా కామెంట్ చేశారు. వీరిలో భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కూడా ఉన్నాడు. జాఫర్ ట్వీట్‌లో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు మద్దతు ప్రకటించాడు.
ఇంగ్లీష్ బోర్డ్ నిర్ణయంతో నిరాశ చెందిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు అన్ని హక్కులు ఉంటాయంటూ జాఫర్ ట్వీట్‌లో పేర్కొన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో టీకా రాకముందే పాకిస్తాన్, వెస్టిండీస్ టీంలు ఇంగ్లండ్‌లో పర్యటించాయని ఈసీబీకి గుర్తు చేశాడు. దీంతో వసీం జాఫర్‌పై నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. పాకిస్తాన్‌కు ఎలా మద్దతు ప్రకటిస్తావంటూ దారుణంగా కామెంట్లు చేశారు.
పాకిస్తాన్ బోర్డుకు మద్దతు
‘ఇంగ్లీష్ క్రికెట్ బోర్డుపై కోపంగా ఉండటానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు సరైన కారణాలు ఉన్నాయి. పాకిస్తాన్, వెస్టిండీస్ బృందాలు కోవిడ్ కాలంలో ఇంగ్లండ్‌లో పర్యటించాయి. అప్పటికింకా కరోనా వ్యాక్సిన్ రాలేదు. పాకిస్తాన్, వెస్టిండీస్ టీంలకు ఇంగ్లండ్ చాలా రుణపడి ఉంటుంది. అలాంటి పరిస్థితులను ఆలోచించకుండా పర్యటనను రద్దు చేసుకోవడం దారుణం’ అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చాడు.
నెటిజన్ల వ్యాఖ్యలతో విసుగు చెందిన జాఫర్..
చాలా మంది సోషల్ మీడియా యూజర్లు.. జాఫర్ అభిప్రాయానికి మద్దతుగా నిలిచారు. అయితే మరికొంత మంది మాత్రం జాఫర్‌పై దారుణంగా కామెంట్లు చేశారు. అలాగే 26/11 దాడుల గురించి గుర్తు చేశారు. మీరు మొదట పాకిస్తాన్ లేదా ఆఫ్ఘనిస్తాన్ దేశం తరపున ఆడండి అంటూ కామెంట్లు చేశారు. ఈ వ్యాఖ్యలతో జాఫర్ నిరాశ చెందాడు. దీనికి కౌంటర్‌గా మాజీ భారత ఓపెనర్ కోల్‌కతాలో ఆడిన 2007 పాకిస్తాన్ టెస్ట్ మ్యాచ్ స్కోరుబోర్డును ట్విట్టర్‌లో పంచుకుని వారికి సరైన సమాధానమిచ్చాడు.
డబుల్ సెంచరీతో సమాధానం..
ఈ మ్యాచ్‌లో జాఫర్ అద్భుతమైన డబుల్ సెంచరీ సాధించాడు. డానిష్ కనేరియా నుంచి షోయబ్ అక్తర్ వరకు జాఫర్ ఆ రోజు ప్రతీ పాకిస్తాన్ బౌలర్‌ని కడిగిపారేశాడు. 274 బంతుల్లో 202 పరుగులు చేశాడు. జాఫర్ ఇన్నింగ్స్‌లో 34 ఫోర్లు ఉన్నాయి. ఇది జాఫర్ అత్యుత్తమ టెస్ట్ ఇన్నింగ్స్‌లో ఒకటిగా నిలిచింది.
https://t.co/sTN8DxY3zo pic.twitter.com/esEkPTYUru
— Wasim Jaffer (@WasimJaffer14) September 21, 2021
Also Read: Virat Kohli: విరాట్ కోహ్లీ 200వ మ్యాచ్ ఇచ్చిన రెండు దారుణ పరాజయాలు.. అవేంటంటే?
KKR vs RCB: ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి షాకిచ్చిన సీఏ, ఆర్కిటెక్ స్టూడెంట్లు.. వారెవరో తెలుసా?