SRH vs RR : ముల్లన్‌పూర్‌లో సన్‌రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మహాసంగ్రామం.. ఈ పోరులో గెలిచేదెవరు?

SRH vs RR : లీగ్ స్టేజ్‌లో హైదరాబాద్, రాజస్థాన్ జట్లు నువ్వా-నేనా అన్నట్లు తలపడి ఇక్కడివరకు వచ్చాయి. ఈ సీజన్‌లో ఇప్పటికే జరిగిన లీగ్ మ్యాచ్‌ల్లోనూ ఆర్‌ఆర్‌పై ఎస్‌ఆర్‌హెచ్ ఘన విజయం సాధించి మానసిక ఆధిక్యంలో ఉండటంతో మ్యాచ్ మరింత ఆసక్తికరంగా మారింది.

SRH vs RR : ముల్లన్‌పూర్‌లో సన్‌రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మహాసంగ్రామం.. ఈ పోరులో  గెలిచేదెవరు?
Srh Vs Rr

Updated on: May 27, 2026 | 11:02 AM

SRH vs RR : ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ ఉత్కంఠ క్లైమాక్స్‌కు చేరుకుంది. మొహాలీలోని ముల్లన్‌పూర్ వేదికగా ఈరోజు మే 27న సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య హై-వోల్టేజ్ ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫైయర్ 2 కి అర్హత సాధించి గుజరాత్ టైటాన్స్‌తో తలపడుతుంది. ఓడిన జట్టు ప్రయాణం ఈ సీజన్‌కు ఇక్కడితో ముగుస్తుంది. లీగ్ స్టేజ్‌లో హైదరాబాద్, రాజస్థాన్ జట్లు నువ్వా-నేనా అన్నట్లు తలపడి ఇక్కడివరకు వచ్చాయి. ఈ సీజన్‌లో ఇప్పటికే జరిగిన లీగ్ మ్యాచ్‌ల్లోనూ ఆర్‌ఆర్‌పై ఎస్‌ఆర్‌హెచ్ ఘన విజయం సాధించి మానసిక ఆధిక్యంలో ఉండటంతో మ్యాచ్ మరింత ఆసక్తికరంగా మారింది.

ముల్లన్‌పూర్ పిచ్ ఈ సీజన్‌లో పరుగుల వరద పారించింది. పిచ్ బ్యాటింగ్‌కు పూర్తిగా అనుకూలించనుంది, అయితే ప్రారంభంలో పేసర్లకు కొద్దిగా స్వింగ్ లభిస్తుంది. రాత్రి వేళల్లో మంచు ప్రభావం తీవ్రంగా ఉండటం వల్ల టాస్ గెలిచిన జట్టు ఖచ్చితంగా మొదట ఫీల్డింగ్ ఎంచుకుంటుంది. ఇరు జట్లలోనూ భారీ హిట్టర్లు ఉండటంతో ఇక్కడ భారీ స్కోర్ నమోదయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మల పవర్ హిట్టింగ్ హైదరాబాద్ జట్టుకు ప్రధాన బలంగా మారింది. వారితో పాటు ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డి వంటి మ్యాచ్ విన్నర్లు ఉండటంతో ఆరెంజ్ ఆర్మీ బ్యాటింగ్ లైనప్ కాగితం మీద చాలా బలంగా కనిపిస్తోంది. బౌలింగ్‌లో కెప్టెన్ పాట్ కమిన్స్, ఈషన్ మలింగ పవర్‌ప్లేలో వికెట్లు తీయడానికి సిద్ధంగా ఉన్నారు.

రాజస్థాన్ రాయల్స్ జట్టు కేవలం 15 ఏళ్ల వయసున్న సంచలన కుర్రాడు వైభవ్ సూర్యవంశీపై భారీ ఆశలు పెట్టుకుంది. ఈ సీజన్‌లో అతను ఆడిన మెరుపు ఇన్నింగ్స్‌లు జట్టును ఎన్నో సార్లు ఆదుకున్నాయి. ఓపెనర్ యశస్వి జైస్వాల్, కెప్టెన్ రియాన్ పరాగ్‌లతో పాటు లోయర్ ఆర్డర్‌లో శిమ్రాన్ హెట్‌మైర్, రవీంద్ర జడేజాలు రాణిస్తే హైదరాబాద్ భారీ హిట్టర్లకు రాజస్థాన్ గట్టి పోటీ ఇవ్వడం ఖాయం. బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్ వంటి క్వాలిటీ బౌలర్లు ఉండటం రాజస్థాన్‌కు కలిసొచ్చే అంశం.

ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్ల మధ్య రికార్డులను పరిశీలిస్తే సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. మొత్తం 23 మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 14 విజయాలు సాధించగా, రాజస్థాన్ రాయల్స్ 9 మ్యాచ్‌ల్లో గెలిచింది. గతంలో జరిగిన నాకౌట్ మ్యాచ్‌ల్లోనూ రాజస్థాన్‌ను హైదరాబాద్ ఓడించిన ట్రాక్ రికార్డ్ ఉంది. అయితే ముల్లన్‌పూర్ వేదికపై రాజస్థాన్ రాయల్స్ ఆడిన గత 3 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి అజేయంగా నిలవడం విశేషం.

ఈ మ్యాచ్ బుధవారం, మే 27, 2026 రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ అధికారిక లైవ్ టెలికాస్ట్ టీవీలో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ద్వారా ప్రసారం కానుండగా, డిజిటల్ మొబైల్ యూజర్ల కోసం జియోహాట్‌స్టార్ యాప్, వెబ్‌సైట్‌లో ఉచితంగా లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉండనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

 

Follow Us