AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 Final : ఐపీఎల్ ఫైనల్‌కు వరుణ గండం..? ఒకవేళ రద్దయితే ట్రోఫీ ఎవరిది? రూల్స్ ఏం చెబుతున్నాయి

IPL 2026 Final : ఫైనల్‌లో తలపడుతున్న ఆర్‌సీబీ, గుజరాత్ జట్లు తమ కెరీర్‌లో రెండో ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాలని పట్టుదలతో ఉన్నాయి. గత ఏడాది పంజాబ్ కింగ్స్‌ను ఓడించి ఆర్‌సీబీ తన సుదీర్ఘ ట్రోఫీ నిరీక్షణకు తెరదించిన సంగతి తెలిసిందే.

IPL 2026 Final : ఐపీఎల్ ఫైనల్‌కు వరుణ గండం..? ఒకవేళ రద్దయితే ట్రోఫీ ఎవరిది? రూల్స్ ఏం చెబుతున్నాయి
Ipl 2026
Rakesh
|

Updated on: May 31, 2026 | 10:48 AM

Share

IPL 2026 Final : ఐపీఎల్ 2026 మహా సంగ్రామం క్లైమాక్స్‌కు చేరింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) జట్ల మధ్య ఆదివారం ఫైనల్ పోరు జరగనుంది. అయితే, గత రెండు రోజులుగా దేశంలోని పలు ప్రాంతాల్లో వాతావరణం మారడంతో, ఒకవేళ ఫైనల్ మ్యాచ్‌కు వర్షం పడితే విజేతను ఎలా ప్రకటిస్తారనే ఆసక్తికరమైన చర్చ క్రికెట్ అభిమానుల్లో మొదలైంది.

రెండో టైటిల్ కోసం ఇరు జట్ల వేట

ఈ మెగా ఫైనల్‌లో తలపడుతున్న ఆర్‌సీబీ, గుజరాత్ జట్లు తమ కెరీర్‌లో రెండో ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాలని పట్టుదలతో ఉన్నాయి. గత ఏడాది పంజాబ్ కింగ్స్‌ను ఓడించి ఆర్‌సీబీ తన సుదీర్ఘ ట్రోఫీ నిరీక్షణకు తెరదించిన సంగతి తెలిసిందే. అదే వేదికపై ఇప్పుడు వరుసగా రెండోసారి కప్ గెలవాలని చూస్తోంది. మరోవైపు, ఐదేళ్లలో మూడోసారి ఫైనల్ చేరుకున్న గుజరాత్ టైటాన్స్, తమ అరంగేట్రం సీజన్ 2022 నాటి మ్యాజిక్‌ను రిపీట్ చేయాలని భావిస్తోంది.

అహ్మదాబాద్ వాతావరణం ఎలా ఉంది..?

చండీగఢ్‌లో క్వాలిఫైయర్-2 ముగిసిన తర్వాత గుజరాత్ జట్టు అహ్మదాబాద్ రావడంలో వాతావరణం కారణంగా తీవ్ర ఆలస్యం జరిగింది. అయినప్పటికీ, మ్యాచ్ జరిగే అహ్మదాబాద్‌లో ఆదివారం వాతావరణం చాలా అనుకూలంగానే ఉండే అవకాశం ఉందని సమాచారం. అక్యూవెదర్ నివేదిక ప్రకారం మ్యాచ్ రోజున ఇక్కడ వర్షం పడే అవకాశం కేవలం 5 శాతం మాత్రమే ఉంది. ఆకాశం కూడా 15 శాతం మాత్రమే మేఘావృతమై ఉంటుందని, కాబట్టి మ్యాచ్‌కు పెద్దగా ఆటంకం ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు.

రిజర్వ్ డే రూల్స్ ఏం చెబుతున్నాయి?

క్వాలిఫైయర్, ఎలిమినేటర్ మ్యాచ్‌లకు లేనప్పటికీ, బీసీసీఐ ఫైనల్ మ్యాచ్ కోసం మాత్రం ప్రత్యేకంగా రిజర్వ్ డే (సోమవారం, జూన్ 1) కేటాయించింది. ఆదివారం మ్యాచ్ ప్రారంభమై వర్షం కారణంగా నిలిచిపోతే, సోమవారం ఎక్కడైతే మ్యాచ్ ఆగిందో అదే స్కోరు, అదే బంతి నుంచి ఆటను కొనసాగిస్తారు. ఒకవేళ ఆదివారం అసలు ఒక్క బంతి కూడా పడకుండా రద్దయితే, సోమవారం కొత్తగా మ్యాచ్‌ను నిర్వహిస్తారు.

రిజర్వ్ డే రోజు కూడా వర్షం పడితే

క్రికెట్ అభిమానులను వేధిస్తున్న అసలు ప్రశ్న ఇదే. ఒకవేళ రిజర్వ్ డే అయిన సోమవారం కూడా భారీ వర్షం పడి, కనీసం ఐదు ఓవర్ల మ్యాచ్ లేదా సూపర్ ఓవర్ నిర్వహించడానికి కూడా సాధ్యపడకపోతే ఏం జరుగుతుంది? అలాంటి అత్యవసర పరిస్థితి వస్తే, లీగ్ స్టేజ్ పాయింట్ల పట్టిక ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. పాయింట్ల పట్టికలో గుజరాత్ కంటే ఆర్‌సీబీ పైస్థానంలో ఉన్నందున, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును ఐపీఎల్ 2026 ఛాంపియన్‌గా ప్రకటిస్తారు.

రజత్ పాటిదార్‌కు అరుదైన రికార్డు అవకాశం

ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ఈ ఫైనల్ గెలిస్తే చరిత్ర సృష్టించనున్నాడు. ఐపీఎల్ చరిత్రలో బ్యాక్-టు-బ్యాక్ (వరుసగా రెండు సార్లు) ట్రోఫీలు గెలిచిన మూడో కెప్టెన్‌గా అతను రికార్డుకెక్కుతాడు. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఎమ్మెస్ ధోని, ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ శర్మ మాత్రమే ఈ ఘనత సాధించారు. క్వాలిఫైయర్-1లో గుజరాత్‌ను 92 పరుగుల తేడాతో ఓడించిన ఆర్‌సీబీ, అదే జోష్‌తో ఫైనల్లోనూ నెగ్గాలని ప్లాన్ చేస్తోంది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us