సాధారణంగా టీ20 ఫార్మాట్ అంటే చాలు.. పరుగుల వరద పారుతుంది. బ్యాటర్లు ఆకాశమే హద్దుగా ఫోర్లు, సిక్సర్ల మోత మోగిస్తారు. ఈ ఫార్మాట్‌లో బౌలర్లు కేవలం ప్రేక్షక పాత్ర మాత్రమే పోషించేవారు. అయితే నిన్న జరిగిన ఓ టీ20 మ్యాచ్‌లో బ్యాటర్లకు పరుగులు చేయడం కష్టంగా మారింది. వెరిసి టీ20ల్లో చెత్త రికార్డు నమోదైంది. ఆ మ్యాచ్ భారత దేశవాళీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జరిగింది. ఈ టోర్నీలో మణిపూర్ పంజాబ్‌తో తలపడగా, తొలుత బ్యాటింగ్ చేసిన మణిపూర్ జట్టు కేవలం 40 పరుగులకే ఆలౌటైంది.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో నమోదైన రెండో అత్యల్ప స్కోర్ ఇది. అంతకముందు 20 అక్టోబర్ 2009న, త్రిపుర జట్టు కేవలం 30 పరుగులకే ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో మణిపూర్ స్కోర్‌కార్డ్ చూస్తే, అందులో ఒక్కరు మాత్రమే రెండంకెల స్కోర్ సాధించారు. రెక్స్ సింగ్ 23 బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్ల సాయంతో 25 పరుగులు చేశాడు. ఇక మిగిలిన బ్యాటర్లందరూ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అందులోనూ ఐదుగురు ఖాతా కూడా తెరవలేదు.
ఈ మ్యాచ్‌లో పంజాబ్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా మయాంక్ మార్కండే.. లెగ్ స్పిన్‌తో మాయాజాలం సృష్టించాడు. ఈ రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్ 3.1 ఓవర్లలో నాలుగు పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. అభిషేక్ శర్మ, సిద్ధార్థ్ కౌల్, బల్తేజ్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్ ఒక్కో వికెట్ తీశారు. రమణదీప్ సింగ్ రెండు వికెట్లు తీశాడు.
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం..