Video: సెంచరీతో చెలరేగినా తప్పని ఓటమి.. కట్‌చేస్తే.. పాక్ బౌలర్‌పై బ్యాట్ ఎత్తిన రోహిత్ మాజీ టీంమేట్..!

Kieron Pollard Fight Asif Mehmood: ఈ మ్యాచ్ కేవలం పోలార్డ్ సెంచరీ కోసమే కాకుండా, మైదానంలో జరిగిన ఒక తీవ్రమైన ఘర్షణ కారణంగా క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. 2014 ఐపీఎల్ సీజన్‌లో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్‌పైకి పోలార్డ్ బ్యాట్ విసిరేంత పని చేసిన ఘటన క్రికెట్ ప్రేమికులు అంత సులువుగా మర్చిపోలేరు. సరిగ్గా అలాంటి సీన్ ఇక్కడ పునరావృతమైంది.

Video: సెంచరీతో చెలరేగినా తప్పని ఓటమి.. కట్‌చేస్తే.. పాక్ బౌలర్‌పై బ్యాట్ ఎత్తిన రోహిత్ మాజీ టీంమేట్..!
Kieron Pollard Fight Asif Mehmood Video

Updated on: Jun 21, 2026 | 5:42 PM

Kieron Pollard Fight Asif Mehmood: మేజర్ లీగ్ క్రికెట్ (MLC) 2026 సీజన్‌లో వెస్టిండీస్ దిగ్గజం కీరన్ పోలార్డ్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ముంబై ఇండియన్స్ సోదర ఫ్రాంచైజీ ‘ఎమ్ఐ న్యూయార్క్’ తరఫున ఆడుతూ 39 ఏళ్ల వయసులోనూ మైదానాన్ని ఊపేశాడు. అయితే, ఈ అద్భుత ఇన్నింగ్స్ సమయంలోనే పాత ఐపీఎల్ గొడవలను గుర్తుచేసేలా ఒక తీవ్రమైన వాగ్వాదం చోటుచేసుకుంది.

సింహం వయసు పెరిగినా వేట మారలేదు: పోలార్డ్ సంచలన శతకం..

ముంబై ఇండియన్స్ అభిమానులకు కీరన్ పోలార్డ్ అంటే ఒక భరోసా. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఒంటిచేత్తో గెలిపించే ‘క్లచ్ గాడ్’గా అతనికి పేరుంది. 2022 నవంబర్‌లో ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ, అతనిలో కసి అస్సలు తగ్గలేదని ఆదివారం నాటి మ్యాచ్ నిరూపించింది. వాషింగ్టన్ ఫ్రీడమ్‌తో జరిగిన మ్యాచ్‌లో పోలార్డ్ కేవలం 56 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయంగా 100 పరుగులు సాధించాడు. అతని సుదీర్ఘ టీ20 కెరీర్‌లో ఇది రెండో శతకం కావడం విశేషం. వయసు కేవలం అంకె మాత్రమేనని ఈ వెస్టిండీస్ పవర్‌హౌస్ మరోసారి చాటిచెప్పాడు.

మైదానంలో రచ్చ రచ్చ.. స్టాక్ వివాదాన్ని గుర్తుచేసిన పోలార్డ్..!

ఈ మ్యాచ్ కేవలం పోలార్డ్ సెంచరీ కోసమే కాకుండా, మైదానంలో జరిగిన ఒక తీవ్రమైన ఘర్షణ కారణంగా క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. 2014 ఐపీఎల్ సీజన్‌లో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్‌పైకి పోలార్డ్ బ్యాట్ విసిరేంత పని చేసిన ఘటన క్రికెట్ ప్రేమికులు అంత సులువుగా మర్చిపోలేరు. సరిగ్గా అలాంటి సీన్ ఇక్కడ పునరావృతమైంది.

పాకిస్తాన్ బౌలర్‌తో పొలార్డ్ గొడవకు సంబంధించిన వీడియో..

పోలార్డ్ 19 బంతుల్లో 21 పరుగులతో క్రీజులో ఉన్నప్పుడు, పాకిస్తాన్ సంతతికి చెందిన యూఎస్ఏ బౌలర్ ఆసిఫ్ మహమూద్ గంటకు 139.8 కిలోమీటర్ల వేగంతో ఒక బంతిని విసిరాడు. ఆ బంతిని డిఫెండ్ చేసిన పోలార్డ్ నేరుగా బౌలర్ వైపు ఆడాడు. బంతిని అందుకున్న ఆసిఫ్ మహమూద్.. పోలార్డ్ వైపు కోపంగా చూస్తూ, బంతితో కొడతాననే రీతిలో సైగ చేశాడు. దాంతో పోలార్డ్‌కు ఎక్కడో కాలింది. కోపాన్ని ఆపుకోలేక తన చేతిలోని బ్యాట్‌ను గాల్లోకి లేపి, బౌలర్ వైపు విసిరేంత పని చేశాడు. అదృష్టవశాత్తూ చివరి క్షణంలో పోలార్డ్ తనను తాను నియంత్రించుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

పోలార్డ్ వీరోచిత పోరాటం వృథా.. ఎమ్ఐ న్యూయార్క్‌కు పరాజయం..

కెప్టెన్ పోలార్డ్ శతక్కొట్టినా ఎమ్ఐ న్యూయార్క్ జట్టుకు విజయం దక్కలేదు. మొదట బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టు కొండంత స్కోరును బోర్డుపై ఉంచింది. ఆ జట్టు బ్యాటర్ మిచెల్ ఓవెన్ కేవలం 68 బంతుల్లోనే 155 పరుగులతో శివతాండవం చేయడంతో వాషింగ్టన్ 5 వికెట్ల నష్టానికి 245 పరుగుల భారీ స్కోరు సాధించింది.

భారీ లక్ష్య ఛేదనలో ఎమ్ఐ న్యూయార్క్ జట్టు 6 వికెట్లకు 215 పరుగులు మాత్రమే చేయగలిగింది. పోలార్డ్‌కు తోడుగా కార్బిన్ బాష్ (14 బంతుల్లో 35 నాటౌట్) మెరుపులు మెరిపించినా లాభం లేకపోయింది. మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేయడంతో ఎమ్ఐ న్యూయార్క్ ఈ సీజన్‌ను ఓటమితో ప్రారంభించి, పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పడిపోయింది.

గత 2025 సీజన్‌లో ఇదే వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టును ఫైనల్లో ఓడించి పోలార్డ్ నేతృత్వంలోని ఎమ్ఐ న్యూయార్క్ టైటిల్ గెలుచుకుంది. గత ఏడాది కూడా మొదటి ఏడు మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క విజయం సాధించి, ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుని ఛాంపియన్‌గా నిలిచింది. కాబట్టి ఈ ఓటమితో జట్టు ఆత్మవిశ్వాసం కోల్పోవాల్సిన అవసరం లేదు. ఎమ్ఐ న్యూయార్క్ తన తదుపరి మ్యాచ్‌లో టెక్సాస్ సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ డల్లాస్‌లోని గ్రాండ్ ప్రేరీ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. పోలార్డ్ తన ఫామ్‌ను ఇలాగే కొనసాగిస్తూ, జట్టును మళ్లీ విజయాల బాటలోకి తెస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us