MI vs PBKS IPL 2026: నేడే ముంబై ఇండియన్స్ vs పంజాబ్ కింగ్స్.. పిచ్ రిపోర్ట్, హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఇవే
MI vs PBKS IPL 2026: ఈ సీజన్‌లో ముంబై పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. ఆడిన 4 మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒక్క విజయం నమోదు చేసిన హార్దిక్ సేన.. నేడు ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు ఓటమే ఎరుగని ఏకైక జట్టుగా జైత్రయాత్రను కొనసాగిస్తోంది.

MI vs PBKS IPL 2026: ఐపీఎల్ 2026లో నేడు మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. క్రికెట్ కాశీగా పిలుచుకునే ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ (MI), పంజాబ్ కింగ్స్ (PBKS) జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్‌లో ముంబై పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. ఆడిన 4 మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒక్క విజయం నమోదు చేసిన హార్దిక్ సేన.. నేడు ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు ఓటమే ఎరుగని ఏకైక జట్టుగా జైత్రయాత్రను కొనసాగిస్తోంది. నేటి మ్యాచ్‌లో ముంబై జైత్రయాత్రకు బ్రేక్ వేస్తుందా? లేక పంజాబ్ తన పంజా విసురుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.
హిట్ మ్యాన్ రోహిత్ ఆడతాడా?
ముంబై ఇండియన్స్ అభిమానులను వేధిస్తున్న అతిపెద్ద ప్రశ్న.. రోహిత్ శర్మ ఫిట్‌నెస్. గత మ్యాచ్‌లో హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా రోహిత్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఒకవేళ రోహిత్ అందుబాటులో లేకపోతే క్వింటన్ డికాక్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. అయితే డికాక్ వస్తే విదేశీ ప్లేయర్ కోటాలో ట్రెంట్ బౌల్ట్ వంటి కీలక బౌలర్‌ను పక్కన పెట్టాల్సి వస్తుంది. ఇది ముంబై బౌలింగ్ విభాగానికి పెద్ద దెబ్బే. మరోవైపు ముంబై జట్టులోకి కొత్త కుర్రాడు క్రిష్ భగత్ ఎంట్రీ ఇచ్చాడు, ఇతడు అంకోలేకర్ స్థానంలో రీప్లేస్‌మెంట్‌గా వచ్చాడు.
వాంఖడే పిచ్ రిపోర్ట్
ముంబైలోని వాంఖడే స్టేడియం అంటేనే బ్యాటర్ల స్వర్గధామం. ఇక్కడ బౌండరీలు చిన్నవిగా ఉండటం వల్ల సిక్సర్ల వర్షం కురుస్తుంది. గత మ్యాచ్‌లో ఇక్కడ ఆర్‌సీబీ ఏకంగా 240 పరుగులు చేయగా, ముంబై కూడా 222 పరుగులు చేసి గట్టి పోటీ ఇచ్చింది. టాస్ గెలిచిన కెప్టెన్ కళ్లు మూసుకుని బౌలింగ్ ఎంచుకోవడం ఇక్కడ ఆనవాయితీ. ఎందుకంటే రెండో ఇన్నింగ్స్‌లో మంచు కురిసే అవకాశం ఉండటంతో చేజింగ్ చేయడం సులభం అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోరు 172 అయినప్పటికీ, గెలవాలంటే కనీసం 210 పైచిలుకు పరుగులు చేయాల్సిందే.
నేడు ముంబైలో వాతావరణం క్రికెట్‌కు అనుకూలంగా ఉంది. వర్షం పడే సూచనలు ఏమాత్రం లేవు. మ్యాచ్ సమయంలో ఉష్ణోగ్రత 29-30 డిగ్రీల సెల్సియస్‌గా ఉండే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుండగా, లైవ్ టెలికాస్ట్ స్టార్ స్పోర్ట్స్ ఛానళ్లలో చూడవచ్చు. మొబైల్‌లో చూడాలనుకునే వారు జియో హాట్‌స్టార్ యాప్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించవచ్చు.
హెడ్ టు హెడ్ రికార్డ్స్
ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య రికార్డులు చూస్తే పోరు ఎంత హోరాహోరీగా ఉంటుందో అర్థమవుతుంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు 34 సార్లు తలపడగా.. ముంబై 17 మ్యాచ్‌ల్లో, పంజాబ్ 17 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. అంటే ఇద్దరూ సమానంగా ఉన్నారు. పంజాబ్‌పై ముంబై చేసిన అత్యధిక స్కోరు 223 కాగా, ముంబైపై పంజాబ్ సాధించిన టాప్ స్కోరు 230 పరుగులు.
జట్ల ప్లేయింగ్ XI (అంచనా):
ముంబై ఇండియన్స్ (MI):
ర్యాన్ రికెల్టన్ (కీపర్), క్వింటన్ డికాక్/రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, షెఫ్రైన్ రూథర్‌ఫోర్డ్, మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మయాంక్ మార్కండే.
(ఇంపాక్ట్ ప్లేయర్: క్రిష్ భగత్)
పంజాబ్ కింగ్స్ (PBKS):
ప్రియాంశ్ ఆర్య, ప్రభసిమ్రాన్ సింగ్ (కీపర్), కూపర్ కానోలీ, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, వైశాఖ్ విజయ్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.
(ఇంపాక్ట్ ప్లేయర్: నేహాల్ వధేరా)
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
