
Big Blow to CSK Franchise: Faf du Plessis Ruled Out of SA20 2026 Due to Injury: IPL లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరుగాంచిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మేనేజ్‌మెంట్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. సీఎస్కేకు అనుబంధ ఫ్రాంచైజీగా ఉన్న జోబర్గ్ సూపర్ కింగ్స్ (JSK) కెప్టెన్, స్టార్ బ్యాటర్ ఫాఫ్ డు ప్లెసిస్ దక్షిణాఫ్రికా టీ20 లీగ్ (SA20 2026) ప్రస్తుత సీజన్ నుంచి పూర్తిగా తప్పుకున్నారు. బొటనవేలికి తీవ్రమైన గాయం కావడంతో అతను టోర్నమెంట్ మధ్యలోనే నిష్క్రమించాల్సి వచ్చింది.
శనివారం ఎంఐ కేప్‌టౌన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఫాఫ్ డు ప్లెసిస్ కుడిచేతి బొటనవేలికి తీవ్ర గాయమైంది. బంతిని ఆపే ప్రయత్నంలో బొటనవేలు నేలకు బలంగా తగలడంతో లిగమెంట్ దెబ్బతిన్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. ఈ గాయానికి సర్జరీ అవసరమని వైద్యులు సూచించడంతో, అతను సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండడని ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది.
ఈ మ్యాచ్‌లో 235 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో డు ప్లెసిస్ ఓపెనింగ్‌కు రాలేదంటేనే గాయం తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. జేమ్స్ విన్స్, డయాన్ ఫారెస్టర్ మెరుపు అర్థసెంచరీలు చేసినప్పటికీ, కెప్టెన్ లేకపోవడంతో జేఎస్కే లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది.
జోబర్గ్ సూపర్ కింగ్స్ ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. “ఫాఫ్ బొటనవేలి గాయం అనుకున్నదానికంటే చాలా తీవ్రంగా ఉంది. అతను కనీసం బ్యాట్ కూడా పట్టుకోలేని స్థితిలో ఉన్నాడు. 200 పైచిలుకు పరుగుల ఛేదనలో మీ స్టార్ ప్లేయర్ అందుబాటులో లేకపోవడం జట్టు సమతుల్యతను దెబ్బతీస్తుంది” అని ఫ్లెమింగ్ పేర్కొన్నారు.
SA20 2026 పాయింట్ల పట్టికలో ప్రస్తుతం జోబర్గ్ సూపర్ కింగ్స్ 7 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో 17 పాయింట్లు సాధించి మూడో స్థానంలో ఉంది. అయితే, ఇప్పటికే స్టార్ ప్లేయర్ రిలీ రొసో హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో దూరం కాగా, ఇప్పుడు డు ప్లెసిస్ కూడా తప్పుకోవడం జట్టును ఇరకాటంలో పడేసింది. ఈ సీజన్‌లో డు ప్లెసిస్ 5 ఇన్నింగ్స్‌ల్లో 151.68 స్ట్రైక్ రేట్‌తో 135 పరుగులు చేసి మంచి ఫామ్‌లో ఉన్నాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..