IPL 2026 : సాయి సుదర్శన్ వర్సెస్ వైభవ్ సూర్యవంశీ.. క్వాలిఫైయర్ 2లో ఆరెంజ్ క్యాప్ కోసం ఊరమాస్ వార్

IPL 2026 : ఐపీఎల్ 2026 లో అత్యధిక పరుగుల వేటలో రాజస్థాన్ రాయల్స్ (RR)కు చెందిన 15 ఏళ్ల సంచలన ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అందరినీ వెనక్కి నెట్టి మొదటి స్థానానికి దూసుకెళ్లాడు. గుజరాత్ టైటాన్స్ (GT) రన్ మెషిన్ సాయి సుదర్శన్‌ను వెనక్కి నెట్టి మరీ ఈ చిన్నోడు నెంబర్ వన్ సింహాసనాన్ని కైవసం చేసుకున్నాడు.

IPL 2026 : సాయి సుదర్శన్ వర్సెస్ వైభవ్ సూర్యవంశీ.. క్వాలిఫైయర్ 2లో ఆరెంజ్ క్యాప్ కోసం ఊరమాస్ వార్
Vaibhav Suryavanshi

Updated on: May 28, 2026 | 8:31 PM

IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. కేవలం రెండు మ్యాచ్‌ల ఫలితాలతో ఈ 19వ ఐపీఎల్ సీజన్ విజేత ఎవరో తేలిపోనుంది. ఒకవైపు డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వరుసగా రెండోసారి కప్పు కొట్టాలని చూస్తుంటే.. మరోవైపు రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు ఫైనల్ చేరడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. టీమ్స్ మధ్య టైటిల్ ఫైట్ ఎలా ఉన్నా.. వ్యక్తిగతంగా ఆటగాళ్ల మధ్య అత్యధిక పరుగులు చేసిన వారికి ఇచ్చే ఆరెంజ్ క్యాప్ కోసం మాత్రం ఊహించని రేంజ్‌లో రసవత్తర పోరు సాగుతోంది.

తాజా గణాంకాల ప్రకారం.. ఐపీఎల్ 2026 లో అత్యధిక పరుగుల వేటలో రాజస్థాన్ రాయల్స్ (RR)కు చెందిన 15 ఏళ్ల సంచలన ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అందరినీ వెనక్కి నెట్టి మొదటి స్థానానికి దూసుకెళ్లాడు. గుజరాత్ టైటాన్స్ (GT) రన్ మెషిన్ సాయి సుదర్శన్‌ను వెనక్కి నెట్టి మరీ ఈ చిన్నోడు నెంబర్ వన్ సింహాసనాన్ని కైవసం చేసుకున్నాడు. మే 27న సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌కు ముందు వైభవ్ సూర్యవంశీ ఆరెంజ్ క్యాప్ రేస్‌లో ఐదో స్థానంలో ఉన్నాడు. కానీ ఆ మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలర్లను ఉతికి ఆరబెడుతూ కేవలం 29 బంతుల్లోనే 97 పరుగుల రికార్డు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆరెంజ్ క్యాప్ రేస్‌లో ఏకంగా ఒకేసారి పెద్ద జంప్ చేసి మొదటి స్థానాన్ని చేరుకున్నాడు.

ఈ మ్యాచ్ కంటే ముందు అతని ఖాతాలో 583 పరుగులు ఉండగా.. ప్రస్తుతం 15 ఇన్నింగ్స్‌ల తర్వాత వైభవ్ సూర్యవంశీ మొత్తం 680 పరుగులతో టాప్‌లో నిలిచాడు. దీనితో ప్రస్తుతానికి ఆరెంజ్ క్యాప్‌ను తన తలపైనే ఉంచుకుని కింగ్‌లా నిలబడ్డాడు. వైభవ్ సూర్యవంశీ మొదటి స్థానంలో ఉన్నప్పటికీ ఆరెంజ్ క్యాప్ పోరు ఇంకా ముగిసిపోలేదు. గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ 652 పరుగులతో వైభవ్‌కు అత్యంత సమీపంలో రెండో స్థానంలో ఉన్నాడు. కేవలం 28 పరుగుల తేడాతో వైభవ్ వెనుక ఉన్నాడు.

హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ వంటి ఆటగాళ్లకు పెద్ద ఇన్నింగ్స్ ఆడి ఈ రేసులో నిలిచే అవకాశం ఉన్నప్పటికీ వారు ఫ్లాప్ అయ్యారు. దాంతో హైదరాబాద్ టోర్నీ నుండి నిష్క్రమించగా.. సాయి సుదర్శన్‌కు మాత్రం క్వాలిఫైయర్ 2 లో వైభవ్‌ను దాటేసే సువర్ణావకాశం లభించింది. సాయి సుదర్శన్ గత ఐపీఎల్ 2025 సీజన్లో కూడా ఆరెంజ్ క్యాప్ విన్నర్‌గా నిలిచాడనే విషయం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 2025 లో అతను 15 ఇన్నింగ్స్‌లలో ఏకంగా 759 పరుగులు చేసి టోర్నమెంట్‌లో అత్యుత్తమ బ్యాటర్‌గా నిలిచాడు.

ఇప్పుడు మళ్లీ ఐపీఎల్ 2026 లోనూ అదే మ్యాజిక్‌ను రిపీట్ చేస్తూ వరుసగా రెండోసారి ఆరెంజ్ క్యాప్ అందుకోవాలని సాయి సుదర్శన్ కసిగా ఉన్నాడు. మే 29న జరగబోయే క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో రాజస్థాన్, గుజరాత్ జట్లు తలపడనున్న నేపథ్యంలో.. ఈ మ్యాచ్‌లోనే సాయి సుదర్శన్ వర్సెస్ వైభవ్ సూర్యవంశీ ఆరెంజ్ క్యాప్ క్లాష్ లైవ్‌గా చూడబోతున్నాం. రాజస్థాన్ వర్సెస్ గుజరాత్ మ్యాచ్ కేవలం ఫైనల్ బెర్త్ కోసమే కాదు.. ఆరెంజ్ క్యాప్ విన్నర్ ఎవరో డిసైడ్ చేయడానికి కూడా అత్యంత కీలకంగా మారింది. ఒకవేళ సాయి సుదర్శన్ ఈ మ్యాచ్‌లో 28 కంటే ఎక్కువ పరుగులు చేస్తే వైభవ్‌ను దాటేస్తాడు.

అయితే రాజస్థాన్ ఓపెనర్ వైభవ్ కూడా అదే మ్యాచ్‌లో భారీ ఇన్నింగ్స్ ఆడితే సాయి సుదర్శన్‌కు అందనంత ఎత్తులో నిలుస్తాడు. 15 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ ఆరెంజ్ క్యాప్ గెలిచి చరిత్ర సృష్టిస్తాడా, లేక సీనియర్ ప్లేయర్ సాయి సుదర్శన్ తన అనుభవంతో వరుసగా రెండోసారి క్యాప్ కొడతాడా అనేది ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us