
KL Rahul : ఐపీఎల్ 2026 లీగ్ దశ చివరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ చెలరేగిపోయారు. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై కేవలం 30 బంతుల్లోనే 60 పరుగులు చేసి సంచలనం సృష్టించారు. ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో ఐపీఎల్ చరిత్రలో వికెట్ కీపర్ బ్యాటర్‌గా మహేంద్ర సింగ్ ధోనీకి కూడా సాధ్యం కాని ఒక అరుదైన రికార్డును ఆయన తన పేరిట లిఖించుకున్నారు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన లీగ్ దశ 70వ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే మొదటగా ఢిల్లీ క్యాపిటల్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించారు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ ప్రారంభించిన 34 ఏళ్ల కేఎల్ రాహుల్ మైదానంలో పరుగుల వరద పారించారు. కేవలం 30 బంతుల్లోనే ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 60 సాధించారు. రాహుల్ ఐపీఎల్ కెరీర్‌లో ఇది 45వ హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఆయన అందించిన భారీ ఆరంభంతో ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. కేఎల్ రాహుల్‌తో పాటు కెప్టెన్ అక్షర్ పటేల్ ముప్పై తొమ్మిది పరుగులు, డేవిడ్ మిల్లర్ ఇరవై ఎనిమిది పరుగులు చేసి జట్టుకు మంచి స్కోరును అందించారు.
ఈ మ్యాచ్‌లో సాధించిన హాఫ్ సెంచరీ ద్వారా కేఎల్ రాహుల్ ఒకే ఐపీఎల్ సీజన్లలో అత్యధిక సార్లు 50 కంటే ఎక్కువ పరుగులు చేసిన వికెట్ కీపర్ బ్యాటర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించారు. ఐపీఎల్ 2026 సీజన్లో రాహుల్‌కు ఇది ఆరవ హాఫ్ సెంచరీ. ఐపీఎల్ సుదీర్ఘ చరిత్రలో ఒక వికెట్ కీపర్ ఒకే సీజన్లో ఆరు సార్లు 50+ పరుగులు సాధించడం ఇది నాలుగో సారి మాత్రమే.
అయితే ఈ ఘనతను రెండు వేర్వేరు సీజన్లలో సాధించిన ఏకైక వికెట్ కీపర్‌గా రాహుల్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. గతంలో 2018 సీజన్లో కూడా ఆయన ఆరు హాఫ్ సెంచరీలు సాధించారు. క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన కెరీర్‌లో ఒకే సీజన్లలో గరిష్టంగా నాలుగు హాఫ్ సెంచరీలు మాత్రమే సాధించారు. 2013 సీజన్లో ధోనీ ఈ మైలురాయిని అందుకున్నారు. ప్రస్తుతం రాహుల్‌తో పాటు రిషభ్ పంత్, ప్రభ్‌సిమ్రన్ సింగ్ మాత్రమే ఒకే సీజన్లో ఆరు హాఫ్ సెంచరీలు సాధించిన వికెట్ కీపర్లుగా జాబితాలో ఉన్నారు.
కేఎల్ రాహుల్‌కు ఈ ఐపీఎల్ సీజన్ రికార్డుల పరంగా ఎంతో అద్భుతంగా సాగింది. గత నెలలోనే పంజాబ్ కింగ్స్‌పై ఆయన కేవలం 67 బంతుల్లోనే 152 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. ఇది ఐపీఎల్ చరిత్రలోనే మూడవ అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం గమనార్హం. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఈ సీజన్లో ప్లేఆఫ్ రేసు నుంచి ముందే తప్పుకున్నప్పటికీ, రాహుల్ ఆడిన ఇన్నింగ్స్ ఆయనలోని ఆటతీరును, అనుభవాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. ఓపెనర్‌గా, వికెట్ కీపర్‌గా ఆయన లీగ్ చరిత్రలో తన ముద్రను మరింత బలంగా సుస్థిరం చేసుకున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..