Joe Root : క్రికెట్‌లో కేవలం ఇద్దరికే సాధ్యమైన అరుదైన ఘనత.. సచిన్ తర్వాత హిస్టరీ క్రియేట్ చేసిన రూట్

Joe Root : ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్‌మన్ జో రూట్ టెస్ట్ క్రికెట్‌లో 14,000 పరుగులు పూర్తి చేసి సచిన్ టెండూల్కర్ తర్వాతి స్థానంలో నిలిచాడు. ఈ రికార్డు బద్దలవ్వడానికి ఆయనకు ఇంకా 1,848 పరుగులు కావాలి. రాబోయే రెండు మూడేళ్లలోనే ఈ రికార్డు బద్దలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

Joe Root : క్రికెట్‌లో కేవలం ఇద్దరికే సాధ్యమైన అరుదైన ఘనత.. సచిన్ తర్వాత హిస్టరీ క్రియేట్ చేసిన రూట్
Joe Root

Updated on: Jun 21, 2026 | 12:48 PM

Joe Root : ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు రన్ మెషిన్ జో రూట్ టెస్ట్ క్రికెట్‌లో సరికొత్త శకాన్ని లిఖించాడు. జూన్ 20, శనివారం నాడు లండన్‌లోని ప్రసిద్ధ ద ఓవల్ మైదానంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఆయన ఒక అరుదైన మైలురాయిని అధిగమించాడు. మ్యాచ్ నాలుగో ఇన్నింగ్స్‌లో తన వ్యక్తిగత రెండో రన్ తీయగానే.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 14,000 పరుగులు పూర్తి చేసుకున్న ప్రపంచంలోనే రెండో బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్ తో రూట్ మరోసారి తనేంటో నిరూపించుకున్నాడు.

సచిన్ టెండూల్కర్ రికార్డుకు ఎంత దూరం

ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో అందరి మదిలో మెదులుతున్న ఏకైక ప్రశ్న.. సచిన్ టెండూల్కర్ 15,921 పరుగుల ఆల్ టైమ్ వరల్డ్ రికార్డును జో రూట్ బద్దలు కొట్టగలడా అని. ఈ మ్యాచ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రూట్ 75 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. దీనితో ఆయన మొత్తం టెస్ట్ పరుగులు 14,073కి చేరుకున్నాయి. సచిన్ రికార్డును బద్దలు కొట్టడానికి జో రూట్ కు ఇంకా కేవలం 1,848 పరుగులు మాత్రమే అవసరం. ప్రస్తుతం రూట్ ఉన్న సూపర్ ఫామ్ చూస్తుంటే రాబోయే రెండు మూడేళ్లలోనే ఈ రికార్డు బద్దలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

సెంచరీల రేసులో ఎక్కడ ఉన్నాడు?

పరుగుల పరంగానే కాకుండా సెంచరీల విషయంలో కూడా జో రూట్ సరికొత్త రికార్డుల వేటలో ఉన్నాడు. ఈ ఫార్మాట్‌లో సచిన్ టెండూల్కర్ 51 సెంచరీలతో మొదటి స్థానంలో ఉండగా.. జో రూట్ ప్రస్తుతం 41 సెంచరీలతో సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు. రూట్ ఈ మ్యాచ్ తో ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ (41 సెంచరీలు) రికార్డును సమం చేశాడు. ఆయన కంటే ముందు జాక్ కలిస్ (45 సెంచరీలు), సచిన్ ఉన్నారు. సచిన్ సెంచరీల రికార్డును అందుకోవడానికి రూట్ కు ఇంకా 10 శతకాలు కావాలి.

జో రూట్ అద్భుతమైన టెస్ట్ కెరీర్ గణాంకాలు

జో రూట్ గత 14 ఏళ్లుగా ఇంగ్లాండ్ జట్టుకు టెస్టుల్లో కొండంత అండగా నిలుస్తున్నాడు. ఆయన ఇప్పటివరకు 165 టెస్ట్ మ్యాచ్‌ల్లో 302 ఇన్నింగ్స్‌లు ఆడి, 26 సార్లు నాటౌట్‌గా నిలిచి మొత్తం 14,073 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో ఆయన అత్యధిక వ్యక్తిగత స్కోరు 262 పరుగులు. కాగా.. ఆయన టెస్ట్ యావరేజ్ 50.98 గా ఉంది. తన సుదీర్ఘ కెరీర్‌లో రూట్ 41 సెంచరీలు, 67 హాఫ్ సెంచరీలు బాదాడు. ఇందులో 1509 ఫోర్లు, 46 సిక్సర్లు ఉన్నాయి. అయితే ఆయన కెరీర్‌లో 15 సార్లు డకౌట్ అవ్వడం గమనార్హం.

రికార్డు బ్రేక్ చేయడానికి ఎంత సమయం పట్టవచ్చు?

క్రికెట్ విశ్లేషకుల అంచనా ప్రకారం.. జో రూట్ ప్రతి సంవత్సరం సగటున వెయ్యికి పైగా టెస్ట్ పరుగులు సాధిస్తున్నాడు. ఇదే రన్ రేట్ ను ఆయన రాబోయే రోజుల్లో కూడా కొనసాగిస్తే.. సచిన్ టెండూల్కర్ అత్యధిక పరుగుల రికార్డును దాటడానికి రూట్ కు కనీసం రెండు సంవత్సరాల సమయం పట్టవచ్చు. వయసు రీత్యా చూసుకున్నా కూడా రూట్ కు ఇంకా చాలా క్రికెట్ ఆడే అవకాశం ఉంది కాబట్టి.. భవిష్యత్తులో సచిన్ పేరిట ఉన్న ఎన్నో మహామహా రికార్డులు ఈ ఇంగ్లాండ్ బ్యాటర్ చేతిలో తుడిచిపెట్టుకుపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us