తోటి ఆటగాడిని అవమానించిన కోహ్లీ ఫ్రెండ్.. కట్‌చేస్తే.. దిమ్మతిరిగే షాకిచ్చిన ‘కర్మ’
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన తాజా మ్యాచ్‌లో ఒక ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. సహచర ఆటగాడు జితేష్ శర్మ బ్యాటింగ్ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేసిన ఆర్సీబీ స్టార్ హిట్టర్ టిమ్ డేవిడ్‌కు ఊహించని షాక్ తగిలింది. ఎదుటివారిని అవమానిస్తే ఫలితం వెంటనే అనుభవించాల్సిందే అనడానికి ఈ ఘటనే ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది.

గత కొంతకాలంగా జితేష్ శర్మ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న విషయం తెలిసిందే. అయితే, శనివారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో ఒక అనూహ్య పరిణామం జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ వేసిన ఆ ఓవర్ మొదటి బంతిని టిమ్ డేవిడ్ డీప్ మిడ్ వికెట్ వైపు ఆడాడు. సులువుగా సింగిల్ తీసే అవకాశం ఉన్నప్పటికీ, డేవిడ్ పరుగు తీయడానికి నిరాకరించాడు. నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న జితేష్ శర్మకు స్ట్రైక్ ఇస్తే పరుగులు రావు అన్నట్లుగా డేవిడ్ ప్రవర్తించాడు. అక్షర్ బౌలింగ్‌లో తానే భారీ షాట్లు ఆడగలననే మితిమీరిన ఆత్మవిశ్వాసంతో, ప్రత్యర్థి బౌలర్‌ను, సహచర ఆటగాడిని ఒకేసారి తక్కువ అంచనా వేశాడు.
వెంటనే తిప్పికొట్టిన ‘కర్మ’..
కానీ, కాలం ఎవరినీ వదిలిపెట్టదు. మొదటి బంతికి సింగిల్ తీయడానికి నిరాకరించిన టిమ్ డేవిడ్, అక్షర్ వేసిన మరుసటి బంతికే భారీ షాట్‌కు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. బంతిని సరిగ్గా అంచనా వేయలేకపోయిన డేవిడ్, ఫీల్డర్ టి. నటరాజన్‌కు సులువైన క్యాచ్ ఇచ్చి నిరాశగా వెనుదిరిగాడు. కేవలం 17 బంతులు ఆడిన డేవిడ్ నాలుగు బౌండరీలు, ఒక సిక్సర్‌తో 26 పరుగులు మాత్రమే చేయగలిగాడు. మరోవైపు, తనకు తగిన గౌరవం దక్కలేదని నిరాశ చెందిన జితేష్ శర్మ కూడా ఈ మ్యాచ్‌లో దారుణంగా విఫలమయ్యాడు. తీవ్రంగా ఇబ్బంది పడిన జితేష్ కేవలం ఒక్క బౌండరీ సహాయంతో 20 బంతుల్లో 14 పరుగులు చేసి ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో అవుట్ అయ్యాడు.
గ్రీన్ జెర్సీలో తేలిపోయిన ఆర్సీబీ..
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన గ్రీన్ జెర్సీలో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ మ్యాచ్‌లో అంచనాలను అందుకోలేకపోయింది. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్లు కోల్పోయి కేవలం 175 పరుగులు మాత్రమే సాధించగలిగింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ 38 బంతుల్లోనే 63 పరుగులు చేసి అదిరిపోయే ఆరంభాన్ని అందించినప్పటికీ, మిగతా బ్యాటర్ల నుండి అతనికి తగిన సహకారం లభించలేదు. సాల్ట్ అవుట్ అయిన తర్వాత వరుసగా వికెట్లు పడటంతో ఆర్సీబీ కనీసం 180 పరుగుల మార్కును కూడా దాటలేకపోయింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
