IND vs NZ: తొలి టీ20లో 225 పరుగులు చేసినా ఓటమి.. కివీస్ కెప్టెన్ శాంటర్న్ అసంతృప్తికి కారణాలివే

IND vs NZ: భారత్‌తో తొలి టీ20లో 225 పరుగులు చేసినా న్యూజిలాండ్ ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ పరాజయంపై కెప్టెన్ మిచెల్ సాంట్నర్ స్పందిస్తూ పవర్‌ప్లేలో భారీగా పరుగులు ఇవ్వడం, అదనపు పరుగులు, ఫీల్డింగ్ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోవడం గురించి మాట్లాడాడు.

IND vs NZ: తొలి టీ20లో 225 పరుగులు చేసినా ఓటమి.. కివీస్ కెప్టెన్ శాంటర్న్ అసంతృప్తికి కారణాలివే
Mitchell Santner

Updated on: Oct 23, 2026 | 9:31 AM

IND vs NZ: భారత్‌తో జరిగిన తొలి టీ20లో న్యూజిలాండ్‌కు ఊహించని పరాజయం ఎదురైంది. క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్ వేదికగా అక్టోబర్ 22న జరిగిన ఈ మ్యాచ్‌లో కివీస్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 4 వికెట్లకు 225 పరుగులు చేసింది. ఇంత భారీ స్కోరు చేసినా టీమిండియాను నిలువరించలేకపోయింది. భారత్ 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసి నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ తమ జట్టు ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.

భారత ఓపెనర్ల దూకుడుతో కివీస్‌పై ఒత్తిడి

226 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. తొలి ఆరు ఓవర్లలోనే 94 పరుగులు రావడంతో మ్యాచ్‌పై భారత జట్టు పట్టు సాధించింది. అభిషేక్ 12 బంతుల్లో 29 పరుగులు చేసి వేగంగా ఆడగా, సంజూ శాంసన్ 33 బంతుల్లో 67 పరుగులతో చెలరేగాడు. ఆ తర్వాత భారత జట్టు వరుసగా వికెట్లు కోల్పోవడంతో న్యూజిలాండ్‌కు మళ్లీ ఆశలు చిగురించాయి. అయినప్పటికీ శ్రేయస్ అయ్యర్, నామన్ ధీర్ కీలక సమయంలో రాణించడంతో భారత్ విజయాన్ని అందుకుంది.

తమ జట్టు ఎక్కడ తప్పు చేసిందంటే?

మ్యాచ్ తర్వాత మాట్లాడిన సాంట్నర్.. భారత బ్యాటర్లు తమపై ఒత్తిడి పెంచారని అంగీకరించాడు. ప్రత్యర్థి పవర్‌ప్లేలో దూకుడుగా ఆడుతుందని ముందే తెలుసని, అయినా భారీగా పరుగులు ఇచ్చామని చెప్పాడు. తమ జట్టు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వలేకపోయిందని, కొన్ని అంశాల్లో మెరుగుపడాల్సిన అవసరం ఉందని తెలిపాడు. మధ్య ఓవర్లలో భారత బ్యాటర్లను కట్టడి చేయగలిగామని, ఒక దశలో మ్యాచ్ ఇరు జట్లలో ఎవరి వైపైనా మొగ్గే అవకాశం ఉందని సాంట్నర్ అభిప్రాయపడ్డాడు.

అదనపు పరుగులు, ఫీల్డింగ్‌పైనా అసంతృప్తి

ఓటమికి గల కారణాల గురించి సాంట్నర్ మాట్లాడుతూ.. ప్రారంభంలో ఇచ్చిన అదనపు పరుగులు తమకు నష్టం కలిగించి ఉండొచ్చని పేర్కొన్నాడు. ఫీల్డింగ్ బాగానే చేసినా, మరికొన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాల్సిందని చెప్పాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో మెరుగ్గా బౌలింగ్ చేయాల్సిన అవసరం ఉందని వివరించాడు. క్యాచ్‌లు పట్టడం హాగ్లీ ఓవల్‌లో అంత సులభం కాదని చెప్పినప్పటికీ, వచ్చిన అవకాశాలను వదులుకోకుండా ఉండాల్సిందని అంగీకరించాడు.

100 పరుగుల పవర్‌ప్లేను 80కి తగ్గించాలి

భారత జట్టు పవర్‌ప్లేలోనే దాదాపు 100 పరుగులు సాధించడం న్యూజిలాండ్‌కు పెద్ద సమస్యగా మారింది. ఈ దూకుడును అడ్డుకునే మార్గాన్ని కనుగొనాలని సాంట్నర్ అన్నాడు. తొలి ఆరు ఓవర్లలో 100 పరుగులు ఇవ్వకుండా 80 పరుగులకే పరిమితం చేయగలిగితే పరిస్థితి మెరుగుపడుతుందని అభిప్రాయపడ్డాడు. ఈ విజయంతో భారత్ ఐదు టీ20ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో మ్యాచ్‌లోనైనా తమ తప్పులను సరిదిద్దుకుని తిరిగి పుంజుకోవాలని కివీస్ భావిస్తోంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us