Hardik Pandya : హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ ఊడిపోవడం ఖాయం.. జట్టు నుంచి కూడా సాగనంపేందుకు ముంబై భారీ స్కెచ్

Hardik Pandya : ఐపీఎల్ 2026 లో ముంబై ఇండియన్స్ ఘోర పరాజయం తర్వాత కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై మేనేజ్‌మెంట్ వేటు వేయనుంది. రోహిత్ శర్మ కొత్త కెప్టెన్ ఎంపికలో కీలకం కానున్నారు. 2022లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు కెప్టెన్‌గా ఉండి తొలి సీజన్‌లోనే టైటిల్ అందించి సక్సెస్ ఫుల్ లీడర్‌గా హార్దిక్ నిలిచాడు.

Hardik Pandya : హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ ఊడిపోవడం ఖాయం.. జట్టు నుంచి కూడా సాగనంపేందుకు ముంబై భారీ స్కెచ్
Hardik Pandya

Updated on: May 29, 2026 | 10:53 AM

Hardik Pandya : ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఐపీఎల్ 2026 సీజన్‌లో జట్టు ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో.. కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై వేటు వేసేందుకు యాజమాన్యం సిద్ధమైనట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ స్థానంలో ఎన్నో అంచనాలతో ముంబై పగ్గాలు చేపట్టిన హార్దిక్.. వరుసగా జట్టును ముంచేయడంతో అతని కెప్టెన్సీని పీకేయడమే కాకుండా, కనీసం ఆటగాడిగా కూడా జట్టులో ఉంచాలా వద్దా అనే కోణంలో తీవ్రమైన చర్చలు నడుస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ఐపీఎల్ 2026 సీజన్ ముంబై ఇండియన్స్‌కు ఒక పీడకలలా మిగిలింది. హార్దిక్ పాండ్యా సారథ్యంలో బరిలోకి దిగిన ఐదుసార్లు ఛాంపియన్ ముంబై.. ఆడిన 14 లీగ్ మ్యాచ్‌లలో ఏకంగా 10 మ్యాచ్‌ల్లో ఘోరంగా ఓడిపోయింది. కేవలం 4 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో 9వ స్థానంతో సరిపెట్టుకుంది. ఈ దారుణమైన ప్రదర్శన తర్వాత హార్దిక్ ఫ్యూచర్‌పై తీవ్రమైన ఊహాగానాలు మొదలయ్యాయి. వీటికి మరింత బలం చేకూరుస్తూ.. ముంబై ఇండియన్స్ ఐపీఎల్ ప్రయాణం ముగిసిన కొద్దిరోజులకే హార్దిక్ పాండ్యా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేయడం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

గతంలో 2022లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు కెప్టెన్‌గా ఉండి తొలి సీజన్‌లోనే టైటిల్ అందించి సక్సెస్ ఫుల్ లీడర్‌గా హార్దిక్ నిలిచాడు. దాంతో 2020 తర్వాత ఐపీఎల్ కప్పు గెలవని ముంబై యాజమాన్యం.. రోహిత్ శర్మకు పర్ఫెక్ట్ వారసుడు హార్దికే అని భావించి భారీ ట్రేడింగ్‌తో వెనక్కి తెచ్చుకుంది. కానీ సీన్ రివర్స్ అయింది. 2024 లో హార్దిక్ కెప్టెన్ కాగానే హోమ్ గ్రౌండ్ వాంఖడే స్టేడియంలోనే సొంత అభిమానులు అతడిని బూతులు తిడుతూ హేళన చేశారు. ఆ ఏడాది ముంబై చివరి స్థానంలో నిలిచింది. 2025 లో కాస్త కోలుకుని ప్లేఆఫ్స్ చేరినప్పటికీ.. మళ్లీ 2026 లో జట్టు పూర్తిగా చేతులెత్తేయడంతో హార్దిక్ కెప్టెన్సీకి ఎండ్ కార్డ్ పడినట్లేనని సమాచారం.

ముంబై ఇండియన్స్ క్యాంప్‌లో సమస్య కేవలం హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ మాత్రమే కాదని, జట్టులోని సీనియర్ ఆటగాళ్ల ప్రవర్తన కూడా ఫ్రాంచైజీకి తలనొప్పిగా మారిందని లోపలి వర్గాలు చెబుతున్నాయి. ఈ సీజన్ లో రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ వంటి స్టార్లతో జట్టు బలంగా కనిపించినా మైదానంలో మాత్రం రాణించలేదు. కోచింగ్ స్టాఫ్ డేటా ఆధారంగా కొన్ని వ్యూహాలను సూచించినప్పటికీ, సీనియర్ ఆటగాళ్లు వాటిని అస్సలు పట్టించుకోలేదని తెలుస్తోంది. ఎంతటి స్టార్ ప్లేయర్లు అయినా కోచ్ మాట వినాల్సిందేనని మేనేజ్‌మెంట్ సీరియస్‌గా ఉన్నట్లు టాక్.

హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ నుంచి తొలగించడంపై ముంబై ఇండియన్స్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఫ్రాంచైజీకి చెందిన ఒక పాత సీనియర్ సభ్యుడు లీక్ చేసిన సమాచారం ప్రకారం.. రాబోయే రోజుల్లో ముంబై మేనేజ్‌మెంట్ ఒక పెద్ద సమీక్షా సమావేశాన్ని నిర్వహించనుంది. “హార్దిక్ ముంబై జట్టును నడిపించగలడా? అసలు అతడిని జట్టులో కేవలం నార్మల్ ప్లేయర్‌గా అయినా ఉంచాలా? లేదా పూర్తిగా వదిలేయాలా?” అనే అన్ని ఆప్షన్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేసే విషయంలో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఆశీస్సులు మరియు నిర్ణయం చాలా కీలకం కానున్నాయి.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us