NZ vs AFG, T20 WC: 610 రోజుల పగ తీర్చిన కివీస్.. వడ్డీతో సహా ఇచ్చిపడేశారుగా..
New Zealand vs Afghanistan: 2 ఏళ్ల ప్రతీకారాన్ని తీర్చుకున్న న్యూజిలాండ్ జట్టు.. 5 వికెట్ల తేడాతో ఆఫ్ఘాన్ జట్టును మట్టికరిపించింది. దీంతో 2026 టీ20 ప్రపంచకప్ ను విజయంతో ప్రారంభించింది. ఈ క్రమంలో సీఫెర్ట్, గ్లెన్ ఫిలిప్స్ ల కీలక ఇన్నింగ్స్ తో రాణించడంతో కివీస్ విజయం సులభమైంది.

New Zealand vs Afghanistan, 4th Match, Group D, ICC Men’s T20 World Cup 2026: ఎట్టకేలకు న్యూజిలాండ్ 2024 ప్రపంచ కప్‌లో తమ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. అఫ్గానిస్తాన్ రెండేళ్ల క్రితం 2024 టీ20 ప్రపంచ కప్ లో న్యూజిలాండ్ జట్టును 75 పరుగులకే కట్టడి చేసింది. దీంతో 84 పరుగుల తేడాతో కివీస్ పై ఘన విజయం సాధించింది. 2026 టీ20 ప్రపంచకప్ లో గ్రూప్ డీలో భాగంగా జరిగిన మ్యాచ్ లో టిమ్ సీఫెర్ట్, గ్లెన్ ఫిలిప్స్ ల అద్భుతమైన ఇన్నింగ్స్ తో ప్రతీకారం తీర్చుకుంది. 5 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్ జట్టును మట్టికరిపించి విజయంతో న్యూజిలాండ్ ఈ టోర్నీని మొదలుపెట్టింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘాన్ జట్టు 183 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం న్యూజిలాండ్ జట్టు 17.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టపోయి ఈ లక్ష్యాన్ని చేరుకుంది.
ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ 42 బంతుల్లో 65 పరుగులు చేశాడు. గ్లెన్ ఫిలిప్స్ 42 పరుగులు జోడించగా, మార్క్ చాప్మన్ 17 బంతుల్లో 28 పరుగులు చేశాడు. డారిల్ మిచెల్ 14 బంతుల్లో 25 పరుగులు, కెప్టెన్ మిచెల్ సాంట్నర్ 8 బంతుల్లో 17 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫిన్ అలెన్ ఒక పరుగుకు ఔటయ్యాడు. రాచిన్ రవీంద్ర గోల్డెన్ డక్‌గా ఔటయ్యాడు.
గుల్బాదిన్ నయీబ్ హాఫ్ సెంచరీ..
ఆఫ్ఘాన్ తరపున గుల్బాదిన్ నాయిబ్ హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో ఆఫ్ఘాన్ 6 వికెట్లకు 182 పరుగులు చేసింది. గుల్బాదిన్ (63 పరుగులు, 35 బంతులు), సెదికుల్లా అటల్ (29 పరుగులు, 24 బంతులు) మూడో వికెట్‌కు 51 బంతుల్లో 79 పరుగులు జోడించారు. కానీ, నెమ్మదిగా ఉన్న పిచ్‌పై పరుగులు సాధించడం కష్టంగా అనిపించింది. ఫెర్గూసన్ ఆరో ఓవర్ చివరి బంతికి గ్లెన్ ఫిలిప్స్‌కు క్యాచ్ ఇచ్చి ఓపెనర్ ఇబ్రహీం జాద్రాన్ (10)ను ఔట్ చేశాడు. గుల్బాదిన్ 29 బంతుల్లో తన అర్ధ సెంచరీని చేరుకున్నాడు. ఫాస్ట్ బౌలర్ జాకబ్ డఫీ బౌలింగ్‌లో అతను రెండు సిక్సర్లు, ఒక ఫోర్ బాదాడు. గుల్బాదిన్, దర్వేష్ రసూలి (20 పరుగులు, 13 బంతులు) 17 బంతుల్లో 33 పరుగులు జోడించి ఆఫ్ఘనిస్తాన్ స్కోరును 150 దాటించారు. ఆ తర్వాత 18వ ఓవర్లో పార్ట్ టైమ్ స్పిన్నర్ రచిన్ రవీంద్ర బౌలింగ్‌లో గుల్బాదిన్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇది చివరి ఓవర్లలో ఆఫ్ఘనిస్తాన్ రన్ రేట్‌ను ప్రభావితం చేసింది. అజ్మతుల్లా ఉమర్జాయ్ (14) రెండు సిక్సర్లు కొట్టి జట్టు స్కోరును 180 దాటించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
