
Watch : ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్(DAIS)లో జరిగిన గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో ఒక అత్యంత సరదా సన్నివేశం చోటుచేసుకుంది. ఈ స్కూల్ వ్యవస్థాపకురాలు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ సమక్షంలోనే.. ఒక విద్యార్థి వారి సొంత ఐపీఎల్ ఫ్రాంచైజీ అయిన ముంబై ఇండియన్స్ (MI) జట్టుపై ఇండైరెక్ట్‌గా గట్టి సెటైర్ వేశాడు. స్కూల్ హెడ్ బాయ్ స్టేజ్ ఎక్కి తోటి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో ఈ ఆసక్తికర ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లోని అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ వేడుకలో సదరు విద్యార్థి స్కూల్లో తమ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ, ఇక్కడి స్నేహాలు, జ్ఞాపకాలు తమ జీవితాన్ని ఎలా మార్చాయో ఎమోషనల్‌గా మాట్లాడాడు. అయితే భవిష్యత్తు గురించి, జీవితంలో వచ్చే ఒడిదొడుకుల గురించి మాట్లాడే క్రమంలో అతను ముంబై ఇండియన్స్ టాపిక్ ఎత్తుకున్నాడు. “మనం భవిష్యత్తులో ముందుకు సాగేటప్పుడు.. మనకు బాగా నచ్చిన ముంబై ఇండియన్స్ లాగే జీవితంలోనూ కొన్ని కఠినమైన సీజన్లు ఎదురవుతాయి” అని అనడంతో ఆడిటోరియంలో ఉన్నవారంతా ఒక్కసారిగా పెద్ద పెట్టున నవ్వేశారు.
ఆ విద్యార్థి అయాచితంగా ముంబై ఇండియన్స్ జట్టు ప్రదర్శనను ప్రస్తావించడంతో కెమెరా వెంటనే నీతా అంబానీ వైపు తిరిగింది. ఈ ఊహించని కామెంట్‌కు ఆమె ఒక్కసారిగా షాక్ తిని, ఆ తర్వాత నవ్వు ఆపుకోలేక చేతులతో ముఖాన్ని దాచుకున్నారు. ముంబై ఇండియన్స్ టీమ్ ఓనర్ అయిన నీతా అంబానీ అలా నవ్వడంతో ఆడిటోరియంలో చప్పట్లు, కేరింతల మోత మోగింది. అంతటితో ఆగని ఆ విద్యార్థి.. “జీవితంలో కొన్ని సీజన్లు ఎలా ఉంటాయంటే.. మనం ఎంత ప్రయత్నించినా ఏ ఒక్కటి కూడా సరిగ్గా జరగదు. మన కష్టానికి తగ్గ ఫలితం రాదు. అసలు మనం ఏం చేస్తున్నామా అని మనల్ని మనమే ప్రశ్నించుకునేలా పరిస్థితులు మారుతాయి” అంటూ ముంబై ఇండియన్స్ ఓటములను ఫన్నీగా లైఫ్‌కు లింక్ చేశాడు.
అయితే ఈ జోక్ తర్వాత ఆ విద్యార్థి ముంబై ఇండియన్స్ జట్టు గొప్పతనాన్ని కూడా అంతే బాగా వివరించాడు. “కానీ ఈ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ మనందరికీ ఒక ముఖ్యమైన విషయాన్ని నేర్పించింది. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా సరే.. మనం ఎవరో, మన లెగసీ ఏంటో ఎప్పటికీ మర్చిపోకూడదు. మనకు అండగా నిలబడే మన వాళ్లను ఎప్పుడూ వదులుకోకూడదు” అని ముగించాడు. చివరగా ముంబై ఇండియన్స్ టీమ్ అఫీషియల్ స్లోగన్ అయిన “దునియా హిలా దేంగే హమ్” (ప్రపంచాన్ని ఊపేస్తాం) అంటూ తన స్పీచ్ ముగించడంతో నీతా అంబానీ ఎంతో ఆనందంగా నవ్వుతూ చప్పట్లు కొట్టి ఆ విద్యార్థిని అభినందించారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..