
IPL 2026 PBKS vs RCB : ఐపీఎల్ 2026లో భాగంగా ఈరోజు ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్ (PBKS), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరగనున్న 61వ మ్యాచ్ ఒక ప్రత్యేకతను సంతరించుకోనుంది. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్‌తో ఒక అరుదైన మైలురాయిని చేరుకోబోతున్నాడు. టాస్ వేయడానికి మైదానంలోకి అడుగుపెట్టగానే, ఐపీఎల్ చరిత్రలో కెప్టెన్‌గా 100 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఐదో ఆటగాడిగా అయ్యర్ రికార్డు సృష్టించబోతున్నాడు. ఇప్పటివరకు ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలు మాత్రమే ఉన్న ఈ ఎలైట్ క్లబ్‌లో ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ కూడా చేరబోతున్నాడు.
మూడు జట్లు.. ఒకే కెప్టెన్
శ్రేయస్ అయ్యర్ తన ఐపీఎల్ కెరీర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ జట్లకు నాయకత్వం వహించాడు. ఢిల్లీని ఫైనల్స్ వరకు తీసుకెళ్లిన అయ్యర్, కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టాడు. ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ బాధ్యతలు చేపట్టిన ఆయన, మొదట్లో వరుస విజయాలతో జట్టును టాప్-4లో ఉంచారు. అయితే గత ఐదు మ్యాచ్‌ల్లో పంజాబ్ వరుసగా ఓడిపోవడంతో ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. నేటి మ్యాచ్‌లో బెంగళూరును ఓడించి తన 100వ మ్యాచ్‌ను చిరస్మరణీయంగా మార్చుకోవాలని అయ్యర్ పట్టుదలతో ఉన్నాడు.
కెప్టెన్లుగా వంద మ్యాచులు ఆడిన వీరులు వీరే
ఐపీఎల్ చరిత్రలో కెప్టెన్లుగా అత్యధిక మ్యాచ్‌లు ఆడిన వారి జాబితాలో మహేంద్ర సింగ్ ధోనీ 235 మ్యాచులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ (158 మ్యాచ్‌లు), విరాట్ కోహ్లీ (143 మ్యాచ్‌లు), గౌతమ్ గంభీర్ (129 మ్యాచ్‌లు) వరుసగా ఉన్నారు. ఇప్పుడు 99 మ్యాచుల కెప్టెన్సీ అనుభవంతో ఉన్న శ్రేయస్ అయ్యర్, ఈరోజు తన 100వ మ్యాచ్‌ను ఆడబోతున్నాడు. చిన్న వయసులోనే కెప్టెన్సీ పగ్గాలు చేపట్టి ఇంతటి సుదీర్ఘ ప్రయాణం చేయడం అయ్యర్ నాయకత్వ పటిమకు నిదర్శనం.
ఆర్సీబీ వర్సెస్ పంజాబ్.. ఉత్కంఠ పోరు
గతంలో పంజాబ్‌ను ఓడించి ఆర్సీబీ తన తొలి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. అప్పటి నుంచి ఈ రెండు జట్ల మధ్య వైరం కొనసాగుతోంది. నేటి మ్యాచ్ ఆర్సీబీకి ఎంత ముఖ్యమో, పంజాబ్‌కు అంతకంటే ఎక్కువ ముఖ్యం. వరుస ఓటములతో సతమతమవుతున్న పంజాబ్, ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే ప్లేఆఫ్స్ రేసులో ఉంటుంది. మరోవైపు ఆర్‌సీబీ ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో తమ టాప్ పొజిషన్‌ను మరింత భద్రం చేసుకోవాలని భావిస్తోంది. శ్రేయస్ అయ్యర్ తన వందో మ్యాచ్‌లో జట్టును విజయపథంలో నడిపిస్తాడా లేక కోహ్లీ సేన విజయం సాధిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..